మార్షల్ యుద్ధ సమయమందుకాని, ప్రాణాపాయ సమయమునందుకాని, ఎట్టి కఠినమైన స్థితియందైననుకాని నీతిని విసర్జించకూడదని బోధించాడు. విక్టోరియా రాణి ప్రధానమంత్రియైన విలియమ్ గ్లాడ్స్టన్ నీతి నిజాయితీలను సర్వకాలములయందు పోషించినాడు. కనుకనే విక్టోరియా రాణి కంటెను ప్రధానమంత్రినిప్రజలు గౌరవించేవారు. ఈనీతి ఇంద్రియ నిగ్రహంచేత అలవడుతుంది. ఎవరినవారు శాసించుకోగలిగిన శక్తిని కలిగినవారే, ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. తనను తానే శాసించుకోలేని బలహీనుడు ఇతరులను ఏరీతిగా శాసించగలడు? కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకొనుటకు తగిన కృషిచేయాలి. తనమాట, తన ప్రవర్తన రెండింటినీ ఏకంగావించే జీవితం గడపాలి. ఈ విధంగా మాట, క్రియ ఏకమై నప్పుడే తాను మహత్తరమైన విభూతులను అనుభవించగలడు. " ఏమానవుడు తాను చెప్పిన మాట ప్రకారముగా నడచుకొనునో అట్టివాడు మనిషేకాదు, మహిమాన్వితుడగును. ఏమానవుడు తాను చెప్పిన మాట ప్రకారంగా నడచుకొనడో, అట్టివాడు మనిషి కాదు. కేవలం మృగమే".ఈనాటి మానవ సమాజములో మాటకు, క్రియకు సంబంధము లేదు. మాట, క్రియతో కూడినదే సత్యము. మనస్సు, మాట, క్రియతో కూడినదే ఋతము.
(స. సా.జాన్.91 పు.158)