విశ్వవిరాట్టుస్వరూపుము
భగవద్గీతయందు అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించిన - విశ్వరూప సందర్శనము ను గురించి వర్ణింపబడింది. ఈ ఉదంతముయొక్కఅంతరార్థమును భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఈ విధంగా వివరించారు.
"గీతోపదేశము" చేసేది యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశమును స్వీకరించి స్వాగతించువాడు, ధనుర్ధరుడైన అర్జునుడు. ఆ విశ్వవిరాట్స్వరూపమునందు అర్జునుడు ప్రతిమానవునియందు దాగియున్న పరమాత్ముని దర్శించినాడు. అది శ్రీకృష్ణుని దివ్యత్వ ప్రకటనము మాత్రమే కాదు, అర్జునునియందున్న దివ్యత్వ ప్రకటన కూడ!
వృక్షములను చూడండి! మఱ్ఱివృక్షము సప్తస్తంభములు కలిగిన పెద్ద భవనము వలె ఉండును. అయితే, మఱ్ఱి విత్తనమును కోసి చూచిన ఏమీ కనపడదు. ఆవగింజవలెనే దాని ఆకారము బహుసూక్ష్మమైనది. కాని, అన్ని కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు ఆ విత్తనములోనే దాగియున్నవి. అది తెలిసినపుడు ఇదంతా భ్రమయా లేక సత్యమా? అని ఆశ్చర్యపడుదురు. కాదు, కాదు, భగవంతుడే “బీజం మాం సర్వ భూతానాం అని చెప్పినాడు కదా! అణువునుండి ఘనమువరకు ఆ బీజముయొక్క ప్రకాశమే! ఆ బీజమే విశ్వముగా మారినది. అదే విశ్వవిరాట్స్వరూపము.
హృదయ క్షేత్రమున నామ బీజమును నాటి ప్రేమ జలము పోసిన అది పెద్ద వృక్షముగా మారును. "సహస్ర శీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్” అని వర్ణిస్తారు. ఆ విశ్వవిరాట్స్వరూపుని అంతర్దృష్టితో బింబమును (దైవమును), బాహ్యదృష్టితో ప్రతిబింబమును (సృష్టిని) దర్శించుటకు ప్రయత్నము చేయాలనేదే శ్రీకృష్ణుని బోధ. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః అనే భావము దృఢమయ్యేవరకు సాధన అత్యవసరము. (భాష్యార్థ గోప్యములు పు 54-55)