ఆనాటి వేదపురుషులంతా యేమీ తెలియని మూర్ఖులుగాను జ్ఞానములేని వారుగాను, సైన్సు తెలియని అమాయికులుగాను ఈనాటివారు భావిస్తున్నారు. వారు ఈనాటి సైన్సులో తెలిసిన దానికంటే మరింత అధికముగానే తెలిసినవారు. ఆనాటి హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్టు. ఆ సైంటిస్టు పొందినదాంట్లో వేయింట ఒక భాగము ఈనాటి సైంటిస్టు పొందలేదు. అతడు సముద్రము అడుగుభాగమున సంచరించినాడు. భూమినంతా శోధించినాడు. గగన మార్గములో సంచరించినాడు. ప్రతి అణువునందు పరిశోధనలు సలిపినాడు. పంచ భూతములను హస్తగతము చేసుకున్నాడు. అంత తెలుసుకున్నప్పటికి తనను తాను తెలుసుకోలేకపోయాడు. ఆనాటి మహర్షుల తత్వము ఈ విధంగా కంపేర్ చేసుకోటానికి వీలుకాదు. ఒక్కొక్క మహర్షి ఏ విధమైన తపస్సు నాచరించి ఎంతటి దివ్యమైన శక్తిని సాధిస్తూ వచ్చారు? ఆనాటి డాక్టర్సుఅందరూ ఆపరేషన్స్ చేసినారు. ఎన్నిరకములైన ట్రైనింగులు పోందో, ఎన్ని దేశములకు వెళ్లో, ఎన్ని ప్రాణములు తీసో ఈనాటి వారు పెద్ద పెద్ద డాక్టర్సుగా తయారౌతున్నారు. ఎన్నిరకములైన ఉపకరణములనో తీసుకున్నారు. ఆనాటి శస్త్రచికిత్స వైద్యములో మహా ప్రవీణుడైనవాడు భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి శస్త్రచికిత్సను చక్కగా చాలా సులభంగా ప్రపంచమున కందించినారు. ఇదియే ప్రకృతి చికిత్స: ఆయుర్వేదము. ఆయువునందించే వేదము ఆయుర్వేదము. ఐతే ఇది క్విక్ గా పనిచేయటం లేదని మనం తొందరపడుతున్నాం. మనకు ఎప్పుడు ప్రతిదానికి క్విక్ రిజల్ట్ రావాలి. క్విక్ రిజల్ట్ లో క్విక్ అనే దానికి విరుద్ధంగా రిజల్ట్ వుంటుంది. ఈ నాడు ఆంటీబయాటిక్సు మాత్రలు వచ్చేసినాయి. క్విక్ రిజల్ట్ కోసం రెండు మాత్రలు వేసుకుంటే టెంపరేచరు తగ్గిపోతుంది. కాని తరువాత ఎక్కువ పెరుగుతుంటాది. దీని రియాక్షన్ అధికంగా మారుతున్నాయి. ఆనాటి తపశ్శక్తిలో ఈ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ ఏమాత్రం ఉండదు. అది తపశ్శక్తివల్ల జరిగేది. ఎన్నివేల మైళ్లలో వుండి తపస్సు చేస్తున్నప్పటికిని వారికి దూరదర్శనము ప్రాప్తించింది. ప్రకృతిలో ముఖాముఖీగా సంభాషణ సల్పేవారు. కోట్లు ఖర్చు పెట్టి యంత్రాలు పంపించి మనము దూరదర్శనము, దూర శ్రవణము ఈనాడు అనుభవిస్తున్నాము. ఆనాడు ఒక్క పైస ఖర్చులేదు. మనస్సు పవిత్రమైన దివ్యత్వముగా మార్చుకోటం చేతనే ఇట్టి శక్తులంతా వారికి చేకూరుతూ వచ్చాయి.
(ఉ.బ.పు. 23/24)