వైశేషిక దర్శనము

చరిత్రకు పూర్వము దివ్యజ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించిన దేవవాణిని శ్రద్ధగా పరిశీలించి సలిపి అందలి సత్యసూక్తులను జగత్తుకు ప్రచారప్రబోధములు సలుపుతూ వచ్చారు. ప్రపంచమున వున్నవి రెండే వస్తువులు.ఒకటి పరార్థము, రెండు పదార్థము. కానీ పదమునకు అర్థములను ప్రబోధించి, జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వములోని అనేకత్వాన్ని నిరూపణ జరిపి చాటివాడు పాణిని. పదార్థము యొక్క స్వరూపమునే అంతరార్థముగా విశ్వసించి ఆ పదార్థ స్వరూప జ్ఞానమును లోకములో ప్రచారము చేసిన మహనీయుడు కాణాదుడు . ఈ కాణాద దర్శనమే వైశేషికము. దీనికి కాణాదుడే మూలకారకుడు. అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచమున చాటి పదార్థము అశాశ్వతమనియు. పరార్థము శాశ్వతమనియు జగత్తుకు నిరూపించటానికి ఈ వైశేషిక దర్శనము ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ ప్రపంచమునందలి సమస్త విద్యలూ వేదము నుండి ఆవిర్భవించినట్టివే. ఈ సర్వ విద్యలూ భౌతికమైన జగత్తులో అనుభవింపజేసేటటువంటివే. కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన, లౌకికమైన క్షణికమైన విద్యలను త్యజించి అలౌకికమైన అభౌతికమైన దివ్యత్వము నిమిత్తమై తమ జీవితాన్ని అంకితము చేస్తూ వచ్చారు. తపశ్శక్తిచేత అభౌతికములైన సత్యమును హస్తగతము గావించుకున్నవారు ఆనాటి మహనీయులు. పదార్థజ్ఞానములో పరిశీలన జరిపినప్పుడు భిన్నరూపాలు మాత్రమే మనకు గోచరిస్తాయి. అంతరార్ధ భావమునందు ఆచరణ సల్పినప్పుడు పరిశీలన సల్పినప్పుడు అన్నింటి యందును ఉన్నది ఒకే దివ్యత్వమని స్పష్టమగుచున్నది. కొండలన్నీ బండలే. భూమియంతయూ మృణ్మయమే వృక్షము లన్నియూ కాష్టమయములే. మానవులందరూ మాంసమయమే. ఆకారములో, రూపనామములలో వస్తువు యొక్క విశిష్టతలు వివిధమైనట్టి స్వరూప స్వభావములను నిరూపించవచ్చును. అంతరార్థమునుదర్శనలు పరిశీలించినప్పుడు అన్నింటియందు ఉండినటువంటిది ఈ పంచభూతములే.

 

ఈ పంచభూతముల యొక్క వికాసస్వరూపములే ఈ వృక్షములు, ఈ కొండలు ఈ భూమి, ఈ మానవ స్వరూపాలు. సమస్త ప్రాణికోటి కూడా పంచభూతములయొక్క అంతరార్థములే. ఈ భేదములు భౌతికమైనటు వంటి దృష్టిభేదములే కాని అలౌకికమైనట్టి ఆత్మభేదములు కావని ఈ వైశేషిక సూత్రములు ప్రబోధిస్తూ వచ్చాయి. ఒక అణువునకు మరొక అణువునకు భేదమును నిరూపణ చేసినటువంటి దానికి విశేషము అన్నారు. విశేషమును నిరూపింపజేసినట్టిదానికే వైశేషికము అని పేరు వచ్చింది. విశేషమనగా ఒక విధమైన అంతర్భావము. సమస్త పదార్థములయందు విశిష్టత అయినట్టి ఆధారభూతమును ఆధారము చేసుకొని ఇటువంటి విశేషమును నిరూపణ చేసినదే వైశేషికము. ప్రపంచమంతా అణుమయమే. ఒకఅణువునకు మరొక అణువునకు ఎంతో భేదము కనిపిస్తుంది. ఈ ప్రపంచము సత్యస్వరూపమని కూడనూ నిరూపిస్తూ వచ్చింది వైశేషికము. ప్రకృతి పదార్థము సత్యమే అని నిరూపిస్తూ వచ్చింది. స్వరూపములు మారినప్పటికీ పదార్థములు మారునని కావు అని నిరూపిస్తూ వచ్చింది. మట్టితో కుమ్మరి కుండలు చేసాడు. కుండలు పగిలిపోయినవి. ముక్కలైనవి. మట్టిగా మారినవి. కుండలు ముక్కలుగా మారిన కాని మట్టి మారలేదు. ఈ పదార్థము సత్యమేనని నిరూపించింది వైశేషికము. ఇది వెండి టంబ్లరు. ఈ వెండి టంబ్లరును కరిగించి వెండి ప్లేటుగా చేసుకోవచ్చును. వెండి ప్లేటును కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చును. ఈ విధముగా ఆకారములు ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు. కదా. కనుక పదార్థము కూడనూ ఈ జగత్తులో సత్యమేనని ప్రబోధించి ప్రచారము సల్పినదే వైశేషికము.

 

ఇంక పంచభూతముల యొక్క తత్వము ఏనాడు కూడనూ మారునది కాదు. పంచభూతములు భగవత్ అంశములు. శబ్దముల యందు వివిధములైన శబ్దములుండవచ్చునుఆధారశబ్దము ఏనాటికీ మారునది కాదు. ఒక హార్మోనియమ్ కు గాలి వేస్తుంది. గాలి వొక్కటే. కానీ రీడ్స్ వత్తినప్పుడు స,రి,,,,,ని.అనే వేరు సప్తస్వరములు వస్తాయి. ఈ సప్తస్వరములకు ఒక్క గాలియే ఆధారము. ఆ గాలియే ఓంకారము. ఈ స్వరములే వికారములు. ఇన్ని వికారములు కూడనూ ఒక్క ఓంకారము నుండియే ఆవిర్భవించినవని పదార్థము మారినా పరార్థము మారదని, శాశ్వతమని నిరూపిస్తూ వచ్చింది. యీ వైశేషికము. దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకొన్నది. ఈ ఆధారములుకూడనూ ప్రకృతమైన ఆధారములనే తీసుకొన్నది. లోకములో స్త్రీలు ఉన్నారు. పురుషులు ఉన్నారు. ఈ యిరువురికి లింగభేదములుండవచ్చును కానీ వీరిలో ఏ మాత్రముకూడనూ హెచ్చుతగ్గులుగానీ లేవని ఖండిస్తూ వచ్చింది. వైశేషికము. పురుషులు అధికమని, స్త్రీలు తక్కువని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూచుకుంటూ అనుభవిస్తున్నారు. కానీ వైశేషికము ఇరువురూ సమానమే అని చెప్పింది. పురుష సహకారమే లేకుండిన స్త్రీ ఎట్టి కార్యము కూడనూ సాధించలేదని ఆదే విధముగా స్త్రీ సహకారము లేకుండిన పురుషుడు ఏకార్యము నందు విజయము సాధించలేడని అనేక ప్రామాణములచేత నిరూపిస్తూ వచ్చింది. సమాజము ఇట్టి దురవస్థలకు ఈనాడు గురికావడానికి కారణమేమిటి? ఈ అల్పభేదములను పెంచుకొని ఆత్మతత్వాన్ని విస్మరించి ఏకత్వమును అనేకత్వముగా మార్చుకొనుట చేనే సమాజము యింతటి దురవస్థలకు గురవుతూ వచ్చింది.

 

మానవునికి శాంతి లేకపోవటానికి కారణమేమిటి? శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు. సమాజము నుండి సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు. కానీ ప్రతి మానవుడు తాను ఈ సమాజమునకు చేసిన ఉపకారము ఏమిటని మంచి ఏమిటని తనకు తాను ప్రశ్నవేసుకొంటే ఏమాత్రమూ జవాబు చిక్కటం లేదు. ప్రపంచానికి నీవు ఏమైనా మంచి చేస్తే కదా, ప్రపంచమునీకు మంచి చేసేది. ప్రపంచము యొక్క శాంతిని నీవు ఆశించి ప్రపంచ శాంతికి పాటుపడినప్పుడే ప్రపంచము కూడనూ శాంతినందిస్తుంది. కనుకనే ప్రపంచమునుండి నీవు అనుభవించే సుఖదుఃఖములన్నీ నీ భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికము చక్కగా బోధిస్తుంది.ఇవియే అంతర్ విశేషములు. ఈ విశేషములను పురస్కరించుకొనియే దీనికి వైశేషికమని కూడా పేరు వచ్చింది. "ప్రపంచము నాకు ఏ సుఖమునందిస్తున్నది?" అని ప్రశ్నించుకుంటున్నావే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖాన్ని అందించాను? ప్రపంచము నాకు ఏమి మేలు చేస్తున్నదని అని ఆశించుతున్నావే గానీ ప్రపంచానికి నేను ఏమి మేలుచేసాను, అని ప్రశ్నించుకోవటం లేదు. కనుకనే వైశేషికము ఇలాంటి ప్రశ్నలంతా వేసి జగత్తునందు ఆ సమాధానమును పొంది ఆ సమాధానమును ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చింది. కనుక మనము చేసే కర్మలు ఉత్తమమైనవిగాను, మానవత్వమునకు సంబంధించినవిగాను విచారించి చేయాలి.

 

పరమాణువునందు మహత్తరమైన శక్తి వుంటున్నది. భేదములను పురస్కరించుకొని మనము ఆంతరార్థమును గుర్తించాలి. ఇంతేకాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్యస్వరూపాన్ని నిరూపించే దివ్యజ్యోతులను కూడనూ ఈ వైవేషికము అందిస్తూ వచ్చింది. త్రికాల భాధ్యమైనదే సత్యముని నిరూపిస్తూ వచ్చింది. ఈ సర్యమునందు భేదములెందుకు? శుక్ల యజర్వేదము నందు కూడనూ చక్కని ఆదర్శములిచ్చే అనుభూతులను అందిస్తూ వచ్చింది. ఈ వేదముల యొక్క సూత్రములను వైవేషికము చక్కగా పరిశీలనసల్పి

"ఓ మానవుడా!

ఒక్క గూటి పిట్టలం

ఒక్క తల్లి పిల్లలు

ఒక్క తీగ పువ్వులం

ఒక్క జాతి పౌరులం

 

అందరం మానవులమే ఎందుకు ఈ భేదములు? ఎందుకు ఈ రాగద్వేషములు? నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావు.కానీ పరులను కాదు నాయనా! అని ప్రబోధించింది. ఒక్క గూటి పిట్టలమే. ఏమిటి ఆ గూడు? దేహమనే గూడు అందరికీ ఉంటున్నది. ఆ గూటిలోనున్నవి ఈ జీవులు. అందుకోసమే పూర్వకాలములో పాడేవారు. "పలుకవే బంగారు చిలుకా" అని. ఆ చిలుకను ఈ దేహమనే పంజరములో పెట్టి పెంచుతున్నారని. అనేక పర్యాయములు చెప్పాను. దేహము పాంచభౌతికము. ఇందులో క్షణక్షణమూ నీచులూరునే గాని పుసుగు జవ్వాదీలు పుట్టబోవు", ఇలాంటి గూడునందు ఎంతవరకూ వుంటుంది. ఈ పిట్ట? రెక్కలు వచ్చేవరకు మాత్రమే గూడులో వుండి గూడును క్షేమముగా కాపాడుకుంటుంది. రెక్కలు రాగానే గూడును కూడనూ శిథిలము చేసి వెళ్ళిపోతుంది. కనుకనే మనకు ఆత్మ జ్ఞానము వచ్చువరకు మాత్రమే ఈ గూడును ఛిన్నాభిన్నము చేసి దీని పైన వైరాగ్యము పూని దీనిని మనము విసర్జించి పోతున్నాము. ఈ దేహమనే గూడు అందరికీ ఉంటున్నది. ఈ గూడులు వివిధరూపములుగా వుండినప్పటికీ అన్ని కూడ గూడులే కనుక అనేకత్వములో ఉండిన ఏకత్వాన్ని మనము తీసుకోవాలి. ఒక్క తల్లి పిల్లలమే. ఎవరు ఆ తల్లి? భూమాత. ప్రతి మానవుడు భూమి నుండి ఆవిర్భవించినవాడే. ప్రతి దేహము మట్టిమయమే. పుట్టిన బిడ్డను చక్కగా స్నానము చేయించి, శుభ్రపరచి ఊయలలో పెట్టినప్పుడు సాయంకాలమునకు ఆ బిడ్డ చేతిలో మట్టి వుంటుంది. ఆ బిడ్డ ఎక్కడికి పోయి ఆడింది? ఏ మట్టిని ముట్టింది? కాదు. దేహమే మట్టిమయము. మట్టి నుండి వచ్చిన ఈ దేహము మట్టిలోనే లీనమయిపోతున్నది. కనుక ప్రతి మానవుడూ కూటిపేద మొదలుకొని కోటీశ్వరునివరకూ, రాజు నుండి రత్నమువరకూ మట్టినుండి వచ్చినవారే. లోకములో లోహములు ఎన్నియో వుంటున్నది. అన్ని లోహములూ మట్టినుండి వచ్చినవే కానీ వీటి విలువలు మాత్రము వివిధరూపములలో అందిస్తున్నాము. మాణిక్యము కూడనూ మట్టినుండి పుట్టినదే కానీ చెట్టునుండి కాయలేదు. ఈ సత్యాన్ని చక్కగాగుర్తించుకుంటే అందరమూ ఒక్క తల్లి పిల్లలమే. ఒక్క తీగ పువ్వులమే. తీగ ఒక్కటే పూలు వేర్వేరుగా వుంటున్నాయి. ఆ తీగనే హృదయము. ఈ హృదయము అందరి దగ్గరా వుంటున్నది. హృదయమునుండి మరొక హృదయానికి సంబంధముంటున్నది. ఒక్క జాతి పౌరులమే మనదంతా ఒకే జాతి. అదే మానవ జాతి. ఎట్టివారైనా నాది పశుజాతి అని అనుకుంటాడా? లేక రాక్షస జాతి అనుకుంటాడా? లేక పక్షిజాతి అనుకుంటాడా? కనుక నీవు మానవజాతి యందు పుట్టినవాడవే. సముద్రములో పుట్టిన వివిధమైన అలలవలె ఈ సచ్చిదానందమైనట్టి దివ్యత్వము నుండి వివిధ రూపముల వంటి అలలు పుడుతున్నాయి. కనుక మనకెందుకు ఈ ద్వేషము? ద్వేషము నిర్మూలనము గావించినది, భేదములు నిర్మూలనము గావించింది. ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందాన్ని అందించింది ఈ వైశేషికమే. ఇదియే యిందులోన్ను పెద్ద విశేషము.

 

అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధములుగా ప్రకటించుతు వుంటారు. ప్రబోధిస్తూ వుంటారు. గ్రంథ పరిచయముతో నేర్చుకొని విచారణ చేసి అందిస్తున్నారే కానీ నిత్యసత్యమైన అనుభూతిలోనుండిన విషయాలను అందించి ప్రజల యొక్క హృదయాలకు హత్తుకొనేటట్లుగా, ఆనందపరిచేటట్లుగా బోధించే వ్యక్తులు ఈనాడు కరువై పోయారు. ఆనాటి దివ్యజ్ఞాన సంపన్నులైన మహర్షు లందరూ ఈ భౌతిక లౌకికములకు ఆతీతమైనస్థితిని పొందారు. వారంతా కేవలం సూపర్ మైండులో ప్రవేశించారు. ఆ సూపర్‌మైండ్ లో నుండి చూసినప్పుడు ఇవన్నీ కూడనూ అల్పవక్తులుగానే వుంటుంటాయి. ఈనాడు మనము నేర్చిన సర్వవిద్యలు కూడా అల్ప విద్యలే, అనిత్య విద్యలే, అప్రమాణ విద్యలే. ప్రమాణములు లేవిక్కడ. ఏమిటి దీనికి ప్రమాణము? ఇష్టము వచ్చినట్లు పలుక్కోవటమే దీనికి ప్రమాణము. కనుక ప్రమాణమనేదానిని నిరూపించే విశిష్టత లేనటువంటి ఈ ప్రకృతియంతయు కూడా అప్రమాణు స్వరూపములయిపోయినాయి. ఏ భాషలోచూచినప్పటికీ శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతున్నాయి. పదముల యొక్క స్వరూపములు అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి. ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిలో విచారణ చేయాలను కున్నప్పుడు put ఫుట్ అంటారు. ఈ పదమును. కానీ But బట్ అంటారు దానిని ఎందుకు బుట్ అనకూడదు? దీనికేమిటి ప్రమాణము? ప్రమాణము లేదు. Walk వాక్. వాల్క్ అని ఎందుకు అనకూడదు? కనుకనే ఈ పదము యొక్క అర్థమును ప్రమాణములేని స్థితిలో ప్రబోధించటంచేత మానవుని పరతత్వము కూడనూ పరమాత్మ మార్గమునకు పోలేక పోతున్నాది. పదార్థముల గురించినట్టిది పాణీని వ్యాకరణము. శబ్దమును అనుసరించి బోధించి వది వైశేషికము.

(స. ది..పు.117/122)

 

వైశేషిక దర్శనము ప్రకృతి సృష్టి గురించి చక్కగా విపులంగా చెప్తూ, వచ్చింది. అణుమయమే ఈ ప్రపంచము. ఆఖండమంతా అణువులోనే వుంటున్నది. చిన్న విత్తనములోనే వుంటున్నది పెద్ద వృక్షము. కానీ విత్తనములో ఈ వృక్షము మనకు కనిపించదు. వృక్షములో ఏఏ భాగములున్నాయో అన్ని విత్తనములోనే వుంటున్నాయి. ఈ విత్తనములోనే లేకుండిన వృక్షములో ఎట్లా వస్తాయి? కనుకనే "బీజం మాం సర్వ భూతానాం". ఈ బీజము నుండే ఈ విశ్వమనే వృక్షము ఆవిర్భవించింది. అణువునందే వుంటున్నది ఘనమైన దివ్యశక్తి. ఈ ఘనమునందే వుంటున్నది. అణుశక్తి. ఇంత పెద్ద వృక్షమునందే చిన్న విత్తనము వుంటున్నది.

 

ఇలాంటి పవిత్రమైన నిత్యసత్యమైన సూక్తులు బోధిస్తూ వచ్చాయి. ఈ షడ్దర్శనములు. న్యాయము మానవునకు ప్రాణము, ప్రాణమున్న మానవుడు ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది. వైశేషికము. మొదట ప్రాణాన్ని తరువాత ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చాయి ఈ న్యాయ వైశేషికములు.

(స.ది.పు.126)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage