మొట్టమొదటి వైస్ చాన్సలర్ గోకాక్ గొప్ప పండితుడు, జ్ఞాని, మహా సాధకుడు, గొప్ప యోగివంటివాడు. అతడిక్కడ ఒక్క నయా పైసా ముట్టకుండా ఫ్రీగా సేవ చేశాడు. రాత్రింబవళ్ళు కష్టపడి మన సంస్థను తన స్వంత ఇల్లువలె చూసుకున్నాడు. గవర్నమెంటు నిబంధనల ప్రకారం రిటైర్మెంటు తరువాత ఎవరైనా మూడు సంవత్సరములకు మించి వైస్ చాన్స్ లర్ గా ఉండటానికి వీల్లేదు. కనుక గోకాక్ తరువాత సరాఫ్ వచ్చాడు. అతను కూడా చాల గొప్పవాడే. అతడు యు.జి.సి.లో మెంబర్ గా పనిచేశాడు. అతను ఇక్కడకు వచ్చి మూడు సంవత్సరములు పని చేసిన తరువాత సంపత్ వచ్చాడు. అతను కూడా చాల గొప్పవాడు. కాన్పూర్ ఐ.ఐ.టియొక్క డైరెక్టర్ గా పనిచేశాడు. కంప్యూటర్ సైన్సులో చాల ప్రసిద్ధి పొందినవాడు. అతను కూడా ఇక్కడ చాల శ్రద్ధగా పని చేశాడు. తరువాత హనుమంతప్ప వచ్చాడు. వీరెవ్వరూ ఒక్క నయా పైస కూడా ఆశించలేదు. నేనిచ్చినా పుచ్చుకోలేదు. మీ దయ తప్ప మాకు ఏమీ అక్కర లేదు అన్నారు.
(స.సా.సె.. 98 పు. 240)