ఆలోచనలు, వాంఛలు ఒకటి కావు. ఎన్నో వాంఛలు కాని ఆలోచనలు ఉన్నాయి. విషయముల పట్ల గల ఆలోచనలు గాఢమయిన వాంఛలు తలయెత్తును. వాంఛ ఉన్నది అనిన దానికి పూర్వము ఆలోచన ఉన్నట్లే. కాని అన్ని ఆలోచనలు వాంఛలు కావు. కారు మేఘములు వర్షమును కురిపించును. కాని, వర్షము లేకపోయినా మేఘములుండవచ్చును. భగవదనుగ్రహము వర్షబిందువుల వంటిది. ఆ బిందువులన్నీ కూడినపుడు కుంభవృష్టి యగును. భగవంతుని పట్ల గాఢమైన వాంఛ ఉన్నట్లయిన చెడు తలపులు కలగినా కదలిపోవును, అంటిపెట్టుకొని ఉండవు, భగవంతుని వైపుకు మరల్చిన వాంఛ విచక్షణకు దారి తీయును. బుద్ధి సూక్ష్మత యనగా వివేకము, మనస్సు కాదు, ఆలోచన కాదు. వివేకము వేరుగా ఆత్మశక్తియే. ఆలోచనలను అడ్డగించుట వలన గాని, ఎదురించుట వలన గాని ప్రయోజనము లేదు. అణచివుంచిన బలహీనమైన క్షణములో బుట్టలో కప్పి ఉంచబడిన సర్పము, మూత వదులు అయినప్పుడు పైకిలేచునటుల, ఉవ్వెత్తున పైకి ఎగయును. భగవద్భావన పెంపొందించు కొనుట ద్వారా, వివేకవంతులతో సద్భాషణ చేయుట ద్వారా, సత్కార్యములను చేపట్టుట ద్వారా, దురాలోచనలను, ఉద్వేగములను అధిగమించవచ్చును. సత్కార్యముల,సదాలోచనలప్రభావముదురాలోచనలనుఅణగదొక్కును.మంచి,చెడుఆలోచనలు,ఉద్వేగములు మానస క్షేత్రములో నాటుకున్న బీజములు. భూమిలో విత్తనములను బాగా లోతుగా నాటిన అవి మొలకెత్తలేవు. క్రుళ్ళి వ్యర్థమై పోవును. ఆ విధముగనే మంచి నడత, మంచి ఆలోచనలు, చెడు నడతను, చెడు ఆలోచనలను పూడ్చి వేయును.అవి ఇంక మొలకెత్తలేవు.
ఆలోచనలు సంకటములుగా తయారయినప్పుడు, నేను “ఇది నీమనస్సు,స్వామి,నాదికాదు”అనిఅనుకొనుటతో ఆ ఆలోచనా ప్రవాహము ఆగిపోతున్నది. అది మంచి పద్ధతే. సులభ మార్గము కూడా. ఆక్షణములో నీవు అహంకారమునకు చోటివ్వడము లేదు.
(ప.ప్ర.పు.96/97)