రామాయణంలో ఒక విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరే కబంధుడు. అతని తల భుజములపై లేదు. పాట్టపై ఉన్నది. అతని హస్తములు చాల పొడవైనవి. వాటి సహాయంతో ఆహారాన్ని సేకరించి భుజించడమే అతని పని. ఈనాడు ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని భిక్షగాని వరకు అందరూ పొట్టకోసమే పాటుపడుతున్నారు. ఇంక ప్రైమ్ మినిస్టర్ కు, భిక్షగానికి మధ్యగల వ్యత్యాసమేమిటి? భిక్షగాడు తన పొట్టకోసం పాటుపడతాడు. ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం కోసం పాటుపడాలి. వ్యక్తి జీవితాన్ని గడుపుతాడు భిక్షగాడు. సమిష్టి జీవితాన్ని గడపాలి అధికారి.
ప్రేమస్వరూపులారా! మన జీవితం సమిష్టి జీవితమేకాని, వ్యక్తి జీవితం కాదు. నేను, నావారు అనే సంకుచితమైన భావనలో మునిగిపో కూడదు. అందరూ ఒక్కటే. కలసి మెలసి తెలుసుకొన్న తెలివిని పోషించుదాం, కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం. ఐకమత్యమే మానవ జీవితం. ఆచరణే దీని అభివృద్ధికి మూలకారణం
(స. సా.మే 96పు. 122)
ఆ అరణ్యముకూడనూ రాక్షసులవలే భయంకరమే. అనేక క్రూరమృగములతో, భయంకర శబ్దములతో యెట్టివారినైన భయభ్రాంతులను గలిగించునదై యుండెను.
ఈ విధమున రామలక్ష్మణులు ప్రయాణము జరుపుచుండ ఒక వికారాకారమును ధరించి కబంధుడను రాక్షసుడు అడ్డుతగిలి, భూమి ఆకాశము దద్దరిల్లునట్లు నవ్వి రామలక్ష్మణులపై పడుటకు పూనుకొనగా, రాముడు ఆ కబంధుని సంహరించెను.
వాని చేతులు చాలా పొడవు కలిగి, శిరస్సు లేక తాను భుజించు నోరు కడుపు పైననే కలిగి, అమానుషరూపుడై, అత్యంత విచిత్రాకారుడై, ఆ అడవిలో ప్రాణులను అనేక విధముల హింసించుచుండెను. అట్టి రాక్షసుని సంహరించి, వనచరులకు కొంత భయభ్రాంతిని శ్రీ రాముడు తగ్గించెను. ప్రాణములు వీడుటకు పూర్వము ఆ కబంధుడు, “ఓ నాథా! మీ దర్శన, స్పర్శన, సంభాషణలతో నా శాపము, పాపము పటాపంచలయినవి. నేను ధన్యుడను” అని తెలుపుకొంటూ, “రామా, నీ కార్యమెట్టి అభ్యంతరములూ, అవాంతరములు లేక, దిగ్విజయము కాగలదు” అని నమస్కరించుచూ ప్రాణములు వీడెను. (రామ కథా రసవాహిని ద్వి తీ య భాగం పు 43)