భగవంతుడు దేహమనే పాత్రను కర్మ క్షేత్రమైన జగత్తుకు పంపించేడు. లోకకళ్యాణం నిమిత్తమై ఈ పాత్రను తెచ్చుకొని దానిని చెడగొట్టి దేవునికివ్వడము ఎంత అధమస్థితో ఆలోచించండి.
వచ్చే సమయంలో పాత్ర ఎంతో నిర్మలంగా నిశ్చలంగా నిరపరాధిగా ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో చిల్లు పడకుండా వచ్చింది. యీ పాత్ర. దానిని తెచ్చుకొని, దీనికి కామమనే ఒక చిల్లు, క్రోధమనే ఒకచిల్లు, ద్వేషమనే ఒక చిల్లు, ఇన్ని చిల్లులు కొట్టి, తిరిగి ఈ పాత్రను పరమాత్మకు అర్పిస్తే ఇది సరియైన మర్యాదా? శ్రీమంతుల ఇంటి నుండి వండుకోడానికి మనము పాత్రలను తెచ్చుకుంటాము. ఈ పాత్రలను తిరిగి ఏ స్థితిలో యజమానికి అందిస్తాము? తెచ్చుకున్న పాత్రలను చెడగొట్టి ఆందించేవాడు అధముడు. తెచ్చుకున్న పాత్రను వినియోగించి, దానిని పరిశుద్ధము చేసి అందించేవాడు మధ్యముడు. అట్లుకాక వినియోగించిన, పాత్రలను చక్కగా లోమి కళాయి వేయించి పరిశుద్ధముచేసి యిచ్చేవాడు ఉత్తముడు.
కనుక ఆధ్యాత్మికమనే కళాయి దీనికి వేసి తద్వారా దీనిని పరిశుద్ధము చేసి, అయ్యా! స్వామీ! మీరిచ్చిన పాత్రను ఏ ద్వేషమూ అసూయ అహంకారం అనే చిల్లులు పడకుండా పరిశుద్ధంగా దీనిని మీకు అందిస్తున్నాను" అని జీవితము దైవార్పితం గావించేవాడు ఉత్తముడు."
హృదయం ఒక పాత్ర, హృదయం పరిశుద్ధముగా లేకున్న చేసిన సర్వకర్మలూ వ్యర్థమైపోతాయి. చిత్త శుద్ధిని సాధించే నిమిత్మమై కర్మలు ఆచరించాలి. "చిత్తస్య శుద్ధయే కర్మః" మనం చేసే ప్రతి కర్మ చిత్తశుద్ధికి హేతువు కావాలి. చిత్తశుద్ధికై చేసిన కర్మలన్నీ పవిత్రమైనవిగా ఉండాలి.
మన చూపు పవిత్రంగా ఉండాలి. మన శ్రవణం పవిత్రంగా ఉండాలి. మన వాక్కు పవిత్రమైనదిగా ఉండాలి. మన నడత పవిత్రమైనదిగా ఉండాలి. మన తలుపు పవిత్రంగా ఉండాలి. ఈ పంచేంద్రియముల పవిత్రతనే పరమాత్మ స్వరూపం అన్నారు.
(త.శ.మ.పు.51/52)