పరమాత్ముడు అనేక విధముల బాలుని పరీక్షించి కడకు తన ప్రయత్నములు ఫలించక పోవుటచే, "ఈ బాలుడు సామాన్యుడు కాడు. నా పరీక్షకు కూడనూ లొంగక నెగ్గినవాడు. కనుక పరీక్షితుడను నామము ఈ బాలునకు సార్థకము కాగలదు" అని కృష్ణ పరమాత్మ చెప్పినతోడనే, పండితులు ఆశీర్వాదములు చేసిరి.
వ్యాసులవారు "ధర్మజా!బాలుడు ఉత్తర గర్భమందుండగ అశ్వత్థామ వేసిన
అస్త్రము, ఆ బాలుని సమీపించగా, పరమాత్ముడు పిండమందే ప్రవేశించి బాలుని రక్షించెను; ఆనాడు గర్భమున తనతోపాటు వుండి తనను హతమార్చవచ్చిన అస్త్రమును దునుమార్చిన ఆ పురుషుడు యెవరాయని, ఆనాడు గర్భములో చూచిన దివ్య కాంతులుగల రూపుడు లోకమున యెక్కడున్నాడని ఆనాటి నుండియూ ఆ కాంతి గల వ్యక్తులను కన్ను వార్చక చూచుచుండెను. నేడు ఆ దివ్య స్వరూపుడు ప్రత్యక్షమగుట తోడనే గుర్తించి చెంత చేరెను. ఇదే బాలుని చేష్టలయందలి మర్మము "అని వ్యాసుడు తెలిపిన తోడనే ఆనంద భాష్పములు రాల్చుచూ యుధిష్ఠిరుడు మహ దానందముతో "పరమాత్ముడు కరుణానిధి" అని నమస్కరించెను.
(భా.వాపు 20/21)