ద్వాపర యుగమందు వ్రేపల్లెలో ఒకనాడు గోపికలు యశోద దగ్గరకు వెళ్ళి, "అమ్మా! నీ కుమారుడు మా ఇండ్లలో ప్రవేశించి పాలు పెరుగు తినుటమే కాకుండా కుండలను పగులగొడుతున్నాడు" అని ఫిర్యాదు చేసారు. కాని, యశోద నమ్మలేదు. "కృష్ణుడు మా ఇంటియందే ఉంటున్నాడు. మా ఇంట్లో పెరుగుపాల కేమీ తక్కువ లేదు. మీరు కావాలని కృష్ణుని పై ఈ విధమైన ఫిర్యాదు చేస్తున్నారు. నేను నమ్మను" అని అన్నది. ఇంక లాభం లేదని గోపికలంతా ఒక సమావేశం పెట్టుకున్నారు. కృష్ణుడు మళ్ళీ వాళ్ళ ఇండ్లలో ప్రవేశించినప్పుడు ఒక్కతూరి ఆతనిని పట్టి కట్టివేసి యశోదకు తెచ్చి చూపాలని తీర్మానించు కొన్నారు. కృష్ణుడు కూడా తాము గోపికల చేతికి చిక్కాలని సంకల్పించుకున్నాడు. దీనికోసం ఒక ఉపాయం పన్నాడు. ఒక గోపిక ఇంటికి వెళ్ళి పాలను క్రిందపోసాడు. ఆ పాలలో తన పాదములను చక్కగా తడుపుకొన్నాడు. గోపికలు తనను పట్టుకోవాలని వచ్చే సమయానికి పరుగెత్తి పోయాడు. గోపికలు చూసారు. కృష్ణుడు ఎక్కడా కనిపించ లేదుకాని, పాలలో తడిపిన కృష్ణుని పాదముల ముద్రలు కనిపించాయి. వాటిని ఆధారంగా చేసుకొని వెళ్ళినప్పుడు వారు కృష్ణుని పట్టగలిగారు. కృష్ణుని పట్టడానికి ఈ పాదముద్రలే కారణమైనాయి. అనగా, భగవంతుని మనం స్వాధీనం చేసుకోవాలనుకుంటే, భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రులం కావాలనుకుంటే పాదములను ఆశ్రయించాలి. ఈ విధమైన అంతరార్థమును గోపికలకు బోధించే నిమిత్తమై కృష్ణుడు ఈ నాటక మాడాడు. పాదములందున్న పవిత్రత, దివ్యశక్తి అనుభవజ్ఞులకు మాత్రమే అర్థమవుతుందిగాని, కేవలం శ్రవణం చేసినవారికి అర్థం కాదు. దివ్యమైన ఆత్మతత్త్వమును గుర్తించవలెనన్న భగవంతుని పాదముల నాశ్రయించాలి. బ్రహ్మ కడిగిన పాదమని, లక్ష్మి వత్తిన పాదమని - ఇట్లు అనేక విధాలుగా మన పురాణములు పాదముల ప్రాధాన్యతను నిరూపిస్తూ వచ్చాయి. రాముడు తన తమ్మునికి ఇచ్చినవి పాదుకలే. భరతుడు ఏలలేదు రాజ్యాన్ని, రామపాదుకలే ఏలుతూ వచ్చాయి. కనుక, పాదములలో ఇన్ని శక్తి సామర్థ్యములు ఇమిడి యుంటున్నాయి.
(స.సా.ఆ.95 పు.212)