పాపభీతి లేని పామరత్వము బట్టి
దైవప్రీతి లేని దాని బట్టి
మానవత్వ మణగి మానవులందున
విశ్వశాంతి కిదియె విప్లవంబు.
ఈనాడు మానవులలో పాపభీతిగాని, దైవప్రీతిగాని లేకపోవడం చేతనే విశ్వశాంతికి ముప్పు ఏర్పడిండి. ఈనాటి మానవ జీవితము తినటం, త్రాగటం, నిద్రించటం, సుఖించటం - వీటికి మాత్రమే పరిమిత మవుతున్నది. ఇదేనా మానవ జీవితం? "జ్ఞానేన శూన్యః పశుభిస్సమానః?", జ్ఞాన హీనుడు పశువుతో సమానం. వశువులు, మృగములు కూడా తింటున్నాయి. త్రాగుతున్నాయి, నిద్రిస్తున్నాయి, సుఖిస్తున్నాయి. అయితే, వాటిలో దాచుకునే స్వార్థంగాని, దోచుకునే దౌర్భాగ్యంగాని లేవు. దాచుకోవటం, దోచుకోవటం మానవునియందే కనిపిస్తున్నాయి. మానవుడని పేరు పెట్టుకొని మృగములలో కూడా లేని అవలక్షణాలను పెంచుకోవటం ఎంత దోషం! ఈనాడు మానవుని ఆశలకు అంతు లేకుండా పోతున్నది. కోరికలు చీమల పుట్టవలె పెరిగిపోతున్నాయి. మానవ జీవితం దీర్ఘ ప్రయాణం ఇందులో కోరికలనే లగేజిని ఎంత తగ్గించుకుంటే ప్రయాణం అంత హాయిగా సాగుతుంది. కోరికలను తగ్గించుకుని ఈ దీర్ఘ ప్రయాణాన్ని దివ్య జీవితంగా గడపాలిగాని, దీన జీవితంగా గడపకూడదు.
(స.పా.మే.99పు.115/116)
(చూ|| మూడుసూత్రాలు)