ఒక పర్యాయం భోజరాజు దర్బారులో ఒక పగటివేషగాడు. శంకరులవారి వేషంలో వచ్చి వేదాంతరసాన్ని వినిపించాడు.రాజా చాల ఆనందించి అతనికి కొన్ని బంగారు కాసులు బహుమతిగా ఇవ్వబోయాడు. అప్పుడతడు. "రాజా! సన్యాసికి బంగారు కాసులతో పనే ముంది! నాకక్కర్లేదు." అన్నాడు. మరునాడు అదే వ్యక్తి నర్తకి వేషంలో వచ్చి చక్కగా నాట్యమాడాడు. అప్పుడు కూడా రాజు అతనికి కొన్ని బంగారు కాసులివ్వబోగా "రాజా! ఇవి నాకు చాలవు, ఇంకా కావాలి." అన్నాడు. రాజుకు ఆశ్చర్యం కలిగింది. "నిన్నటి దినము ఇచ్చిన కాసులను వద్దని వదలి పెట్టావు. ఈరోజా ఇచ్చినవి చాలవంటున్నావు. ఏమిటి దీని అంతరార్థం?" అని ప్రశ్నించాడు. అప్పుడతడు "రాజా! వేషానికి తగిన ప్రవర్తన ఉండాలి. నిన్నటి దినమున నేను సన్న్యాసి వేషంలో వచ్చాను. కాబట్టి ఆ వేషానికి తగినట్లుగా ప్రవర్తించాను. ఈరోజు నర్తకి వేషంలో వచ్చాను. కాబట్టి, ఇంకా కావాలని అడుగుతున్నాను" అన్నాడు.
(స.సా..జులై 2000 పు.210)
మనకు పాపములు అనేటువంటివి కోపము, అసూయ, ద్వేషము, అహంకారము అనే దుర్గుణములు. అవి మన పాపాలకంతా పుట్టినిల్లుగా నిలిచి ఉన్నవి. అట్టి దుర్గుణములు అనే రావణుని, ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి అనే సుగుణములచేత వధించుటకు పూనుకోవాలి. అసూయ, అహంకార సమయములందు మనమే రావణాసురులము. సత్యమార్గమునందు, ధర్మమార్గమునందు, ప్రేమమార్గమునందు ప్రవర్తించినపుడు మనమే శ్రీరామచంద్రులము. మంచికాని, చెడ్డకాని మన ప్రవర్తనములోనే కూడి ఉంటున్నవి. కనుక, రామచంద్రుడు కాని, రావణుడు కాని మనహృదయమునందే నివసించు చున్నారు. తప్ప అన్యముగా ప్రవర్తించి, ప్రకటించేటటు వంటివారు కారు. దీనిని పురస్కరించుకొనియే
"మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అన్నారు. చెడ్డకూ మంచికి మనమనస్సే కారణ మనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టముగా తెలియుచున్నది. ‘పశువా అనిపించుకోవటము మనయొక్క ప్రవర్తనచేతనే; ‘పశుపతి అనిపించుకోవటము మనయొక్క ప్రవర్తన చేతనే. కనుక, ప్రవర్తనము చక్కనైన మార్గమునందుంచుకొనుటకు తగిన ప్రయత్నముచేయాలి యువకులు.
(ఆ.రా.పు.237)
(చూ|| మూలకారణము)