మంథర

కైకకు రాముడంటే అత్యంత ప్రీతి. తన స్వంత కుమారుడైన భరతునికంటే రాముడినే అత్యంత ప్రేమలో చూసేది కాని, మధ్యలో మంథర చేరి ఆమెకు దుర్బోధలు చేసింది.

ఈ మంథర ఎవరు? ఒక పర్యాయం కైకేయి తండ్రియైన కేకయరాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళినపుడు ఒకచోట ఆతనికి ఆడ, మగ జింకలు రెండు ఆడుకుంటూ కనిపించాయి. వెంటనే కేకయరాజు మగజింకను బాణంలో కొట్టాడు. ఆడజింక ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళి "అమ్మా! ఈ కేకయరాజు నా భర్తను హతమార్చాడు. ఇప్పుడు నా గతి ఏమిటి?" అన్నది. అప్పుడా తల్లిజింక కేకయరాజా దగ్గరకు వచ్చి “రాజా! భార్యాభర్తలను విడదీయటం మంచిది కాదు. నీవు మహారాజు వైయుండి ఇలాంటి పనికి పూనుకోవడం న్యాయం కాదు. ఇప్పుడు నీవు చేసిన పనిచే నీ జీవితంలో అశాంతికి కారణ మౌతుంది. నేనే విధంగా నా అల్లుని మరణంలో బాధపడుతున్నానో అదేవిధంగా, నీవుకూడా నీ అల్లుని మరణంతో బాధపడతావు. దానికి నేనే కారణమౌతాను." అన్నది. ఆ జింకయే మంథరగా పుట్టి, దశరథుని మరణానికి కారకురాలై, కేకయ రాజుకు దుఃఖాన్ని కల్గించింది. ఈ విధంగా విచారణ చేస్తే వేదశాస్త్ర పురాణములందు ఇట్టి ప్రమాణాలు అనేకంగా కనిపిస్తాయి. వేదశాస్త్ర పురాణములు అవినాభావ సంబంధం కల్గినవి. అవి అన్యోన్యాశ్రయములు. అది వేరు. ఇది వేరు అని వాటిని విభజించడానికి వీల్లేదు..

 

మంథరకు పాతసంకల్పం మనస్సులో ఉంది. దశరథునిపై లేనిపోని చాడీలు చెప్పి, అతనిపట్ల కైకకు గల ప్రేమను చెడగొట్టాలని ఆమెకు బుద్ధి పుట్టింది. ఇంతలో దశరథుడు శ్రీరామ పట్టాభిషేక శుభవార్తను కైకకు తెలియజేయడానికి మేళతాళాలతో ఊరేగింపుగా వస్తున్నాడు. గుఱ్ఱములు సకిలిస్తున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. మంగళ వాద్యాలు వినిపిస్తున్నాయి. ఈ శబ్దములు ఎక్కడినుండి వస్తున్నాయో చూద్దామని గూని మంథర భవనం పైకి ఎక్కి చూసింది. దశరథుడు ఊరేగింపుగా రావడం కనిపించింది. రాజు ఇంత వైభవంగా ఉండటం ఆమెకిష్టం లేదు. క్రిందికి దిగి వస్తుంటే కౌసల్య చెలికత్తె ఒకామె ఎదురు వచ్చింది. ఆమె కౌసల్య తనకిచ్చిన పట్టువస్త్రాలను ఆభరణాలను ధరించి వాటిని కైకకు చూపించాలని వస్తోంది. మంథర "ఏమిటి నీవింత అలంకారం చేసుకొని వస్తున్నావు? ఎవరిచ్చారు. కివన్నీ?" అని అడిగింది. తన కుమారుడైన రాముడు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతున్నాడన్న ఆనందంతో కౌసల్య తన దాసీలందరికీపట్టువస్త్రాలను, నగలను బహూకరించిందని ఆమె చెప్పింది. ఈ మాటలు వినగానే మంధరకు అసూయ కల్గింది. తనకు కూడా ఇవ్వనందుకు ఆమెకు కోపం వచ్చింది. వెంటనే లోపలకు ప్రవేశించింది. ఆ సమయంలో కైక చాలా ఆనందంగా అలంకారం చేసుకుంటోంది. మంథర " కైకా | ఏమి నీవైభవం? ఏమిటీ అలంకారం? ఎందుకోసం చేసుకుంటున్నావు?" అని అడిగింది. కైక ఆమె మాటలను లెక్క చేయలేదు. దగ్గరకు వెళ్ళి "కైకమ్మ! రాజుకు నీవంటే చాలా ప్రేమ అని భావిస్తున్నావు. అది కపట ప్రేమ. ఆ ప్రేమను నమ్మి నీవు మోసపోతున్నావు. మున్ముందు నీ పరిస్థితి చాలా దిగజారిపోనున్నది. చూడు, నా మాట విను.” అంటూ ఆమె భుజంపై సున్నితంగా కొట్టింది.ఆ స్వర్శచేత ఆమెలో ఉన్న దుర్భావాలు కైకలో ప్రవేశించాయి. కనుక, దురుణములు గలవారితో మనం ఎప్పుడూ చేరకూడదు. వారి స్వర్శ కూడా మనకు చాలా ప్రమాదం తెప్పిస్తుంది. అంత వరకు రాముణ్ణి ఎంతగానోప్రేమించిన కైక ఆ క్షణంలో అతనికి విరోధిగా మారిపోయింది. అసూయకు మారుపేరైన మంథర తన దుర్బోధలతో ఆమె మనస్సును పాడుచేసింది. అసూయ అనే పెనుభూతం పట్టినవారెవ్వరూ బాగుపడరు. కనుకనే, నేను అప్పుడప్పుడు చెబుతుంటాను - "త్యజ దుర్జన సంసర్గం." దుర్గుణములు గలవారితో సహవాసం చేయ కూడదు. మీ ప్రాణం పోయినా సరే, అసూయా పరులతో స్నేహం చేయకూడదు.

(స.సా.మే.2001పు 133/134)

 

దుర్గుణములన్నింటిలోనూ అసూయ చాలా చెడ్డది. అసూయచేతనే లోకం మూడు భాగములు చెడిపోతున్నది. అందంగా ఉన్న వారిని వికారంగా చేయడం... ఫస్ట్ క్లాసులో పాసయ్యేవారిని పాడు చేయడం....ఈ రీతిగా, బాగున్నవారిని చెడగొట్టడమే ఆసూయ యొక్క పని. రామాయణంలో రావణుడు మరణించాడుగాని, మంధరఈనాటికీ మరణించ లేదు.అసూయ అనే మంధర ఇప్పటికీ సజీవంగానే ఉన్నది. ఈ మంథర మరణింపచేసేవారు ఎవ్వరూ లేరు. దీనిని లెక్కచేయకుండా ఉండడమే మనం చేయవలసిన పని. చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. ఇదే రామాయణం అందించే ప్రధానమైన ఆదర్శం. చెడ్డ మాటలు చెప్పింది మంథరః చెడ్డ మాటలు విన్నది కైక. వారి గతి ఏమైపోయింది? ఈనాడు లోకంలో  స్రీలెవరైనా మంధర, లేక, కైక అని పేరు పెట్టుకుంటున్నారా? కౌసల్య పేరు పెట్టుకుంటారు గాని, కైక పేరుగాని, మంథర పేరుగాని ఎవ్వరూ పెట్టుకోరు. చెడ్డ చూపులు చూశాడు కీచకుడు. తత్ఫలితంగా భీముడు అతని తల పగలగొట్టాడు. ఈనాడు మగవారిలో ఎవరైనా కీచుకుని పేరు పెట్టుకుంటున్నారా? ఎవ్వరూ పెట్టుకోరు, చెడ్డ మాటలు చెప్పినవారిని, చెడ్డ మాటలు విన్నవారిని, చెద్ద చూపులు చూపినవారిని నిరసిస్తుంది లోకం.

(స.సా.మే.2001పు.135)

(చూ కామము - క్రోధము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage