మొదట "నేను" తరువాత "నీవు" అనునది. జీవితము. "నీవు " అనునది ప్రపంచము. "నేను", "నీవు " కలసిన "మనము" అవుతుంది. "మనము", "అతడు" అంటే భగవంతుడు కలసి చివరకు భగవంతుడు మాత్రమేమిగులుతాడు. ప్రేమ ఉన్నది. ప్రేమించే వ్యక్తి ఉంటాడు. ప్రేమింపబడే వ్యక్తి ఉంటాడు. వీటికలయికే బ్రహ్మానందము. ఈ ఫాన్ లో మూడు రేకులు ఉన్నాయి. త్రిగుణాలు ఈ రేకులను సూచిస్తాయి. ఈ మూడు రేకులు సమన్వయముతో తిరిగినప్పుడే చల్లటి గాలి లభిస్తుంది. మనలో ఈ త్రిగుణాలు మూడు దిక్కులలో పోతున్నాయి. వాటిని ఒకే దిక్కుకు త్రిప్పినపుడు నీవు ఏకోన్ముఖుడవగుదవు, సరియైన అవగాహనకు వచ్చెదవు. (ప.ప్ర.పు.8)
మనం దైవాన్ని చింతించినప్పుడు దైవంకూడా మనల్ని చింతిస్తాడు
ఒకానొక సమయంలో గోపికలు వచ్చి రాధమ్మనడుగుతున్నారు. "అమ్మా నీవు ఎప్పుడు చూచినా కృష్ణా! కృష్ణా! అని చింతిస్తున్నావు. ఈ విధంగా నిరంతలు చింతించడంచేత నీవే కృష్ణుడివైపోతావు. అప్పుడు నీకేమి సుఖము? ఇక్కడ దైతం అనేదే లేదే! రాధే మాయమైపోతుంది.” అప్పుడు నెమ్మదిగా ఆ చెలికత్తెలకు చెబుతుంది: "గోపికలారా! నిరంతరము కృష్ణ చింతన చేయడంచేత, నేను కృష్ణుడు కావచ్చును. కృష్ణుడు నిరంతరము రాధాచింతన చేయడంవల్ల రాధగా మారిపోతాడు. అప్పుడుకూడను రాధాకృష్ణులు ఏకమే కదా!” కనుక దైవాన్ని మనం చింతించినపుడు మనల్నికూడ దైవం చింతిస్తాడు. ఎందుకనగా నీవొక దైవాన్ని సృష్టించుకొంటున్నావు. దైవాన్ని ఎవరు సృష్టించారు? సాధకుడు దైవాన్ని సృష్టించాడు. దైవం ఎవరిని సృష్టించాడు? దైవం సాధకుడిని సృష్టించాడు. కాబట్టి ఈ రెండింటి ఏకత్వము ఏమిటి? "సృష్టి ఒక్కటే”. కనుక, మానవునియందు సృష్టి శక్తి ఉంటుండాది. దైవమునందు సృష్టించే శక్తి ఉంటుంది. కాబట్టి ఇరువురి యందున్న శక్తి ఒక్కటే! ఈవిధమైన ఏకత్వములో మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. ఈ విధముగా భేదములు విస్మరించి, ఏకత్వాన్ని విశ్వసించి మనస్సును తగిన జాగ్రత్తలో పెట్టుకోవాలి. - (అనుగ్రహ భాషణం -ద్వితీయ భాగం-పు208-209)