ఈ తమిళ దేశమందు చాల ప్రసిద్ధి చెందినది పాండ్యరాజ్యం. పాండ్యరాజు యువకులనే తన మంత్రులుగా నియమించుకొని ధర్మ మార్గంలో పరిపాలన చేస్తుండేవాడు. ఆ రాజుకు ఆశ్వపోషణంటే చాల అభిరుచి. ఒకనాడు యువకుడైన ఒక మంత్రిని "మంత్రీ! నీవు దేశ సంచారం సల్పి ఎక్కడైనా మంచి గుఱ్ఱములు కనిపిస్తే కొని తీసుకు రావాలి" అని అతనికి తగిన మొత్తము నిచ్చి, కొంతమందిసిపాయిలను కూడా ఇచ్చి పంపాడు. ఇతను ప్రయాణమై వెడుతూ మార్గమధ్యంలో పెద్దదొరై అనే గ్రామంలో ఆగాడు. ఆ గ్రామానికి సమీపంలో యోగానంద సరస్వతి అనే మహనీయుడు ఉండేవాడు. అతను ఆనాటి సాయంకాలం భక్తులకు చక్కని ఆధ్యాత్మిక ప్రబోధ సల్పుతున్నాడు. ఈ మంత్రి కూడా పరమభక్తుడు. ఆనాటి యువకులకు దైవంపట్ల పరిపూర్ణమైన విశ్వాసముండేది. "యధారాజా తథా ప్రజా" అన్నట్లుగా, రాజు పరమ భక్తుడు కనుక మంత్రులు కూడా పరమ భక్తులుగా మారిపోయారు. ఆ మంత్రి ప్రతి సాయంకాలం అక్కడ కూర్చొని ఆ మహనీయుని ప్రబోధలు చక్కగా శ్రవణం చేస్తూ వచ్చాడు. అక్కడికి సమీపంలో ఒకఈశ్వరాలయం ఉండేది. అది చాల పాడుపడి శిథిలావస్థలో ఉండేది. తాను గుఱ్ఱములకోసం తీసుకొని పోయిన డబ్బును ఖర్చు పెట్టి ఆ ఈశ్వరాలయమును సుందరమైన మందిరంగా తీర్చిదిద్దాడు. చారులద్వారా ఈ విషయం పాండ్యరాజాకు తెలిసింది. తక్షణమే ఆ మంత్రిని వెనుకకు రమ్మన్నాడు. రాజుచెంతకు వచ్చి నమస్కరించి నిల్చున్నాడు. మంత్రి. "నిన్ను దేనికోసం పంపాను? అశ్వములను కొని తీసుకురమ్మని పంపిస్తే ఆ డబ్బు ఏమి చేసావు?" అని ప్రశ్నించాడు. ఇతను ఏమాత్రము భయం లేకుండా "దైవానికి అర్పితం చేశాను" అన్నాడు. "నిన్ను దైవానికి అర్పితం చేయమని పంపలేదు, అత్యంత విలువైన గుఱ్ఱములను తీసుకొని రమ్మని పంపాను. నేను చెప్పిన దొకటి, నీవు చేసిన దొకటి. రాజాజ్ఞను ధిక్కరించావు " అని పలికి, సిపాయిలను పిల్చి అతనిని జైల్లో పెట్టించాడు. అతను ఆ జైల్లో కూర్చొని నిరంతరం దైవచింతన చేస్తూ వచ్చాడు. అనేక శ్లోకములు వ్రాస్తూ వచ్చాడు. అతడు జైలునందు కూడా దైవచింతన మానలేదని తెలుసుకుని ఒక దినము రాజు అతనిని పిలిపించాడు. "మంత్రీ! నీవుయువకుడవు, యువకులు భోగభాగ్యములను ఆశించాలి. కాని, నీవు మాత్రం సర్వసంగ పరిత్యాగివైనీ కాలమును, కాయమును వ్యర్థం గావించుకుంటున్నావు" అన్నాడు.
అప్పుడు చెప్పాడు ఆ మంత్రి..
అస్థిరం జీవనం లోకే అస్థిరం యావనం ధనం
అస్థిరం దారా పుత్రాది సత్యం ప్రేమ ద్వయం స్థిరం.
"రాజా! లౌకికమైనవన్ని అనిత్యమైనవి. అసత్యమైనవి. సత్యము, ప్రేమ ఈ రెండు మాత్రమే నిత్యమైనవి. సత్యమే దైవం, ప్రేమయే దైవం. కనుక, సత్యమును అనుసరించాలి. ప్రేమలో జీవించాలి. “యదృశ్యంతన్నశ్యం ,ఈ జగత్తునందు మనం అనుభవించేదంతా ఆస్థిరమైనది " అన్నాడు. మంత్రి! ప్రతిదినము జైల్లో ఏమి చేస్తున్నావు ?" అని ఆడిగాడు. మంత్రి జైల్లో తాను వ్రాసిన శ్లోకములు రెండు, మూడు చదివాడు. రాజుకు చాల ఆనందం వేసింది. ఆలాంటి ఉత్తముడైన మంత్రిని జైల్లో పెట్టించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. అతనిని తిరిగి మంత్రిగా పదని బాధ్యతలను స్వీకరించిమని కోరాడు. "రాజా! నాపవిత్రమైన మార్గమునకు అడ్డు తగలవద్దు. నన్ను వదిలి పెట్టు" అన్నాడు. అతనే మాణిక్య వాచకర్. అతడు సర్వసంగ పరిత్యాగియై ఆధ్యాత్మిక ప్రభోదలు సల్పి, అనేక మంది యువకులను నివృత్తి మార్గంలో ప్రవేశ పెట్టాడు. నివృత్తి మార్గమే నిత్యసత్యమైన మార్గమని ప్రభోదిస్తూ వచ్చాడు
(సా.శు.పు.67/69)
(చూ॥ పంచి పెట్టు)