ఉపనిషత్తులలో ముక్తి రెండు విధములుగా తెలుపబడినది. ఒకటి, సద్యోముక్తి, రెండవది క్రమముక్తి, సద్యోముక్తినికైవల్యముక్తి అని కూడ అందురు. ఇట్టివారు యే లోకమునకూ పోనక్కరలేదు. వారు అక్కడికక్కడే భగవత్ప్రాప్తిని పొందుదురు. అది నిత్యమైన స్థితి. మిగిలిన యెట్టి ప్రాప్తులైననూ అనిత్యమైనవే. తాను చేసిన పుణ్యకర్మల ఫలము ఎంతవరకు వుండునో, అంతవరకు స్వర్గాది లోకములందుండి తిరిగి రావలసియుండును. కైవల్యమును పొందినవారికి మాత్రమే లయము.
లయమంటే నాశముకాదు. కంటికి కానరాని స్థితి నొందుట లయమని అందురు.
కంటికి కానరానంత మాత్రమున నాశమని తెలుపుట చెల్లదు. ఎటులన లవణము కానీ, పంచదార కానీ జలములో వేసిన అది నీటిలోచేరి కంటికి కనుపించక పోవును. దానిని నాశమందువా? లయమందువా? నాశమయిన దానిరుచి తెలియుచున్నదే! నీటిద్వారా, లేదని యెటులందువు? ఉండియూ తన గుణమును మాత్రము తెలుపు, నిరాకారమైన తత్త్వమును లయమని అందురు. నీటిలో చేరిన లవణమువలే, బ్రహ్మములో చేరిన జీవమునూ లయమని అందురు. అది యేనాటికీ నశించదు. అట్లు కైవల్యమును పొందక కర్మలద్వారాపుణ్యములు సలిపిన వారు స్వర్గాది లోకములకు వెళ్ళి తిరిగి వచ్చి కొన్ని సాధనలను సలిపి తత్పలములను అనుసరించు చుందురు.
(గీ.పు. 151/152)
ముక్తి కోసం ప్రార్థంచటం కూడా ఒక కోరికే. అదీ ఉండకూడదు. అందుచేత దీనిని కోరకుండా సదా నన్నే జ్ఞాపకం ఉంచుకొంటే ముక్తి తానంతట తానే లభిస్తుంది.
త్రి.సా.పు.273)
వ్యాస మహర్షి జాలరి కులమున పుట్టెను, వసిష్ట మహాఋషి వేశ్యయగు ఊర్వశికి జన్మించెను. శౌనక మహాముని శునక వంశమున పుట్టెను. అగస్త్యుడు ఘటమున జన్మించెను. విశ్వామిత్రుడు క్షత్రియ కులమున పుట్టెను. ఖగోళ మహాముని వైశ్యవంశమున జన్మించెను. సూతమహాముని చతుర్ధ వంశమున (శూద్ర) జన్మించెను. ఇక సహజులుగా జన్మించి, సద్గుణములతో జాతి ధర్మమును దేహ ధర్మములను కొంతకాలము పాటించి సత్యమును యెరింగి తదుపరి సర్వమునూ దూరీకరించి సర్వదాముక్తిని స్వవశము చేసుకొన్న విదురుడు, సంజయుడు, సత్యకాముడు మొదలగు వారలు కూడా అనేక మంది వున్నారు. నాయనా! పురుష ప్రయత్నము, వివేకము, తపస్సు వీనివలన కలుగు గుణములే మహాన్నత స్థితికి కారణములు.మానవ జాతికి ఆత్మశుద్ధిలేక యే జాతియందు జన్మించిననూ ముక్తిని పొందలేరు. మలినమైన రాగిలో కూడిన బంగారము వెల తగ్గినదగుచున్నది. అలాగుననే తాను శుద్ధ విరాడ్రూపుడయినను. సంసార సంసర్గములచే అహంకారముతో కూడిన జీవుడగును. జీవుడును తపోవ్రత సంస్కృతుడై శుద్థబుద్ధియుతుడై నిజస్థానమగు పరమాత్మ స్వరూపమును పొందును. కాలనికుండ జలస్పర్శముచే కరిగి మట్టియగునటుల తపస్సుచే పరిపక్వముకాని వారి మనసు విషయదోషముల సంబంధముచే విషయములో ప్రవేశించుచున్నది. తపోగ్నిచే దహించ బడిన కుండను సముద్రమున పడవేసిననూకరుగక వుండును. తీవ్రతపోవహ్నిచే నిశ్శేషముగా దహింపబడిన కర్మ బీజములు కలవారు గనుకనే జ్ఞానసంపత్తి గలవారై, నిర్మల తత్వముచే ముక్తులై జనన మరణముల జెందని వారగుచున్నారు.
(ప్ర.శో..పు. 59)
మనసును దాని ఇష్టమొచ్చినట్లు పోనీయకూడదు. నిర్దాక్షిణ్యముగా దానిని అడ్డగించవలెను. సాధ్యమైతే మనసును నాశనము చేయుటకే సిద్దపడవలెను. (అనగా ప్రపంచవాసనలపై ఇచ్చలేకుండ జేయుట) అట్లు చేసినప్పుడే మానవుడు తన నిజస్వరూపమును తెలిసికొనగలడు; అదియేముక్తి. అప్పుడు అన్ని విధములైన బాధలు, విచారములు, భ్రమలు అంతరించును. మానవుడు దుఃఖము, భయము, ఆతురతలు వదలి పవిత్ర శాంతిసాధన అనుసరింపుడు.
మలిన వాసనలు వదలి మంచి వాసనలు మొదట ఆలవరచు కొనుడు. తదుపరి క్రమేణా మంచి వాసనలను కూడా వదలి, నిర్విషయమును నిశ్చయమును పొందవచ్చును. ప్రకాశవంతమైన, ఆనందమైన, జ్ఞానముతో కూడిన శాంతమే మూర్తీభవించిన పరమాత్మ.
(ప్ర.వా.పు.30)
నిశ్చలచిత్తముతో, నిర్మలభావముతో, అన్యచింతలకు చోటివ్వక భజించిన అదియే భావసమాధి అగును. అట్టి సమాధి ఫలితముగా భగవంతుడు ఏ రూపంబున అతనిని ఆరాధింతురో ఆ రూపంబున, భక్తుల అంతర్దృష్టికి గోచరించును. భగవర్దర్శనము కేవల భావమాత్రమే కాదు. ముఖాముఖి నుండును. భగవంతుడు స్థానవ్యత్యాసములు లేక ఏక ప్రపంచ మందే నివసించుటగును. దీనినే సాలోక్యముక్తి అందురు. ఈ సాలోక్యముక్తి యందు భక్తుడు భగవంతునితో నిరంతరము ఉండుటయే కాక, తాను చూచుచున్నవన్నియు భగవత్ విలాసములే అనిఅతడు గ్రహించును. ఈ భావంబును సామీప్యముక్తి అందురు. భగవంతునితో నిరంతరముండుట, భగవత్ విభూత విలాసంబులను చూచుట, తన్మయుడైయుండుట, ఇవి మూడును భక్తుని చివరకు భగవద్వృత్తికి కొని వచ్చును. ఈ స్థితిని సారూప్యముక్తి యందురు.
భక్తి శాస్త్రము యొక్క చివరిఫలము ఇదియే. ఈ స్థితియందు భేదభావము కొంత ఉండును. అందువలన ఇది ఉత్తమగతిగా అద్వైత సిద్ధాంతము ఒప్పదు. భగవత్సారూప్యమన్నంతనే భగవంతునివలె భక్తునకుకూడా సృష్టిస్థితి లయశక్తులు ఉండునని భావించరాదు. భేదభావంబులు సమూలంబుగా నశించి ఐక్యమొందుట ఒక్కటే ఉత్తమగతి. దీనినే సాయుజ్యమందురు. దీనిని వారివారి సాధనా సారమునుబట్టి భగవంతుడు అనుగ్రహించునే కాని ప్రయత్నఫలంబుగా పొందలేనిది. భగవంతుని తన యిష్ట ప్రకారము సేవించును. ఆ రూపానందంబును అనుభవించుచుండుటే భక్తునికోరిక కాని, ఐక్యంబు అట్టి భక్తుడు కోరడు. భక్తుడు కోరకున్నను భగవంతుడే వానికి సాలో క్యాది త్రయమే కాక సాయుజ్యంబు కూడను అనుగ్రహించును. భక్తి మార్గఫలంబున బ్రహ్మజ్ఞానసిద్ధి కూడ కలుగును. అట్టిదానిని సయితము భక్తుడు కోరకున్ననూ భగవంతుడే అనుగ్రహించును. ఇట్టి సాయుజ్యముక్తినే ఏకాంతముక్తి అని యందురు.
(ప్రే.వా.పు.64/65)
కైవల్యోపనిషత్తు నందు "నకర్మణాన ప్రజయా ధనేనత్యాగే నైకేన అమృతత్వ మానుశు:" అని తెలిపినట్లుగా, నకర్మణా అనగా యజ్ఞయాగాదులు, వ్రతములు, ధానధర్మాదులు, తీర్థయాత్రలు, నదీ సాగరస్నానములు మున్నగు కర్మలవల్లమోక్షము కలుగదు. అనగా అజ్ఞానం నివృత్తి కాదు. అనగా అధికార సంపదలు, బుద్ధిచాతుర్యము. కీర్తి ప్రతిష్టలు, సౌందర్యము, పుష్టి పుత్రులు మున్నగువాటి వల్లముక్తి పొందజాలరు. నధనేన - పైన తెలిపిన కర్మలన్నియు ధనసహాయముతో జరుపబడునవి. ధనములేని యెడలఅట్టి కర్మలు జరుప బడజాలవు. అయితే జ్ఞానమును ధనముతో కొనలేరు. ధనమునకూ జ్ఞానమునకూ సంబంధమే లేదు. కాబట్టి ధనము వలన ముక్తినిసంపాదించుకొనజాలరు. ఇది ధన సాధనము కాదు. అట్లయిన ముక్తికి సాధనమేమి? త్యాగనైకే అమృతత్వ మానుశు: జగత్తు లేనే లేదను జ్ఞానము వల్లను, ఉన్నట్లు కనబడినను అది మిధ్యామాత్రమేనని తెలుసుకొనుట వల్లను, ఇహపరములలోగల భాగముల ఆశలు వదలుకొనుట వల్లను - అనగా సర్వంత్యాగము - సర్వత్యాగమువల్లను ముక్తి కలుగును. అని దీని అర్థము. అనగా ఆత్మ తత్వజ్ఞానముచేత మాత్రమే దాని ఫలమైన -సంసారము దుఃఖము నశించును. కేవలము కర్మలవల్ల అవి నాశనము కావు. ఉపనిషత్తు చెప్పుచున్నది.
(సూ.వా.పు.1/2)
శంకరులు సాధనకు మొదటి మెట్టుగా సత్సంగమును చెప్పినారు. సత్సంగత్వము. నిస్సంగత్వము నలపరచి మౌనమునందును ఏకాంతవాసమునందును. ఆసక్తి కలిగించును. అది మోహమును రూపుమాపును భగవద్గీత వినుటవలన పార్థునకు సిద్ధించిన ఫలమీదే. అది లభించినప్పుడు నిశ్చల తత్త్వము స్థిరపడును. తత్ - అది పరమాత్మ, త్వమ్ నీవు (జీవాత్మ) అనుదేని పరమార్థము - అనగా ఆ రెంటికిని గల యేకత్వమును గుర్తించుటయే ముక్తి ప్రాప్తి.
(స.వ.పు. 15)
ముక్తి గోరినరుడు ముక్కోటి దేవతల
ఆశ్రయించు గాని అన్య మెరుగ
తనదు లోని అహము తా చంపుకొన్నను
ముక్తియేల తానే ముక్తి కాడె?
ముక్తి కోరి మానవుడు ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తున్నాడు. ఉన్నది ఒక్కటే, అని వేదము, శాస్త్రము, బైబిలు, ఖురాన్ ఏగ్రంధము గాని నిర్ణయించి సత్యాన్ని బోధించు చుండగా ముక్కోటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటున్నాది? ఇవన్నీ మనో భ్రాంతుల వికారములే.
(బృత్ర.పు.124)
ముక్తి అనేది భాగవతము అనే ఐదు ఐక్షరములలోనే లభిస్తుంది. - ‘భ’ భక్తి, ‘గ’ . విజ్ఞానము, వ వైరాగ్యము త - తత్వము. ఈ నాల్గింటి స మ్మే ళ న మే ము - ముక్తి, భక్తి, వైరాగ్య, తత్త్వ విచారణలు ముక్తి కి మార్గములని నిరూపించింది “భాగవతము . ఇవి ప్రతి మానవుడిలో నిండి, నిబిడీ కృ తమై యున్నవి. కాని, వాటిని సరియైన మార్గంలో అనుభవించటం లేదు. అనుభవించిన వాడే భాగవతప్రియుడు భగవంతుని పై ప్రేమే భక్తి. నిత్యా నిత్య పరిశీలనా తత్త్వమే జ్ఞానము. మనలో ఉన్న దుర్గుణాలను పరిత్యజించటమే వైరాగ్యము. తానెవరు? నేనెవరు? ఈ రెండింటిని తెలుసుకోవటమే తత్త్వ విచారణ. ఇవే ముక్తి కి మార్గములు” -బాబా (సాలీత పు149)