ఎలుకను మూషికము అంటారు. రాత్రికి అనగా చీకటికి చిహ్నమే మూషికము. చీకటిని వినాయకుడు అణగ ద్రొక్కినవాడు కనుకనే ఇతనికి "మూషిక వాహనుడు" అని పేరు వచ్చింది. చీకటిని పారద్రోలి వెలుగును జగత్తుకు అందించేటటువంటి నాయకుడు వినాయకుడు. ఇంతేగాక మూషికమునకు వాసన యొక్క చిహ్నమని కూడా చెప్పవచ్చును. ఈ మూషికము వాసన పురస్కరించు కొనియే తన ప్రయాణమును సాగిస్తుంది. అనగా కోరికలు, వాంఛలు అజ్ఞానమనేటటువంటి మూషికమును అణగద్రొక్కినటువంటివాడు వినాయకుడు. అందువలన వినాయకుని యొక్క వాహనము "మూషికము అన్నారు. వాహనమనగా ఏమిటి? తన క్రింద వేసుకున్నదే వాహనము. దానిని ఎక్కినటువంటి వాడు నాయకుడు సమస్త దుఃఖములను, బాధలను, కష్టములను దూరము గావించు కొనేటటువంటివాడు వినాయకుడు. విఘ్నములకు శత్రువువినాయకుడు. విఘ్నమును సంహరించేటటువంటివాడు వినాయకుడు. అసలు విఘ్నములకు ఏ మాత్రం అవకాశమిచ్చేవాడే కాడు. సుఖశాంతులను అందించేటటు వంటివాడు.
(శ్రీ ఆ. 95, పు. 6)