ఒక నాస్థికుడు బుద్ధునియెదుట నిలిచి నోటికి వచ్చినట్లు తిట్టినాడు. బుద్ధుడు యేమీ పలుకలేదు. శాంతముగా పద్మాసనము వేసుకొని మందహాస వదనములో అన్నియును వింటున్నాడు. కొంత సేపటికి వానికి గుండెనొప్పి, నోరు నొప్పి వచ్చి తాళలేక వెళ్ళిపోయినాడు. ఇదంతా చూచుచున్న ఒక శిష్యుడు ప్రశ్నించినాడు. ప్రభూ! మీరు మారుమాటాడక మౌనముగా వాని దూషణములు విన్నారుకదా! దీని కర్ధమేమి? అప్పుడు బుద్ధుడు వత్సా! నీయింటికి యెవరైనా వస్తే వారిని "యేమి? యెప్పుడు వచ్చినారు! అని పలుకరిస్తే కదా? వారు యింటిలోనికి ప్రవేసిస్తారు. పలుకరించకపోతే వారు వచ్చిన దోవను పట్టుకొని వెళ్లుతారు కదా!" అలాగే నిందాస్తుతు లనే అతిథులను మనము నిరాకరించాలి, అన్నారు.
(సు.పు.117)