మరణించిన రావణునికి అంత్యక్రియలు చేయుటకు విభీషణునికి మనస్కరించలేదు. శ్రీమన్నారాయణుడైన రాముని పైన ఇంత పగబూనిన యీ దుర్మార్గునికి అంత్యక్రియలు చేయటము మహాపాపమని భావించాడు విభీషణుడు. సర్వధర్మములు ఎరిగినవాడు కనుక, రాముడు, విభీషణుని దగ్గరకు పిలచి "ద్వేషమనేది మరణము వరకు మాత్రమే ఉండాలి, మరణించిన తరువాత ద్వేషము ఉంచటము చాలా అధర్మము" అని తెలిపి "అతని మరణముతో ని ద్వేషము కూడా మరణించాలి" అన్నాడు. "నీవు ఈ అంత్యక్రియలు ఆచరింతువా లేదా? నీవాచరింపవేని సోదర భావము చేత ఈ అంత్యక్రియలు నేనే ఆచరింతును" అని తాను సంసిద్ధుడైనాడు. ఈ మాట విన్న తక్షణమే విభీషణుడు రావణుని యొక్క అంత్యక్రియలు చేయుటకు పూనుకొన్నాడు. ఈ విధముగా సర్వధర్మములు ఎరిగినటువంటివాడు కనుక "రామోవిగ్రహవాన్ ధర్మః" అన్నారు. కనుక, అట్టి ధర్మస్వరూపుడైన శ్రీమన్నారాయణ మూర్తియే రామావతారము ధరించి, లోకములోని మానవులకు ఆదర్శమైన జీవితమును గడుపుతూ వచ్చాడు. కుటుంబములో ఏరీతిగా తాను నడచుకోవాలి. మిత్రుల దగ్గర ఏరీతిగా ప్రవర్తించాలి. సమాజములో ఏరీతిగా ఆదర్శవంతమైన జీవితమును నిరూపించాలి. అనే విషయాలను తన జీవితమున ప్రతిక్షణము ప్రకటిస్తూ వచ్చాడు. సర్వుల యందు. కూడను సమప్రేమను ధరించి, సమప్రేమ చేతనే అందరినీ ఆదరించి ఆనందింపజేస్తూ వచ్చాడు.
(ఆ.రా.పు.28/29)
(చూ॥ కులం, భగవత్ప్రేమ, మతము, రజోగుణము)