"విత్తము" అనగా కేవలము ధనమునకు సంబంధించిన పదం మాత్రమేకాదు. “విద్యతే లభ్యతే ఇతి " అని వ్యుత్పత్తి అర్ధము. అనగా పొందబడినది అని అర్థం. భుజబలం పొందబడినటువంటిదే. విద్యా బలము పొందబడినటువంటిదే. ధనబలం పొందబడినటువంటిదే. ధనబలం, దేహబలం, విద్యాబలం మూడు బలములతో కూడినటువంటి దానినే విత్తము అని చెప్పవచ్చును. పొందబడిన ఈ మూడు శక్తులు సమాజమునకు ఆర్పితము కావించి, సద్విని యోగము చేసుకొనుట మానవుని ప్రధాన లక్ష్యము. కష్ట సుఖములు కావడి కుండలు. ఎప్పుడు ఎవరికి ఏ స్థాయిలో ఏ కాలమునందు ఎట్టి స్థితి లభ్యమవుతుందో ఎవ్వరును చెప్పలేరు. కోటీశ్వరుడు కూటి పేద కావచ్చును. కూటి పేద కోటీశ్వరుడు కావచ్చును. ఇవి ప్రాకృత మైనటువంటి చర్యలు, ప్రకృతి యొక్క స్వభావములు. మానవుడు ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించి నప్పటికినీ, ఇవి ప్రకృతి బద్ధమైనటువంటివి. ఇవన్నీ మోహములో కూడినటువంటివి. ఈ మోహం ఏనాటి కైనా తిరిగి కాల చక్రములో నెట్టక తప్పదు. కనుక ఈ సత్యాన్ని గుర్తించి ప్రతి మానవుడు తన కర్మలు సక్రమమైనవిగను, సదుపయోగ మైనవిగను. ఇతరులకు సహాయకర మైనవిగను రూపొందింపజేసుకోవాలి. ధనవంతులు దరిద్రనారాయణ సేవ చేస్తున్నామని భావిస్తారు. దరిద్రనారాయణులంటే ఎవరు? కేవలము మానవ దృష్టిలో, తినుటకు తిండిలేనివారు, ఉండుటకు కొంపలేనివారు, కట్టుటకు బట్టలు లేనివారని మనము భావిస్తున్నాము. దరిద్రనారాయణుడంటే, దరిద్రుని హృదయవాసి అయినటువంటి నారాయణ సేవనే చేసినట్లు భావించాలి. రూపములేని భగవంతునకు ఈ రూపమనే మార్గములో మనము ప్రవేశించి తద్వారా మన కర్మలను సార్థకము గావించుకోవాలి. ఎవడు తన హృదయమునకు బీదవారి యొక్క చింతలు కొంత వరకు ప్రవేశ పెట్టుకొని, ఏదో తనకు తగినటువంటి సేవచేయాలి అని సంకల్పించుకొనునో - అట్టివాని హృదయమునందే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు.
(స.సా.జ. 91 పు.10)
"అమ్మా! ధర్మం చెయ్యండి. బాబూ! ధర్మం చెయ్యండి" అని బిచ్చగాడు నీ ముందు చెయ్యి జాపుతాడు. అతనిని నీవు నీ కర్తవ్యము బోధించే గురువుగా భావించు". క్రిందటి జన్మలో దానధర్మాలు చెయ్యక ఈ జన్మలో ఇటువంటి నికృష్టమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాను. మేల్కొనండి. కళ్ళు తెరిచి నా దీనస్థితి చూడండి. ధర్మం చెయ్యండి" అంటూ నీ దానం స్వీకరించి నిన్ను తరింప చెయ్యడానికొచ్చిన ప్రత్యక్ష నారాయణునిగా గుర్తించు. చెయ్యగలిగితే దానం చేసి సర్వభూతాంతరాత్మ అయిన భగవంతుని అనుగ్రహం సంపాదించు. అంతేకాని అతడిని అసహ్యించుకునో, దూషించో అవమానించకు. “సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి ఎలాగు సత్ఫలితాన్ని అందిస్తుందో సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అలాగునే దుష్ఫలితాన్ని అందిస్తుంది.
(ప్రే.బ.పు.24)