దృఢ నిశ్చయః ఇది దృఢమైనదిగను, స్థిరమైనదిగను, విశ్చలమైనదిగను ఉంటుండే తత్వము, ధైర్యసాహసములు దృఢశక్తులు మానవునకు సహజంగానే ఉంటాయి. ఈ దృడత్వమును, ధైర్యసాహసములను అనేక విధములై నటువంటి మార్గములలో అనుభవిస్తుంటాడు జీవుడు. దృఢమైన ధైర్యసాహసములను కొంత మంది పర్వతమునుయెక్కే విషయములో వినియోగిస్తారు. మహాధీరులై వుంటుంటారు. ఇట్టి ధైర్యసాహసములను దృఢశక్తిని అనంతమైన సముద్రమును దాటే విషయములో ఈదే విషయములో కొందరు ప్రవేశపెడతారు. స్థిరచిత్తులై వుంటుంటారు. మరికొందరు భీకరారణ్యములో ప్రయాణము చేసే ధీరులై వుంటారు. దయాదాక్షిణ్యములు లేకుండా యితరుల హింసించి ధనమును ప్రోగుచేసుకొనే విషయములో కొందరు ధైర్యసాహస దృఢశక్తులను కలిగి ప్రవర్తిస్తుంటారు. మానవత్వమునే మరచి దైవత్వమును విస్మరించి దానవులుగా ప్రవర్తించి క్రూరులుగా ప్రవర్తించే ధీరత్వము కలిగినవారు మరికొందరుంటారు.
ఈ ధీరత్వమును దృఢత్వమును మంచిగను ఉపయోగించు కొనవచ్చును చెడ్డగను ఉపయోగించు కొనవచ్చును.
వాల్మీకి రత్నాకరుడుగా నుండినప్పుడు తన ధైర్యసాహస దృఢశక్తుల నన్నింటిని దుర్మార్గములో ప్రవేశపెట్టాడు. సప్తఋషుల సంపర్కముచేత వారి ప్రబోధలచేత ధైర్యమును సాహసమును దృఢశక్తులను పవిత్రమైన రామనామములో ప్రవేశపెట్టాడు. కనుక వాల్మీకి రామాయణమునకు దాతగను కర్తగనూ రూపొందినాడు. కేవలము లౌకికమైన ప్రాపంచికమైన వ్యావహారిక సంబంధమైన విషయములందు ప్రవేశపెట్టుటకంటె యింద్రియ నిగ్రహమునందు, దైవా పేక్షయందు, దివ్యమైన ప్రపత్తి మార్గమునందు ధైర్యసాహస ధీరత్వములను ప్రవేశపెట్టటముతో మానవత్వము సార్థకమవుతంది. ఇది మానవత్వమునకు ఒక విధమైన విశిష్టతను రూపొందింప జేస్తుంది.
(శ్రీగీపు.19/20)