దేవాలయమునకు ప్రాకారమని ఒకటుంటుంటాది. దీనిలో అక్కడక్కడ కొన్ని రంధ్రములు పెట్టి వుంటుంటారు.” దేహోదేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః” ఈ జీవుడనే దేవునకు యీదేహము దేవాలయము వంటిది. ఇదే దీని ఆవరణము. ఇందులో మమత్వమనేదే ఒక దట్టమైన కాంపౌండు. దీనిద్వారా అనేక యింద్రియములు ప్రచురితమైపోతూ వుంటాయి. కనుకనే యీ దేహికి దేవాలయము అనే యీ దేహము ఒక హద్దుగా నియమిస్తూ వచ్చారు. గొప్ప గొప్ప రాజులు నివసించే భవనములకు పెద్ద కోటగోడలు కడుతూ వుంటారు. ఈ కోటగోడకు నవద్వారములని పెట్టి వుంటారు. అదే విధముగనే ఆత్మసామ్రాజ్య మనేదానికి మహారాజయిన దివ్యత్వములో కూడిన ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరిగా వుంటుందిది. దీనికి నవద్వారములు వుంటున్నాయి. “నవద్వారేపురే దేహే ’ అన్నాడు కృష్ణుడు. అగోడ జడమైన రాతితోనో, సిమెంటుతోనో, యిటుకతోనో కట్టబడి వుంటుండాది. కాని యీ కోటగోడ రక్తమాంసములు, ఎముకలతో కట్టబడి వుంటుంది. ఈ దేహములో దేహి వుండినంత వరకును యిది అనేక విధములైన సుగంధములు విరజిమ్ముతూ వుంటుంది. ఈ దేహి దేహమును వదలిన తక్షణమే యిది దుర్గంధములతో కుళ్ళిపోతుంది. ఇది తొమ్మిది చిల్లుల తోలుతిత్తియే గాని, కాంతి కలిగిన వజ్రఘటము కాదు. నిముషనిముషమునకు నీచులూరునే గాని, పునుగు జవ్వాదులు పుట్టబోవు . ఇలాంటి దీనిని దైవత్వముగా మార్చుకోవటములో యెంతైనా దివ్యత్వముగా మారిపోతుంది.
(శ్రీ.గీ పు. 185)