నేను ఋషీకేశ్ లోని గెస్ట్హౌస్లో దిగాము. మిగిలిన రెండు వందల మందికి రామకృష్ణారావు వసతి ఏర్పాటు చేశాడు. ఆనాడు స్వామికివానంద వారిశిష్యులు గస్ట్హౌస్కు వచ్చి, "రేపు శివానందులవారి 70వ బర్త్ డే. కాబట్టి స్వామి తప్పక రావాలి" అని కోరారు. నేను, “ఇది శివానంద బర్త్ డే కాదు, కుప్పుస్వామి బర్త్డే " అన్నాను. శివానంద పేరుతో సన్న్యాసము తీసుకోక పూర్వము ఆయన పేరు డా॥ కుప్పుస్వామి. సన్న్యాసము తీసుకోవడంతో ఆ కుప్పుస్వామి చనిపోయాడు, ఆ వేషమే మారిపోయింది. అప్పుడే తాను శివానంద అని పేరు పెట్టుకున్నాడు. అది జరిగి అప్పటికి 26 సం॥లు అయినది. కాబట్టి, "కుప్పుస్వామికి 70 ఏళ్ళు, శివానందకు 26 ఏళ్ళు" అని అన్నాను. అప్పుడు శివానంద, "స్వామీ! ఈ దేహానికి 70 ఏళ్ళు పూర్తి యైనవి. కాని, ఇంతవరకు ఎవ్వరూ ఈ విధంగా నన్ను సుత్తితో కొట్టియుండులేదు" అన్నాడు. పుట్టినది మొదలు దేహము గిట్టునంత వరకు ఒకే రూపము, ఒకే నామమనేది కేవలం దైవమునకు, ఆవతారములకు తప్ప అన్యులకు సాధ్యం కాదు.
(స. సా జూ..97 పు.185/186)