నేడు దేశమునకు కావలసినది భోగభాగ్యములు కాదు. మానవజీవితము పవిత్రమైనది విలువైనది. జీవించదగినది మానవతా విలువలు లేకుండిన ఆధ్యాత్మికము అడుగంటి పోతుంది. నైతిక సమగ్రత శాంతము నశించిపోతుంది. మధురాత్మకమైన ధర్మానుభూతి మంట గలసిపోతుంది. ఆదర్శవాదమే అడుగంటి పోతోంది. సమాజసంక్షేమాన్ని లక్ష్యమందుంచుకుని మానవతా విలువలను సాధించే నిమిత్తము జన్మించినామను విశ్వాసముతో కాలాన్ని సార్థకముగావించుకొనవలెను.
(స. సా.వ.2000 ముందు పేజీ)
రావణుడు ఎన్ని విద్యలు చదివినా ఎంత కఠోర తపస్సు చేసినా అతనిలో హృదయ పరివర్తన కలుగలేదు. అతడు వాంఛలచేత కుమిలిపోయాడు. ఆశలచేత కృంగిపోయాడు. కోరికలచేత కల్మషుడయ్యాడు. కానీ, చిట్టచివరికి తనప్రాణం పోయేముందు ప్రజలకు ఒక చక్కని సందేశాన్ని అందించాడు. "ఓ ప్రజలారా! నేను కామమునకు లొంగి పోయి నా కుమారులను పోగొట్టుకున్నాను: వాంఛలకు లోబడి నా వంశమును నాశనం గావించుకున్నాను: రాగమునకు లోబడి నా రాజ్యమును భస్మం గావించుకొన్నాను. మీరు నావలె చెడిపోకండి. రామునివలె ధర్మమార్గమును అవలంబించి జీవితంలో ఉత్తీర్ణులు కండి" అన్నాడు.
(స.పా.మే.99పు.114)
మానవుడు మానవమూసలో పోయబడిన దైవీతత్వము, సజీవ మైనవైనా, స్తబ్దమైనవైనా మిగిలిన ప్రతీది కూడ అంతే. ఈ అమూల్యసత్యాన్సిగూర్చిన ఎరుక కలిగి ఉండడం ఒక్క మానవునికి మాత్రమే లభించిన ప్రత్యేక ధర్మము. ఇదే ఉపనిషత్తులు మానవుని కిచ్చే సందేశం.
దీన్నే మతాలు మారు మ్రోగిస్తాయి. మహారుషులు మరీమరీ ప్రకటిస్తారు.
(సా.ఆ.పు.295)
నా సందేశమును ప్రతినిత్యము ఆచరించుటవలన సమకూరు శక్తి సామర్థములు, మనో స్టెర్యములకు ప్రతీకలుగా కాలేజీ విద్యార్థులు నిలవాలని నా ఆశయము. నా సందేశములను గురించే ఎల్లప్పుడూ చర్చించుకుంటూ, మననం చేసుకుంటూ, గానం చేస్తూ, ఆచరిస్తూ తమ హృదయాలలో అవి స్థిరంగా నిలిచిపోయేటట్లు చేసుకోమని వారిని నేను ప్రోత్సహిస్తాను. నేను ఏమిచేసినా చేస్తున్నా, ఏమి చెప్పినా, ఇతరులచే చెప్పించినా, నిత్యసత్యమైన ఈ ఆత్మత్త్వమును గురించి నొక్కి చెప్పి, వివరించి, దానియొక్క విశిష్టతను గురించి చాటి చెప్పడానికే. నేను నా ఆశలన్నీ విద్యార్థుల పైనే పెట్టుకున్నాను. వారే నా ఆనందమునకు మూలకారణం. వారే నా జీవనాధారము.
(దై.పు.316)
సాధకుడు, స్వల్ప విషయములందు కూడా త్వరగా కోపించకూడదు. అట్లుండిన ధ్యానమందు ఎంతమాత్రము వృద్ధికలుగదు. అతడు సౌమ్యముతో కూడిన ప్రేమభావము అలవరచుకొనవలెను. అప్పుడు చెడు అలవాట్లు తప్పిపోవును. చెడు అలవాట్లు అభ్యసించుటకు కోపమే ప్రథమ పీఠము. ఆది ఉండిన ఏ నిమిషమందైనా, ఎట్టిదానియందైనా, ఏవిధమైన చెడ్డలనయినా చేయ వచ్చును. కాన, మొదట దానిని, రూపు మానవలెను. క్రమేణా ప్రయత్నించవలెను. సాధకులకు తన తప్పులు ఎవరైనా బయట పెట్టిన, అప్పుడు ఓపికతో దానిని సర్దుకొనుటకు ప్రయత్నించి, తన తప్పును తెలిపిన వారికి కృతజ్ఞతగా ఉండవలెను. కానీ తెలిపిరికదా అని వారిపై కోపించరాడు. అప్పుడు మంచికి ద్వేషి అయి నట్లగును.మంచిని ద్వేషము చేసిన అలవడుననే చెడుగా ఉండును. కాన మంచిని ప్రేమించి, చెడ్డను వదలవలెను. వాటి పైననూ ద్వేషించరాదు. అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానము నందునూ, ధ్యానమునందునూ వృద్ధి పొందగలడు.
(ద్యా వా.పు.90)
సాధకులు లో చూపు నిలిపి, వారి మనస్సులను పరీక్షించు కొనవలెను. సరియైన పద్ధతులు ఉపయోగించ అందుండు మలినములను క్రమ క్రమేణ నొకదాని వెనుక నొకటి తీసి వేయవలెను. గర్వము చిరకాల స్థాయియై విడువనిదిగా నుండును. రజోమనస్సునందు ఆది అనేక విధములైన ఉపశాఖలు గలిగి అన్ని వైపులా వ్యాపించును. అట్టి ఉద్రేకము ఎప్పుడో ఒకప్పుడు తాత్కాలికముగా తగ్గిననూ, తిరిగి కనుపించుచునేయుండును అవసరము వచ్చినప్పు డంతయు గర్వము బయటపడిదాని అధిక్యతచూపుచునేయుండును.
(ధ్యా వా.పు. 91)
“ఎప్పుడూ నేనుంటా.
అనంతరూపమై తోడుంటా.
మీరు పిలిస్తే పలుకుతా.
హృదయాల్లో చైతన్యదీపమై వెలుగుతా.
దీనజనుల సేవలో ప్రేమరూపమై నిలుస్తా.
విశ్వమానవాళికి నా అనురాగ సందేశమిదే”.
(సనాతన సారథి, జనవరి 2019 పు13)