ఆడవారు పవిత్రమైన గ్రంథాలు చదవాలి. పవిత్రమైన దృశ్యములనే చూడాలి. ఈనాడు ఆడవారు గర్భవతులుగా ఉన్నప్పుడు రోజుకు మూడు, నాలుగు సినిమాలు చూస్తుంటారు. అందుచేత వారికి పుట్టే పిల్లలు కూడా "సినిమాపిల్లలు"గా ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటి? మన భారతదేశ చరిత్ర నుండి దీనికొక చిన్న ఉదాహరణను మీరు గుర్తించాలి. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనాడు అర్జునుడు ఆమెకు "పద్మవ్యూహమును" గూర్చి కొంత చెప్పినాడు. ఆమె గర్భంలో మన్న అభిమన్యుడు ఈ పద్మవ్యూహాన్ని గూర్చిన విషయాలను విన్నాడు. అదే విధంగా, లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు ఒకనాడు నారదుడు ఆమెకు పవిత్రమైన "బ్రహ్మభావమును" గురించి బోధించినాడు. అదంతా ప్రహ్లాదుడు చక్కగా విన్నాడు. కనుక, గర్భములో ఉన్న శిశువునకు ఈ విధమైన భావములు చేరిపోతాయి. అందుచేత తల్లులుతగిన శ్రద్ధబూని పవిత్రమైన దృశ్యములను చూచుటకు పవిత్రమైన పలుకులు శ్రవణము చేయుటకు తగిన ప్రయత్నం చేయాలి.
(శ్రీ భ ఉపు.131/132)