దశరదథుడు పుత్రకామేష్టి యాగానకు ఋషులను, మహాపండితులనందరినీ ఆహ్వానించాడు.ఇక్కడ ఓక నూతన విషయం మీరు గుర్తించాలి.కౌసల్యకు అంతకు పూర్వమే ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు శాంత. ఆడబిడ్డ కదాయని ఆమెకు. రాజ్యార్హత ఉండదని, పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని దశరథుడు ఈమెను రోమపాదునికి దత్తుగా ఇచ్చాడు. తరువాత ఆమె పెరిగి పెద్దదై ఋష్యశృంగుని వివాహం చేసుకొని అతనితో పాటు ఋష్యాశ్రమంలో ప్రవేశించింది. దశరథుడు తలపెట్టిన పుత్రకామేష్టియందు ఈ ఋషిని పిలిపించి, దానధర్మాలు చేయించాలని మంత్రియైన సుమంతుడు రాజుకు సలహా ఇచ్చాడు. అప్పుడు దశరథుడు సుమంతుడినే పంపించి ఋషులందరినీ ఆహ్వానించాడు. ఋష్యశృంగుని ఆశ్రమమునందుగాని, ఆతడు సంచరించే దేశమందుగాని ఎట్టి అశాంతులు, అన్యాయములు, అక్రమములు జరగడం లేదు. నిరంతరం సుభిక్షంగా రాజ్యం జరుగుతున్నది. సకాలమునకు వర్షం రావడం, పంటలు పండడంతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. అందువలన ఈ యాగమునకు ఋష్యశృంగుని ఆహ్వానించుటకు సుమంతుడు స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు ఋష్యశృంగుడు “నేను ఒక్కడినీ రావడానికి వీల్లేదు. నేను (ప్రథమ ఋత్విక్కుగా ఉంటాను. శాంతను కూడా ఇందులో ఋత్విక్కుగా అంగీకరించాలి,” అని చెప్పాడు. తప్పక అంగీకరిస్తామని ఒప్పుకున్నారు. అప్పుడు ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు వచ్చాడు. అయోధ్య గిరిన వెంటనే శాంత తన తల్లిదండ్రులైన కౌసల్యాదశరథులకు నమస్కారం గీసింది. ఆ దృశ్యం చూసినవారంతా “ఎవరీ ఋషిపత్ని? ఎందుకు కౌసల్యాదశరథులకు నమస్కారం చేసింది?” అనుకొన్నారు. దశరథుడు కూడా తన కుమార్తె సంగతి మరచిపోయాడు. శాంత వేషభాషలన్నీ ఒక మునిపత్నిని పోలినవిగా ఉన్నాయి. క్రమక్రమంగా కౌసల్యాదశరథులు అంతను జ్ఞప్తికి తెచ్చుకొనడానికి ప్రయత్నం చేస్తుండగా, ఆమె “మీ కుమార్తినే నేను,” అని చెప్పింది. వారిద్దరూ చాలా ఆనందించి ఇలాంటి సుపుత్రిక తమకు లభించిందని పొంగిపోయారు. ఆమె పుట్టిన తక్షణమే దశరథుడు ఆమెను రోమపాదునికి దత్తత ఇచ్చాడు. ఆనాటి నుండి ఆమె కౌసల్యాదశరథులకు దూరంగా ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె తిరిగి వారి గృహంలో ఋషిపత్నిగా, ఋత్విక్కుగా ప్రవేశించింది. పుత్రకామేష్టి యాగములో పాల్గొని, కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరిపించింది. ఆ యాగఫలితంగా దశరథునకు రామలక్ష్మణభరతశతృఘ్నులు అనే నల్గురు కుమారులు కల్గారు. వారికి అంతకు పూర్వమే జన్మించిన తమ సోదరి శాంతాదేవి గురించి ఏమాత్రం తెలియదు. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 58-60)