స్వతంత్రమంటే ఏమిటి? ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. ఎవ్వరి అధీనంలో కూడా లేకుండా ఉండటం స్వతంత్రం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. నీ హృదయాన్ని నీవు అనుసరించడమే స్వాతంత్ర్యం. హృదయమే నీ గురువు. హృదయమే నీ దైవం. హృదయాన్ని అనుసరించినప్పుడే విజయాన్ని సాధిస్తావు. ఇదే దైవాన్ని అనుసరించమని బోధించడం.
యంత్రము దేహము, మంత్రము శ్వాసము, తంత్రము హృదయము. యంత్ర మంత్ర తంత్రముల సమ్మిళిత స్వరూపమే మానవత్వము. ఈనాడు పరదేశీయుల పరిపాలననుండి మాత్రమే విముక్తిని పొందగలిగాము. విదేశీయుల బంధన మాత్రమే బంధన కాదు. స్వబంధన నుండి కూడా విముక్తి పొందాలి! ఇంద్రియముల అధీనములో ఉండటమే స్వబంధన. స్వబంధననుండి కూడా విముక్తుడైనప్పుడే స్వతంత్రుడవుతాడు. బాహ్య స్వాతంత్ర్యం, అంతర్ముఖ స్వాతంత్ర్యం - ఈ రెండింటిని పొందినవాడే నిజమైన మానవుడు.
నిజముగా మానవుడు స్వాతంత్ర్యము పొందాలనుకుంటే ఇంద్రియ నిగ్రహ ప్రాధాన్యాన్ని, దైవ సత్యత్వాన్నీ మానవత్వ విశాలత్వాన్నీ గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనినే పతంజలి తన యోగశాస్త్ర సూత్రములలో యోగః చిత్తవృత్తి నిరోధః అని చెప్పాడు. మనస్సును నిగ్రహించవచ్చునని అందరూ చెప్పవచ్చును కాని, నిగ్రహించే శక్తి అందరికీ ఉండదు. ( శ్రీ సత్యసాయి) సనాతన సారథి, ఆగస్టు 2021 పు7)