ఇతడు మహారాష్ట్ర దేశమున జన్మించిన మహాత్ముడు. శ్రీమద్భాగవతమును ఏకనాథుడే రచించెను. ఆ బాలవృద్ధులకు భక్తిప్రపత్తులు హృదయమున హత్తుకొనునట్లు భాగవతము బోధించినవారలలో ఏకనాథుడు ఆదర్శ ప్రథముడు. ఎట్టివారినైనను ద్వేషించక, శాంతివచనములతో సరిచేసుకొను సహనచిత్తుడు. ఒకనాడు ఏకనాథుడు నదీస్నానముచేసి వచ్చుచుండగ గిట్టని ఒక మహమ్మదీయుడు అతనిపై ఉమ్మి వైచెను. నానామాటలాడెను. అందులకు ఏకనాథుడు చిరునవ్వుతో అంగవస్త్రమును తీసి తుడుచుకొని అతనిని కూడను ఆశీర్వదించి గృహము చేరెను. హరిజన బాలుని పెంచి పెద్దచేసి తన బిడ్డవలె అతనికి అన్ని కార్యములు తానే చేసెను. తన ఇంటిలో చేరిన దొంగను క్షమించి, పాపము దొంగలకే చిక్కలేదని విచారించి కొన్ని పాత్రలను దొంగలకిచ్చి పంపెను. నిన్ను హింసించువారిని సహితము క్షమించి అతనికి ఉపకారము చేయమని బోధించిన త్యాగి ఈ ఏకనాథ్. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 158)