(సమర్థుడు పవిత్రచిత్తుడు. సహన, ప్రేమలు అతని స్వభావములు. గ్రామనామమే అతని - ఆహారము. పట్టణములు వదలి నట్టడవులలో హృదయనాదమున తన భావగానమును లీనము చేసి రాముని కీర్తించెడివాడు. అతడు ఛత్రపతి శివాజీకి గురువు. రామదాసు మార్గదర్శకమును, ప్రోత్సాహమును అనుసరించుటచే రాజ్యమును సంపాదించెను. శివాజీ తాను సంపాదించిన రాజ్యము గురువుగారి కరుణాకటాక్షమే అని తలచి ఆ రాజ్యమును సమర్థునికి అర్పితము చేసెను. సమర్థుడు త్యాగపురుషుడగుటచే అందుకు సమ్మతింపలేదు. శివాజీ చేయునదిలేక కాషాయవర్ణముగుల గుడ్డను తన విజయపతాకముగా అంగీకరించి సన్యాసము తెలుపు గుర్తును తన జెండాగా భావించి, గురువుగారి ఋణమునుండి విముక్తిని చేయమని ప్రార్థించగా, రామదాసు శివాజీకి రాజనీతులు బోధించి, ప్రజాక్షేమమే రాజు సౌభాగ్యమని, ధర్మరక్షణే ప్రభువుకు కర్తవ్య కర్మ అనియు ఉపదేశించెను. ఇతడు రామకథాచరితమును శివాజీకి నీతిగా బోధించెను.)
మహారాష్ట్ర దేశంలో ఒక కుగ్రామంలో సమర్థ రామదాసు జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ. అతడు తన ఎనిమిదవ ఏటనే తండ్రిని కోల్పోయాడు. చిన్నతనంలో అల్లరిచేస్తూ వుండేవాడు నారాయణ. తల్లి రణూబాయికి అతడు ఒక సమస్య అయినాడు. నారాయణునికి పదమూడవ సంవత్సరము వచ్చిన వెంటనే బంధువులందరూ తల్లికి ఒక తెలివిగల పిల్లను చూచి వివాహము చేసెయ్యి అంటూ సలహా యిచ్చారు. ఆవిధంగా తల్లి నారాయణునకు ఒక అమ్మాయితో వివాహం నిశ్చయం చేసింది. వివాహ సమయంలో మాంగల్య ధారణకు ముందు వధూవరుల మధ్య ఒక తెరను కడతారు. నారాయణ వివాహ సమయంలో కూడా ఆవిధంగానే తెరను కట్టారు. మాంగల్యధారణ సమయంలో తెరను తొలగించారు. నారాయణ అక్కడ లేదు. ఊరంతా వెతికించారు. కాని, అతడు కనబడలేదు.
పెండ్లి పీటలమీదనుండి పారిపోయిన నారాయణ చివరకు పంచవటి ప్రాంతం చేరుకున్నాడు. నారాయణ శరీరం పులకరించింది. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశమది. తన సాధనకు తగిన ప్రదేశమని నిర్ణయించుకొని, నిరంతరం రామనామస్మరణ చేయటం ప్రారంభించాడు. అల్లరి ఆకతాయి పిల్లవాడు అయిన నారాయణ యిటువంటి సాధకుడుగా ఎట్లు మారాడు? కొంత పూర్వజన్మ సుకృతం. అంతేకాదు అతడు ఇల్లు వదలి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక హనుమంతుని ఆలయంలోకి ప్రవేశించాడు. చిన్నప్పటినుండి నారాయణునకు హనుమంతుడు ఇష్టదైవం. ఆ విగ్రహం ముందు నిల్చుకొని ఈ విధంగా ప్రార్థించాడు. హనుమంతా! నీవు నీ శక్తి సామర్థ్యములను గుణగణములను నాకు ప్రసాదించు అని. అతని ప్రార్థనను ఆలయంలో అనుగ్రహించిన సూచనగా హనుమంతుని విగ్రహములోనుండి దివ్యంలో తరంగాలు ఉద్భవించి నారాయణునిలో ప్రవేశించాయి. సామాన్యులు సాధకులుగా మారుట, సాధకులకు సాక్షాత్కారము కలుగుట దైవనిర్ణయం ప్రకారం జరుగుతాయి. పంచవటిలో పన్నెండు సంవత్సరాలు తన సాధన కొనసాగించాడు. తత్ఫలితంగా హనుమంతునివలె త్రివిధ శరణాగతి తత్త్వమును అనుభూతికి తెచ్చుకొనగలిగినాడు. అనగా హనుమంతునివలె రామా! దేహరీత్యా నీవు ప్రభువు, నేను దాసుడను. మనోరీత్యా నీవు బింబము, నేను ప్రతిబింబము. ఆత్మరీత్యా నీవే నేను, నేనే నీవు . హనుమంతునివలె నారాయణుడు రామదాసుగా మారదలచుకొన్నాడు.
పంచవటి వదలి భారతదేశమంతటా పర్యటించాడు. అప్పుడు మన దేశం విదేశీయుల పరిపాలనలో వుండినది. సనాతన ధర్మమునకు ఆదరణ నశించింది. దేశ పరిస్థితులను పురస్కరించుకొని రామదాసుగా పేరు మార్చుకొనిన నారాయణ ప్రజలలో, పాలకులలో, . ముఖ్యంగా హిందువులలో దేశభక్తి, దైవభక్తి, ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను గురించి ప్రచార ప్రబోధలు సలిపాడు.గ్రామములలో రామనామము ప్రతిధ్వనించేటట్లు చేశాడు. గ్రామసేవయే రామసేవయని నిరూపిస్తూ వచ్చాడు. --
కొంతకాలము తరువాత మహారాష్ట్ర దేశము చేరుకున్నాడు. అప్పటికి శివాజీ స్వతంత్ర రాజ్య నిర్మాణానికి ఉద్యమించిన సంగతి తెలుసుకొని సంతోషించాడు. ఒకానొక శుభసమయాన వీరిరువురు కలుసుకోటం జరిగింది. అంతకు పూర్వం తుకారామ్ శివాజీతో, నీకు గురువు సమర్థ రామదాసు అని చెప్పియుండిన సంగతి శివాజీకి గుర్తు వచ్చింది. ఒక రోజు శివాజీ భవనం మందు, భవతీ భిక్షాం దేహి అని నిలబడ్డాడు రామదాసు. శివాజీ ఒక పత్రాన్ని ఆయన భిక్షాపాత్రలో వేశాడు. శివాజీ, స్వామీ! నా రాజ్యాన్ని మీకు ధార పోస్తున్నాను అన్నాడు. రామదాసు, నాయనా! నేను సర్వసంగ పరిత్యాగిని. నాకు పదవీ కాంక్ష లేదు. కానీ, నేను చెప్పినట్లు నడచుకో. ఈ రాజ్యము -భగవత్ప్రసాదమని భావించి, భగవంతుని ప్రతినిధిగా, ధర్మరక్షకునిగా వ్యవహరించు అన్నాడు. సమర్థ రామదాసు శివాజీకి గురువు. తనకు విద్యాబుద్ధులు ప్రసాదించి రాజ్యపాలనా విధానములో కూడా ధర్మసూక్ష్మాలను బోధించే గురువైన రామదాసును అచంచల భక్తి విశ్వాసాలతో పూజించేవాడు. ..
- ఒకరోజు శివాజీకి మూడు వస్తువులను కానుకగా పంపాడు రామదాసు. రెండు ఇటుకలు, కొబ్బరికాయ, మట్టి. వీటిని పంపటంలో భావమేమి? కొబ్బరికాయను ఎందుకు కోరుకుంటాము? తియ్యని, తెల్లని కొబ్బరిని అనుభవించటానికి. అది సాత్విక గుణమునకు ప్రతీక. రాజ్యము అతని చేతులో వున్నది. అతడు శుద్దసాత్విక తత్త్వముతో, ఆచరణాత్మకంగా ప్రవర్తిస్తూ పాలించాలి. ప్రజలలో కూడా ఆత్మతత్త్వమును అలవరచాలి. ఇటుకలచే ఇల్లు నిర్మిస్తాము. ఇల్లు ఏవిధంగా గృహస్థులకు రక్షణయిస్తుందో రాజైనవాడు ప్రజలకు ఆవిధంగా రక్షణ యివ్వాలి. మట్టి మనలను కన్న భూమి అయిన భారత భూమిని గుర్తు చేస్తుంది. ఈ విధంగా రామదాసు శివాజీకి కర్తవ్యాన్ని బోధించాడు.
ఆ రామదాసుకు సమర్థ రామదాసు అని ఎలా పేరు వచ్చింది? రామదాసు ధర్మరక్షణకై ఒక చేతిలో దండం, మరొక చేతిలో విల్లు, అమ్ములపొది తగిలించుకొని సంచరిస్తూ వుండేవాడు. గోదావరి నదీ తీరంలో ఈ రూపంలో తిరుగుతూ వున్నప్పుడు కొందరు పండితులు అతనిని, అయ్యా! నీవు సాధువు వలె కనిపిస్తున్నావు. మరి చేతిలో ఆయుధాలు ఏమిటి? నీవు కోయవాడివా? సాధువువా? అని ప్రశ్నించారు. అందుకు రామదాసు, నేను రామదాసును, ధర్మరక్షణ కొరకు అవసరమైతే ఆయుధాలను ప్రయోగిస్తాను అన్నాడు. అప్పుడా పండితులు, నిజముగా నీవు ఆ బాణములను ఎక్కుపెట్టగలవా? అదుగో ఆ పైన ఎగిరే పక్షిని కొట్టగలవా?” అని సవాలుచేశారు. రామదాసు సూటిగా బాణాన్ని ఎక్కుపెట్టి ఆ పక్షిని కొట్టాడు. ఒక క్షణంలో ఆ పక్షి నేలమీద పడి చనిపోయింది. వెంటనే పండితులు, ఛీ! ఛీ! ఛీ! సాధువువలె వున్నావు. ప్రాణహింస చేస్తావా? అని గద్దించారు. అప్పుడు రామదాసు, అయ్యా! మీరే కదా కొట్టమన్నారు. అన్నాడు. పండితులు, ఓహో! అయితే మేము గడ్డి తినమంటే తింటావా నీవు! నీకు స్వంత ఆలోచన లేదా? అని పరిహాసం చేశారు. ఇంక ప్రాయశ్చిత చేసుకొంటేగాని పాపం పోదు అని అన్నారు. పండితులు చెప్పినట్లు ప్రాయశ్చికం చేసుకొని, నా పాపం పోయినట్లేనా అని రామదాసువారిని అడిగా పోయినట్లే అన్నారు పండితులు. మరి ఈ పక్షి గతి ఏమిటి? నా పాపం పోయిన,తరువాత అది బ్రతకాలి కదా! అన్నాడు రామదాసు. అదెట్లా సాధ్యం ? అది దాని కర్మ అన్నారు. రామదాసుకు మనొప్పలేదు. అతడు శ్రీరామచంద్రునని స్మరిస్తూ కంటిధారలు కారుస్తూ, రామచంద్రా! నేనిన్ని దినములు చేసిన సాధనలు త్రికరణ శుద్ధితో కూడినవైతే, ఈ పక్షి బ్రతకాలి అని ప్రార్థించాడు. నేను నా అజ్ఞానంతో చేసిన పాపకృత్యానికి క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. కొద్ది క్షణాలలో ఆ పక్షి లేచి పైకి ఎగిరిపోయింది. అతనిని హేళన చేసిన పండితులంతా ఆశ్చర్యంతో, మహానుభావా! మేము తెలియక అనిన మాటలు, చేసిన అవహేళనలకు బాధపడుతున్నాం. మమ్ములను క్షమించండి. మీ శక్తి సామర్థ్యములెటువంటివో కన్నులారా చూశాము. ఆకాశంలో ఎగిరే పక్షిని ఎక్కుపెట్టి కొట్టారు. చనిపోయిన పక్షిని బ్రతికించారు. మీకు సమర్థ రామదాసు అను నామము సార్థకతను అందిస్తుంది అని పొగిడారు. --
సమర్థ రామదాసు పొగడ్తలకు పొంగక, తెగడ్తలకు క్రుంగక తన ధర్మ కార్యములను దీక్షతో సాగించాడు. పండరీక్షేత్రమునకు వెళ్ళాడు. పాండురంగని దర్శించాడు. పాండురంగడు పుండరీకుని ఏవిధంగా అనుగ్రహించాడో తెలుసు కున్నాడు. అతనికి తల్లి గుర్తుకు వచ్చింది. వెంటనే తన స్వగ్రామము చేరుకున్నాడు. రణూబాయి వృద్ధాప్యంలో కన్నులలో ప్రాణం పెట్టుకొని తన కుమారుని తలచుకుంటున్నది. అతని రాకతో ఆమె తన జన్మ తరించినదని భావించింది. తన కుమారుడు నారాయణే సమర్థరామదాసనే మహాభక్తుడని తెలుసుకొని ఆనందంతో పొంగిపోయింది. కొన్ని దినములు తల్లివద్ద వుండి, ఆమె మరణానంతరం ఆమెకు దహన సంస్కారము చేసి, మరల తన ధర్మ కార్యక్రమమును ప్రారంభించాడు. రామదాసు ప్రబోధల వలన, శివాజీ పరిపాలనవలన మరల భారతదేశంలో కర్మణీవనం కొంతవరకు నెలకొనటం జరిగింది. ఈ విధంగా దేశాభిమానం, దేహాభిమానం, ధర్మాభిమానములను తాను ప్రకటించి, ఆచరించి, ఆచరింపచేసి యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాడు సమర్థ రామదాసు.
- ఒకసారి సమర్థ రామదాసు శిష్యులను వెంటబెట్టుకొని శివాజీ వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలో శిష్యులు ఆకలి, దాహం బాధ ఓర్చుకోలేకపోయారు. ఆకలిదప్పులను లెక్కచేయని గురువుగారు ముందు నడచివెడుతుండగా కొందరు శిష్యులు ప్రక్కనున్న ఒక చెఱుకుతోటలో ప్రవేశించి చెఱకు గడలు తెచ్చుకొని తలొకటి తీసుకొని తింటున్నారు. ఆ తోట యజమాని యిదిచూచి పరుగుపరుగున వచ్చి ఒక కఱ్ఱతో శిష్యులకు దేహశుద్ధి చేశాడు. శిష్యలు ముందుకు పరుగెడుతుండగా ఆ తోట యజమాని వెంబడించి సమర్థ రామదాసుని కలుసుకొని అతని శిష్యులు చేసిన ఘనకార్యం గురించి చెప్పాడు. అప్పుడు రామదాసు అతనికి క్షమాపణ చెప్పుకొని, జిహ్వచాపల్యమును అరికట్టుకోలేని శిష్యులను మందలించాడు.
గురుశిష్యులు రాజభవనం చేరారు. శివాజీ ఎదురేగి గురువులకు పాదాభివందనముచేసి స్వాగతం చెప్పాడు. తరువాత స్నానం చేస్తున్న రామదాసు -నడ్డి మీద బొబ్బలు చూసి దిగ్భ్రాంతిచెంది యేమి జరిగినదని శిష్యులను అడిగాడు శివాజీ. సిగ్గుతో తల వంచుకొని జరిగినదంతా వారు చెప్పారు. శిష్యులు తిన్న దెబ్బల బాధను ఆ మహానుభావుడు తన దేహం మీదకు స్వీకరించినట్లు గ్రహించి,వెంటనే ఆ తోట యజమానిని పిలిపించి, స్వామీ! మిమ్మింత దారుణంగా హింసించిన ఆ దుర్మార్గుడికే శిక్ష విధించమంటారు?” అని అడిగాడు శివాజీ. తోటయజమాని గడగడ వణుకుతున్నాడు. అప్పుడు శాంతస్వభావుడైన రామదాసు, నాయనా! నేరం చేసినది నా శిష్యులు. ఇంద్రియ నిగ్రహం లేని వీరు తోట యజమాని అనుమతి లేకుండా ఆ చెఱకులు తీసుకోటం అపరాధం. అందుకు మనం ఆ యజమానికి నష్టపరిహారం చెల్లించాలి. అందుచేత అతని తోటపై ఈ ఏటికి పన్ను రద్దు చేయి అన్నాడు. .
ఒకానొక సమయంలో శివాజీ సమర్థ రామదాసునకు కొంత ధనము, కొన్నివస్తువులు, ఆభరణములు పంపించాడు. ఇతను నిరంతరము దానధర్మములందు - కాలము గడిపేవాడు. పవిత్రమైన త్యాగము పూనిన వ్యక్తి. అతను చాలా బీదవాడు. సర్వసంగపరిత్యాగి. అలాంటి వ్యక్తి మంచి కార్యములు చేస్తున్నాడు - శివాజీ ఆనందించాడు. ఆ త్యాగికి యిలాంటివన్నీ పంపించినప్పుడు . తానుఎంతైనా సద్వినియోగము చేస్తాడని తన పరివారముతో చెప్పి పంపించాడు.
వీరంతా పల్లకిలో తీసుకొని వెళ్ళి అతని ఇంటి ముందుంచారు; సామానంతా ఇంటిలో వుంచారు. రామదాసు నదినుండి స్నానముచేసి యింటికి వచ్చాడు. అక్కడున్న శివాజీ పరివారమునుచూచాడు. ఎవరండి మీరు? ఎందుకోసమై వచ్చారు? మా యింటిలో వున్నది ఇద్దరే. మేమిద్దరము ఆనందముగా వున్నాము. నలుగురు మోసుకుపోయే ఈ వాహనము యిక్కడకెందుకు తెచ్చారు?” అన్నాడు. నలుగురు మోసుకుపోయే వాహనమంటే శ్మశానమునకు తీసుకుపోయేది. అప్పుడు వారు చేతులు జోడించుకొని, మహానుభావా! శివాజీ మహరాజ్ పంపినారు యిక్కడికి. మీరు అనాథలుగా వుండటంచేత, మీరు చేసే కార్యములు ఉత్తమంగా వుండటంచేత దానికి తగిన సామగ్రినంతా యిచ్చి రమ్మన్నారు . రామదాసు పైకి చూచాడు, ఫక్కున నవ్వాడు. రామా! నీ యంతటి గొప్ప దేవుడే నాకు నాథుడుగా వుండగా, నేను అనాథుడ నెట్లవుతాను? జగత్పతియైన భగవంతుడే నా పతిగా వుండినప్పుడు నేనెట్లా అనాథనౌతాను? సర్వులకు నీవే పతివి. ఒకడెవడైనా అనాథుడున్నాడని విచారణ చేసుకుంటే ఆ అనాథుడవు నీవే. కారణమేమనగా నీకింకొక నాథుడు లేడు. సర్వ జగత్తుకు నీవే నాథుడవు. నీవే జగన్నాథుడవు. నీవే లోకనాథుడవు. నీవే ప్రాణనాథుడవు. నీవే దేహనాథుడవు. సర్వమునకు నాథుడవైన నీవున్నావు. నీకింకొక నాథుడు లేడు. కాబట్టి,రామా! నీవే ఆ అనాథుడు. కనుక, ఈ సామానంతా నీవే తీసుకొని పొమ్మ"న్నాడు. కొండలో రాతిపైన పుట్టిన వృక్షమునకు అక్కడెవరైనా పాదుచేసి, నీరు కట్టి, ఎరువు వేసి పెంచారా! ఎవ్వరూ పెంచలేదు. దైవమే ఆ రాతి పైన పుట్టిన వృక్షాన్నికూడను అభివృద్ధి గావిస్తున్నాడు. పచ్చని చిలుకకు ఎఱ్ఱని మూతి పెట్టినది ఎవరు? దానికి అంత బాగా మ్యాచ్ అయింది! నెమలి యొక్క రంగులు ఎంత అందంగా ఉంటున్నాయి! ఈ రంగులు ఎవరు వేశారు? రాతిలో పుట్టిన కప్పకు అక్కడనే (హారం ఎవరు అందిస్తున్నారు? ఇవన్నీ భగవంతుడు చేసేవి కావా?! అంతా భగవత్ సృష్టియే! భగవంతుని సృష్టి అంతయూ సహజమైనది. ఇది మరొకరికి సాధ్యము కాదు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు141-147)