(బ్రహ్మతత్త్వమును పొందుటకు ఎట్టి జాతిమత బేధములు లేవనియు, దైవము సర్వుల సొత్తు. అతనిని పొందుటకు అందరికీ సమానాధికారము కలదనియు నిరూపించిని చిరస్మరణీయుడు ఈ కబీరు. ఇతని భక్తి అపారము. ‘రామా అని స్మరించిన కాయమునే మరచెడివాడు. సదాచారమే మానవుని అలంకారము, అనగా శీలమే ప్రాణమనియు లోకమునందలి స్త్రీలు పరదేవతా స్వరూపులనియు, శీలము లేనివాడు ప్రాణము లేనివాడనియు, నీతిలేనివాడు కోతితో సమానుడనియు బోధించెను. అనుకూల దాంపత్యముగల గృహస్థ ఆశ్రమమునందే మోక్షమును అందుకోవచ్చుననియు, అనుకూలము లేక ఒకరి భావము ఒకరికి గిట్టని సమయమున సన్యాసమే శరణ్యమనియు బోధించెను. జ్ఞానమునకు ఆశ్రమ భేదములేమాత్రమూ సంబంధముండదనియు, సహనమే దీనికి సరైన ఆయుధమనియు చాటెను. హరిని స్మరించిన వాడు హరియే కాగలడు. హరిని వరించుటే జీవితమును తరింపజేసుకొనుట అని చాటెను)
కబీరు మహాభక్తుడు. నిరంతరం రామనామ స్మరణ చేస్తూ వుండేవాడు. కబీరు భగవంతునికోసం పీతాంబరం నేస్తున్నాడు. ఒంటరిగా మగ్గం దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. ఆపకుండా రామ, రామ, రామ అంటూ నేత సాగించాడు. బట్ట ఇరవై గజాల పొడుగు సాగినా కబీరు నేతపని ఆపివేయలేదు. నేత అనే తపస్సు ఆగకుండా సాగిపోతోంది. రామునికి ఉద్దేశించిన పీతాంబరం పొడుగైపోతోంది. తన యిష్టదైవం కోసం చేస్తున్న పనివల్ల కలుగుతున్న ఆనందమే కబీరుకు నిద్రాహారాలు. అదే ఆయన ప్రాణం నిలిపింది. రామాలయపు పూజారి దగ్గరకు వెళ్ళి విగ్రహాన్ని అలంకరించవలసినదని కబీరు అర్థించాడు. ఆ పీతాంబరం వేలెడు ఎక్కువా తక్కువా కాకుండా పొడుగూ వెడల్పూ సరిగ్గా సరిపోయినవి. భారతదేశంలో సాధుపుంగవులు ఆస్వాదించే ఆనందానికి కబీరు ఒక నిదర్శనం.
ఒక దినము ఒక సాధకుడు అతనివద్దకు వచ్చాడు. స్వామీ! గృహస్థ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక పురోగతి సాధించగలమా? అని ప్రశ్నించాడు. కబీరు సూటిగా వెంటనే సమాధానం చెప్పలేదు. కబీరు అప్పుడు మగ్గం మీద ఏదో వస్త్రం నేస్తున్నాడు. అతడు వెంటనే భార్యను పిలచి, దీపం వెలిగించి తీసుకురా అన్నాడు. అది పట్టపగలు. లోపలకూడా బాగా వెలుతురుగానే వుంది. అయినప్పటికీ కబీరు భార్య దీపం వెలిగించి తెచ్చి అక్కడ పెట్టింది. ఆ వెలుతురులో తెగిపోయిన దారమును సరిచేసి, ఈ దీపాన్ని తీసుకొని వెళ్ళు అన్నాడు. ఆమె అదేవిధంగా దీపమును తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది.
కబీరు తనను ప్రశ్నించిన సాధకుని చూచి, నాయనా! చాలామంది సంసార జీవితం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు తగులుతుందని అనుకుంటారు. అదీ చాలా పొరపాటు. తన ధర్మమును గుర్తించి వర్తించే భార్య వుంటే సంసార జీవితం ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేస్తుంది. మీరే చూచారు కదా! పట్టపగలు దీపం వెలిగించి తీసుకురా అని అన్నప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించలేదు. తీసుకురా అంటే తెచ్చింది. తీసుకొని వెళ్ళు అంటే వెళ్ళింది. ఈ విధంగా భర్తతో సహకరించే భార్య వుంటే సాధకుడు సంసార జీవితంలోనే ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు’అని తెలియజేసాడు. ఒకప్పుడు కబీరు చూసి కొందరు, నీవు నిరంతరం దైవనామాన్ని గానం చేస్తూ ఉన్నావే! నీకు కైలాసం కావలెనా, కైవల్యం కావలెనా? స్వర్గము కావలెనా? అని ప్రశ్నించారు. అపుడతడు, నాకు కైలాసం తెలియదు, కైవల్యం తెలియదు, స్వర్గం, వైకుంఠం యేదీ తెలియదు. ఎప్పటికప్పుడు రామా, కృష్ణా అని చెప్పుతుంటే అదే నాకు ఆనందము, అదే స్వర్గము అన్నాడు. కర్మ ద్వారా ఉపాసన, ఉపాసన ద్వారా జ్ఞానము కలుగుతుంది. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు149-151)