(అనుగ్రహపూర్వక లేఖ:)
దివ్యాత్మస్వరూపులారా! భక్తి ప్రపత్తుల ప్రచార కేంద్రమయిన ఈ పవిత్ర మందిరమున ప్రతిష్ఠా వార్షికోత్సవ సందర్భమున ప్రత్యక్షముగ మీ అందరి మధ్య కనుపించకున్ననూ, పరోక్షమున సాకారమైన ఆకారముతో మీ హృదయ మందిరములందు నిండి ఆనందమందుకొనుచున్నాను. ఆశీర్వాదములు అందించుచున్నాను.
ఈనాటి లోకము తీరెవ్వరును యెరుంగనిది కాదు. పాపమన్న భయముకానీ పున్నెమన్న కోరిక కానీ లేదు. సత్యము, ధర్మము, దయ, ప్రేమ, అహింస మున్నగు పవిత్ర గుణములు మాటలలో మాత్రము రాణించుచున్నవి కాని చేతలలో గానవచ్చుట లేదు. ఇక శాంతి సహనములు ఆరిపోయిన దూర దీపములై యున్నవి. ప్రతి మానవుడునూ శాంతి సౌఖ్యములకై విలపించుచున్నాడు కానీ, వాటిని అందుకొనుటకు తగిన కర్మలాచరించకున్నాడు. మనసులోని వాంఛ, మాటలోని కాంక్ష, క్రియలోని దీక్ష యేకమయినపుడే కార్యసిద్ధి గాంచును గానీ మాట, ఆట కేవలము నాలుకపై తీటవలే వుండిన సరియైన బాట యెట్లు చిక్కును?! రాజబాటన ప్రయాణము చేయ దీక్షపట్టినవారికి భగవత్ సంకీర్తనా వూటను గ్రోలిన అదియే మోక్షపురికి సరియైన పూలబాట.
అమూల్యమైన మానవ జీవితమును మాలిన్యమగు విషయవాసనలను మసిబొగ్గులకు అమ్ముకొనుట మహాపాతకము. భగవత్ నామరతనమే దానికి సరియైన వెల. అట్లు చేసిన జీవితమెంత సార్థకము! భగవన్నామ సుధారసాస్వాదన చేయుచు గడిపిన కాలమే కలిలో విలువైన కాలము. విషయాసక్తులగు వె ఱ్ఱివారలగుటకన్న భగవత్ శ్రద్ధాసక్తులగు సాధకులగుట ఎంతో సార్ధకము. అజ్ఞానాంధకారమును ఆవలత్రోసి ప్రజ్ఞాన విజ్ఞానమును ప్రసాదించునట్టి దివ్యౌషధమే నామరసము. అదే సుధారసము. దానిని గ్రోలి ధన్యులగుదురు గాక. పుణ్యము నార్జింతురు గాక. పుట్టినందుకు ఇట్టి గట్టి స్థితిని పట్టుకొందురు గాక.
ఇట్లు
బాబా
( గిండీ (చెన్నై)లోని శ్రీ సత్యసాయి మందిరం 20వ వార్షికోత్సవ సందర్భమున తేదీ 3.2.1968న భగవాన్ బాబావారు భక్తులకు వ్రాసిన అనుగ్రహపూర్వక లేఖ)
...............................
భగవాన్ సందేశం నలుగురికి పంచండి . ప్రచారము చేయండి - తూములూరు కృష్ణమూర్తి