మీ సంసారాన్ని విసర్జించమనిగాని, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టమనిగాని నేను చెప్పడం లేదు. రోజుకు ఇరవై నాల్గు గంటలలో కనీసం ఒక్క అరగంట సేవ చేయడానికి ఎందుకు సాధ్యం కాదు? ప్రభుత్వంకోసం, వారిచ్చే డబ్బుకోసం ఎనిమిది గంటలు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. అయితే, భగవదనుగ్రహానికి ఇంత, అంత అని హద్దు లేదు. మీరు చేసినదానికంతా మీ పేరున ఒక పెద్ద నిధి ఏర్పడుతుంది. వ్యాపారంద్వారా, ఉద్యోగంద్వారా ధనమును సంపాదించుకొంటున్నట్లుగానే మీరు న్యాయంగా జీవిస్తూ దైవకార్యంలో నిమగ్నమైనప్పుడు దానికి మించిన ధనం మీకు ప్రాప్తిస్తుంది. అదే భగవంతుని అనుగ్రహధనం. అది తీరనిది, తరగనిది. అట్టి అనుగ్రహధనమును సంపాదించుకోవాలి గాని, తుచ్ఛమైన భోగభాగ్యములు ఎంత సంపాదించుకొన్నా ఏమి ప్రయోజనం?! మనము ఇతరుల హృదయాలను సంతృప్తిపరచితే, వారి సంతృప్తే మన పాపాలను పరిహారం గావిస్తుంది. ఇదే సేవ అంతరార్థం. మనవలన ఉపకారం పొందిన వందమందిలో ఏ ఒక్కరైనా సంతృప్తిచెందితే చాలు, అదే మనకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. - శ్రీసత్యసాయి (సనాతన సారథి, అక్టోబరు 2022 నాల్గవకవరు పేజీ)