బ్రాహ్మణుడు ఈ దేహములో ముఖము వంటివాడు. ఈ దేహాన్ని, దేశాన్ని రక్షించే విమిత్తమై అందించబడిన హస్తములే క్షత్రియులు". ఇంక వైశ్యు డెవరు? ఇతడు ఆహారాన్ని చక్కగా ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ శరీరంలోని సర్వాంగములకూ ఆహార రసాన్ని సరఫరా చేస్తాడు. ఈ దేహము అన్నము పై ఆధారపడియున్నది. కనుక, దేహము నిలబడాలంటే అన్నమును అభివృద్ధి చేసుకోవాలి. దీని నిమిత్తమై "శూద్రులు" అనే తెగ ఏర్పడినది. కనుక, మన దేహంలో కాళ్ళే శూద్రులు, బ్రహ్మణుడు తల, క్షత్రియులు -భుజములు, వైశ్యుడు-ఉదరము. ఐతే, ఈ నాలుగూ వేరే వేరే ఉన్నాయా? లేక అన్నీ కలిసే ఉన్నాయా? పనులు వేరు వేరు, కాని, అన్ని కలిసి ఒక్కటే! ఒకదానితో నొకదానికి ఎంతో సన్నిహిత సంబంధబాంధవ్య మున్నది. దారిలో నడుస్తుంటే కన్ను ముల్లును చూస్తుంది. తక్షణమే కాలు దానిని దాటుతుంది. ఈ విధంగా కన్నుకు, కాలుకు ఎంత సన్నిహిత సంబంధబాంధవ్యమున్నదో చూడండి! కాలు కేదైనా దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. అనగా శూద్రుని కేదైనా అపాయం జరిగితే బ్రహ్మణుడు బాధపడతాడు. బ్రహ్మణుడు ఏదైనా ముల్లును చూస్తే "నాయనా! దానిని దాటుకో, దెబ్బ తగిలించుకోవద్దు." అని శూద్రుని హెచ్చరిస్తాడు. ఒకరితో నోకరికి ఉండే ఈ విధమైన అంతర్ సంబంధాన్ని ఈనాడు భారతీయులు మరచిపోయారు.
(శ్రీ భ.ఉ.పు.158)