అనపేక్ష శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ, యో మద్భక్తః స మే ప్రియ:
ప్రేమ స్వరూపులారా!
అనపేక్ష అనగా ఎట్టి అపేక్షలు లేకపోవటం శరీరమనోబుద్ధులతో కూడిన మానవునకు ఎట్టి అపేక్షలు లేకపోవటం చాలా ఆశ్చర్యము. ఇది సాధ్యమా? కాదు కాదు. మానవునకు జీవితములో ఎన్నియో విధములైన ఆపేక్షలుంటున్నవి. కొన్ని శ్రేష్టమైనవి. కొన్ని ఇష్టమైనవి. కాని ఈనాటి మానవునకు ఇంద్రియ సంబంధమైన ఫలితముచేత తాత్కాలిక ఆనందములు కలుగుతూ ఉంటాయి. ఇవి సత్యమైనవి కావు. క్షణభంగురమైనవి. ఇట్టి భౌతికమైన అపేక్షలచేత మానవుడు తన జీవితములో సత్యమును గుర్తించుకోలేక పోతున్నాడు.ఇట్టి క్షణభంగురమైన అభీష్టములను నెరవేర్చుకొనుటనే "ప్రేయస్సు" అని అన్నారు. రెండవది. దీనికి పూర్తి విరుద్ధమైనది. అందరికి అర్థముకానిది. అందరికి అందుబాటులో లేనిది. అంతర్భావముతో కూడిన అభీష్టమే. దీనినే "శ్రేయస్సు" అన్నారు.
ఒకవైపున ప్రేయస్సు మరొకవైపు శ్రేయస్సు. ఇవి రెండూ మానవుని తమ వైపు లాగుకునే నిమిత్తమై రెండూ పోటీ పడుతుంటాయి. కానీ ఈనాటి మానవుడు ప్రేయస్సు వైపే తన దృష్టి మరల్చును గాని శ్రేయస్సు వైపు తన దృష్టి మరల్చడు. ఈ ప్రేయస్సనే వాంఛలు అమితమైన రీతిగా మానవుని ఆనందపరుస్తాయి. కారణము తానీ భౌతికమైన దేహములో, భౌతికమైన లోకములో, భౌతికమైన భ్రాంతులతో, భౌతికమైన జీవితము గడుపుతున్నాడు. ఈ ప్రాకృత జగత్తునకు ఈ ప్రేయస్సనే అభీష్టములే తనను ఆనందింపచేస్తాయి. ఇవి ఇంద్రియములలో కూడిన ఆనందమే.
ఇంద్రియములు శాశ్వతమైనవి కాదు. రోగమయమైనవి ఇంద్రియములు, రోగమయమైన ఇంద్రియముల ద్వారా అనుభవించే ఆనందము రోగమయముగానే ఉంటుంది. కంటితో చూచాము. చూచినది సత్యమని విశ్వసిస్తున్నాము. కానీ నీవు చూచిన వస్తువు అనేక రంగులతో కనిపిస్తున్నది. కానీ జాండిస్ రోగము వచ్చినపుడు అంతా పచ్చగా కనిపిస్తుంది. నాలుక ఉంటున్నది: నీవు భుజించే సమయములో కారము కారముగను, తీపి తీపిగను, చేదు చేదుగను గోచరిస్తాయి.కానీ మలేరియా జ్వరము నీలో ప్రవేశించిందంటే ఆ నాలుక పైన తీపి పెట్టుకున్నా చేదుగానే ఉంటుంది. అప్పుడు నీ నాలుక దోషమా! లేక తీపి దోషమా! కనుక ఇట్టి రోగమయమైన ఇంద్రియముల చేత మానవుడు భ్రాంతులనే రోగములను అభివృద్ధి పరచుకుంటున్నాడు. కనుక ప్రపంచమంతయు ప్రేయస్సు వైపే ప్రయాణము చేయుచున్నది. కాని శ్రేయస్సు వైపున నూటి కొక్కరో కోటికొక్కరో ప్రయాణమవుతుంటారు. అంతర్భావములు అభివృద్ధి పరచుకోవటము శ్రేయస్సు, అంత:కరణ పవిత్రముగా పెంచుకోవటం, అంతర్ దృష్టిని అభివృద్ధి చేసుకోవటము. ఆత్మానందమును అనుభవించుకోవటం, అద్వైతానందము పొందటము ఇవియే శ్రేయస్సు యొక్క పద్దతులు. దీనిని కోరేవారు చాలా తక్కువ.
మనము ఈనాడు అభీష్టము లేకుండా ఎట్లా చేసుకోవాలి. అపేక్షలేని వాడంటే నాకు ప్రీతి అన్నాడు కృష్ణుడు. శరీర మనోబుద్ధులతో కూడిన మానవుడు అపేక్ష లేకుండా ఏ రీతిగా ఈ జగత్తులో జీవించగలడు? ఏదో ఒకటి ఇష్టమైనదో లేక శ్రేయస్సును కలిగించేదో కోరే తీరాలి. మిగిలిన కోరికలు అన్నీ ఈ రెండు కోరికలలోనే సమ్మిళితమై ఉంటాయి. కోరికలు లేని మానవుడు జగత్తులో కానరాడు. కనుక అపేక్ష లేకుండా ఎట్లా ఉండేది? దీనికే చక్కని ఉపమానము చెప్పాడు. నాయనా! నీవు ప్రేయస్సు పైన ప్రయాణము చేయవద్దు. ప్రేయస్సు పై దృష్టి నిలుపవద్దు. సర్వకర్మ భగత్త్ప్రీ త్యర్థమని నీకర్మలు నీవు ఆచరించు. ఈ ఫలితము నీకు ఉండదు. కనుక ఏ విధమైన ప్రేయస్సు లేకుండా ఉంటుంది. అప్పుడు నీవు అపేక్షలేని వాడుగా ఉంటావు. నీవు కర్మ లాచరించు. మానవుడు కర్మ లాచరించే నిమిత్తమే కాయము ధరించాడు. "కర్మణ్యేవాధికారస్తే" అని గీతప్రబోధించింది. కర్మానుబంధీనిమమష్యలోకే ఉపనిషద్వాక్యముప్రతి దేహము కర్మ చేతబంధింపబడుతున్నది. కాయముచే సర్వకర్మలు ఆచరిస్తున్నాడు మానవుడు.
అనపేక్ష ఉండాలంటే ఎట్లా వీలవుతుంది? నీవు కర్మలు వదలనక్కరలేదు. కర్మలు ఆచరించు. ఫలితము నీవు ఆశించకుండా ఉండు. అదియే అనపేక్ష.ఈ ఫలితమునీ ఏ రీతిగా అర్పితము గావించాలి? కర్మము ప్రారంభించక పూర్వమే ఇది భగవత్కర్మగా విశ్వసించు. అప్పుడు ఇదంతా భగవత్కర్మగా రూపొందుతుంది. ఈ అపేక్ష భగవదపేక్షగా మారుతుంది. కనుక ఉపనిషత్తులు తస్మైనమ: కర్మణే’ మొట్టమొదట కర్మకు నమస్కారము చేయి అన్నాయి. ఎందుకోసం చేయాలి కర్మకు నమస్కారం? "ఓ కర్మా! నేను ఆచరించే దాంట్లో ఎట్టి దోషములు లేకుండా చూచుకోవాలి. ఏ విధమైన పాపములు రాకుండా చూచుకోవాలి. కనుక నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఈ మార్గములో సహాయము చేయు"మని కోరటం. కనుక అపేక్ష లేని వాడంటే నాకు ప్రీతి అన్నాడు భగవంతుడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? కర్మను నీవు వదలనక్కరలేదు. కర్మను వదలి మానవుడు ఒక్క క్షణమైనా జీవించుటకు వీలుకాదు. కరచరణాది అవయములతో చేసే కర్మలే కాదు. సంకల్పములు కూడా కర్మలే. దృష్టి కూడా కర్మయే. శ్రవణము కూడా కర్మయే. ఈ పంచేంద్రియములతో కూడిన సర్వకర్మలు కర్మలు క్రింద చేరుతుంటాయి. ఈ సర్వము భగత్త్ప్రీత్యర్థముగా ఆచరించటమే కర్మలేనట్టుగా తోస్తుంది. నీవు ఎట్టి అభీష్టము లేనివాడుగా రూపొందుతావు. అప్పుడే అన పేక్ష అనే సార్థకనామము వస్తుంది.
రెండవది. శుచి: - శుచి అనగా పరిశుద్ధము . ఏమిటి ఈ పరిశుద్ధము? శరీరము పరిశుద్ధముగా ఉంచుకోవటమా? లేక బట్టలను పరిశుద్ధముగా ఉంచుకోవటమా? ఇది - కూడా అవసరమే. ఇది బహిశ్శుద్ధి దీనికంటె అంతశుద్ధి అత్యవసరము. బహిశుద్ధి మాత్రమే ఉండి అంతశ్శుద్ధి లేకపోతే సర్వము మాలిన్యమైపోతుంది.| భగవంతుని వంచిన గావించినట్లు గా ఉంటుంది కనుక అంతశుద్ధి నీవు చూచుకోవాలి. అనగా దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, రాగద్వేషములు ఇట్టి మాలిన్యమయమైన భావములు మనస్సుకు లేకుండా చూచుకోవాలి. ముఖ్యంగా పాత్ర
లోపలనే మహాపవిత్రంగా ఉంటుండాలి. ఈ టంబ్లరులో నీరు పోసుకున్నాము. లోపల పరిశుద్ధముగా నున్నప్పుడే నీరు త్రాగటానికి వీలవుతుంది. బయట మాత్రము శుభ్రముగా ఉండి లోపల మాలిన్యముంటే త్రాగుటకు వీలుకాదు. కనుక ఆంతర్ శుద్ధి అత్యవసరము. దీనినే యింకొక రీతిగా చెప్పాలనుకుంటే కళాయి లేని పాత్రలో పప్పు పులుసు వండితే అదంతా చిలుము పట్టిపోతుంది. అదే విధముగా లోపల పరిశుద్ధము లేనప్పుడు నీవు బాహ్యముగా ఎన్ని - పవిత్రమైన కర్మలు చేసినా మాలిన్యమైపోతాయి. కనుక నీవు శుద్ధిగా ఉండమని చెప్పాడు.
మూడవది శుచితోబాటు దక్షత. అనగా ఒక విధమైన ప్రతిజ్ఞ పూనాలి. ఈ జగత్తులో ఏ సమయమునందైనా నేను ఒక ఆదర్శమును సాధించాలి అని ఒక దీక్ష పూవాలి. మానవ జీవితము దేని కోసం వచ్చింది? మానవలోకమునకు ఆదర్శము నిరూపించాలి. ఆ విధముగా నిరూపించటమే కాక ఆత్మతత్త్వమునకు అత్యంత సమీపుడు కావాలి. మొట్టమొదట సాలోక్యం : - రెండవది సామీప్యం: సారూప్యం మూడవది; నాల్గవది సాయుజ్యం. ఈ నాల్గింటి యొక్క తత్త్యమందే పవిత్రమైన చిత్తము నిల్చిపోతున్నది. కనుక నేను కర్మలు చేయక తప్పదు. కర్మ కోసమే కాయము అవతరించింది.కాయము చేత -కర్మలు చేసి కాయము పవిత్రము గావించాలి. కనుక కాల కర్మ కారణ కర్తవ్యములు నిర్వర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యము. "నా జీవితమంతా, కట్టకడపటికి ప్రాణము విడుచునంతవరకు పవిత్ర కర్మలు నేను ఆచరించాలి." ఈ విధమైన దీక్ష మనం పట్టాలి. నేడు ఒక భావము. రెపొక భావము. ఈ విధంగా మార్పు చందుతూ రాకూడదు నీ అనుకూలములు పురస్కరించుకొని నీవు కర్మలు ఆచరించకూడదు. నీ హృదయ సాక్షిగా కర్మలు ఆచరించుటకు పూనుకోవాలి. మనము మన హృదయ సాక్షిగా కర్మలు ఆచరించుటకు ఒక దీక్ష పూనాలి. ఓ భగవంతుడా! ఈ కాయము ఎందుకోసం ఇచ్చావు? నీ సేవ నిమిత్తమై నేను కాయము ధరించాను. నా తల్లిదండ్రులు నీ సేవ నిమిత్తమే ఈ కాయము నందించారు. కనుక నిన్ను, నా తల్లిదండ్రులను తృప్తిపరచటమే నాకు ప్రధానమైన దీక్ష. కనుక మాతృదేవో భవ! పితృదేవో భవ! అని వారిని దైవస్వరూపులన్నారు.
నాల్గగది ఉదాసీనత : ఉదాసీనమనగా దేవిని పట్టించుకోకుండా పోవటం కాదు. మంచి, చెడ్డ రెండింటిని త్యజించటమే. ఇది మంచే అని స్వీకరించటం కాదు. ఇది చెడ్డ అని విసర్జించటం కాదు. రెండింటిని విసర్జించాలి - ఎట్లా? నీవు దారిని నడుస్తుంటే దారిలో ఒక ముల్లు కాలికి గుచ్చుకొంది. ఆ ముల్లును మనం తీసి వేయాలంటే మనం యింకొక ముల్లును సంపాయించుకోవాలి. ఇంకొకముల్లు సంపాయించి ఆ విరిగిన ముల్లును యీ ముల్లుతో తీసి రెండు ముల్లులు పారవేయాలి. ఒక ముల్లు విరిగి నిన్ను బాధిస్తున్నది. యింకొకములు దానిని తీసి సంతోషపరచింది. సంతోషపరచింది కదా అని ఆ ముల్లు నీ దగ్గర పెట్టుకో కూడదు. ఇది నన్ను బాధించిందని దానిని మాత్రమే దూరము పారవేయ కూడదు. రెండూ ముండ్లే. రెండింటిని తీసి పారవేయవలసిందే. ఉదాసీనత చాలా ప్రధానమైనది. ఎలాంటి విషయమునందు రాగముగాని, ద్వేషముగాని ఉండకూడదు. ఇంతే కాదు. "సంబంధ బాంధవ్యములందు అత్యంత సంబంధము కల్గి౦చుకోకూడదు". ప్రాకృతమునందు అనేక బంధనలు మనం అభివృద్ధి పరచుకుంటున్నాం. ముఖ్యంగా రాజకీయములలో మనం ప్రవేశించకూడదు. కారణ మేమనగా మన రాగము మరింత రాగముగా మారిపోయి రోగంగా తయారౌతుంది. దేనియందు ఆపేక్ష లేకుండా చూచుకోవాలి.
తరువాత సర్వారంభ పరిత్యాగి: సర్వము త్యజించాలి. ఎట్లా త్యజించాలి? అహంకారమమకారములు దూరము గావించుకోవటమే సర్వారంభ పరిత్యాగము. మానవుని అనేక కష్టములకు గురిచేయునది రాగద్వేషములే. మానవునికి భ్రమలు కలించేది అహంకారమే. ఈ అహంకారము ఉండినంత వరకు మానవునికి ఆనందము అత్యంత దూరంగా ఉంటుంది. ఈ అహంకారమును, ఆడంబరముచేత అభివృద్ధి గావించుకుంటున్నాడు. ఆడంబరము లేకపోతే అహంకారమునకు కళయే ఉండదు. కనుక అహంకారముచేత ఆడంబరము పెంచుకుంటున్నాం. అహంకార ఆడంబరములను త్యజించటమే సర్వారంభపరిత్యాగము.
యో మద్భక్తః స మే ప్రియ: ఇటువంటివాడు. నాకు ప్రియుడు అని చెప్పటం చాలా సులభమే. కానీ, సాధించటము చాలా కష్టము. ఇది ప్రతి మానవునికి వచ్చే సందేహమే. నా ఉద్దేశ్యము ఏమంటే చెప్పుట కష్టము, చేయటమే సులభము. ఇవన్నీ మంచి మార్గము అని గాఢమైన విశ్వాసముంటే ఎంతసులభముగానైనా ఆచరించవచ్చును. ఈ విశ్వాసము గాఢముగా లేక పోవటంచేత కష్టం కనిపిస్తున్నది. ఏ అపేక్షలు లేకుండా ఉండాలి ఇది చాలా మంచిది అనే గాఢ విశ్వాసము నీలో లేదు. మంచిదని చెప్పుతున్నావుగానీ విశ్వాసము లేదు. ఇదియే దైవ ద్రోహమునకు మూల కారణము. The proper study of mankind is man లోపల యిది మంచిదేయని తలచుకుంటున్నావు. కానీ యిది మంచిదని చెప్పలేక పోతున్నావు. చెప్పలేకపోవటమే కాదు చేయలేకపోతున్నావు. ఇది మంచిదని తెలిసినప్పుడు ఎందుకు నీవు చెప్పకూడదు? ఎందుకు నీవు చెప్పినప్పుడు చేయకూడదు? దీని పైన పూర్ణ విశ్వాసము లేకపోవటం మానవత్వము రాక్షసత్వంగా రూపొందుతుంది. అహంకారము, అభిమానము, ఆడంబరము రజోగుణము యొక్క లక్షణములని బోధించాడు కృష్ణుడు. నాయనా! నీవు నా భక్తుడు కావాలనుకుంటే ఈ రాక్షసగుణములను నీలో చేర్చుకోవద్దు. ఆడంబరము మహా ప్రమాదము. అహంకారము మరింత ప్రమాదము. ఈ ఆడంబరము, అహంకారము త్యజించాలి. ఆశలుండినా ఉండవచ్చు. కాని ఆడంబరము, అహంకారము ఉంటే తనను తాను ద్రోహము చేసుకోవటమే. ఎవరికో చేస్తున్నామని కాదు. తనను తాను కించపరచుకుంటున్నాడు. తనకు తానే ద్రోహము చేసుకుంటున్నాడు. ఇది ఆత్మ మార్గమునకు విరుద్ధమైనది. మొట్టమొదట తనను తాను తరింపచేసుకోవాలి. తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నించుకోవాలి.
(ద.య.స.97 పు. 102/108)
(చూ: భక్తుడు)