సమస్త సద్గుణములందు అభయము మకుట ప్రాయ మైనది. ఆదర్శపూరితమైనది. లౌకిక క్షేత్రమునందుగాని, అలౌకిక పారమార్థిక క్షేత్రమునందుగాని అభయమనేది లేకుండిన మానవుడు జీవించటము దుర్లభము. ఆధ్యాత్మిక సంగ్రామమునందుగానీ భయమునకు యే మాత్రము అవకాశము లేదు. భయశీలుడు పిరికిపంద, ఎట్టి చిన్న కార్యము సాధించలేడు. భయశీలుడు జగత్తునందు ఏ మాత్రము రాణించడు. నిర్భయము మూర్ఖముగా వుండవచ్చును. అభయము సత్యమును గుర్తించిన శక్తిగా మారుతుంది. భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు. అభయమునకు ఒక తూరే మరణము. కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జునుని. భయముండినంతవరకు మానవుడు మహాత్కార్యములు సాధించలేడు. అభయ శీలుడు మాత్రమే మహత్కార్యములందు జయము సాధించగలడు. అర్జునా నీవు భయమును పారద్రోలు. అభయమును నేర్చుకో. "విగత భయః" అనగా భయము నుండి దూరము కమ్ము అన్నాడు.
భయస్థుడు హిరణ్యకశిపుడు అభయశీలుడు ప్రహ్లాదుడు, అభయత్వము మేరు పర్వతము వంటిది. మన భయము శ్వాసగాలివంటిది.
(శ్రీ. గీ.. పు. 242/244)
అభయమునకు, భయమునకు, నిర్భయమునకు చాలా వ్యత్యాసముంటుండాది. భయమునకు నిర్భయము విరుద్ధమైన పదము. భయము పోతే నిర్భయము దీనికొక చక్కని ఉదాహరణము. దారిలో ఒక త్రాడు పడి వుంటుండాది. చీకటి ఆవరించిన తక్షణమే ప్రయాణము చేయు వ్యక్తి ఈ త్రాడును చూచాడు. త్రాడును చూచి పామని భయపడ్డాడు. టార్చి వేసి చూచినాడు. ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది. భయము పోయింది. భయము రావటము, భయము పోవటము, కొన్ని క్షణాలు మాత్రమే వుంటుంటాది. భయమునకు భ్రమనే, నిర్భయమునకు భ్రమనే. వస్తువును వేరే రీతిగా బావించుకోవటమే భయము. వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయము. ఇది భయనిర్భయముల విషయము. అభయము యీ రెండింటికి సంబంధము లేనటువంటిది. నిరంతరము స్వస్వరూపసంధానములో వుండినవానికి భయ నిర్భయములకు అవకాశమే లేదు. అభయత్వము భయమునకు విరుద్ధమైనదిగా భావించరాదు. అభయత్వములో అనేకత్వము లేదు. ఏదో రెండవ వస్తువు ఒకటి వున్నది అన్నప్పుడే మనకు భయమేర్పడుతుంది. రెండవది లేనే లేదు. అలాంటి స్థితియందే అభయము. ఏకత్వముతో కూడినది. "ఏక మేవ అద్వితీయం బ్రహ్మ". "Not two, only one" తనను తాను మరచినవానికే భయము. జగత్తును దృష్టి యందుంచుకున్న వానికే భయము, విషయా పేక్షకలిగిన వారికే భయము, పదార్థములతో భ్రమించేవారికే భయము. పరార్జములో మునిగిన వానికి యేమాత్రము భయము లేదు. ఇతనే అభయుడు. .
(శ్రీ.. గీ.పు. 258)
శ్రీ పుట్టపర్తి నిలయుడు
కాపాడును నిన్ను నెపుడు కరుణాకరుడై
చేపట్టి నిన్ను బ్రోచును
ఏపట్టున విడువకుండ ఏలును నిన్నున్
(ధన్యజీవులు పు 76)