ఆత్మతత్వాన్ని గుర్తింప చేయడానికై, అన్ని మతములందు మహనీయులు ఆశరీరవాణిని శ్రవణము చేస్తూ వచ్చారు. ఏ విధముగా వేదముల నాదమును సారస్వతుడు విని సర్వులకు బోధించాడో అదే విధముగ ఇస్లాము మతములో కూడా హజరత్ మహమ్మద్ పదునాలుగు వందల సంవత్సరములకు పూర్వము ఈ వాణిని ఖుర్ ఆన్’ రూపములో పొందుపరచాడు. దీనిని "ఖురాన్" అని అంటారు. కాని దీని సరియైన స్వరూపము "ఖుర్ ఆన్’ రూపములో పొందుపరచాడు. ఇందులోని రెండు పదములు సలాత్, జకాత్ లను, రెండు నేత్రములుగా హజరత్ మహమ్మద్ నిరూపించాడు. సలాత్ అనగా ప్రార్థన, జకాత్ అనగా దానధర్మములు. దానము, ధర్మము, స్మరణ, ప్రార్థన. వీటిని ఆచరించే సమాజ ధర్మమునకు "ఇస్లామ్" అని పేరు పెట్టారు. ఇస్లామ్ అనేది కేవలము ఒక మతమునకు మాత్రము సంబంధించినది కాదు. దీనికి అరబీ భాషలో శరణు. శాంతి అని అర్థము, ఎవరు భగవంతునకు శరణాగతులై నిరంతర శాంతితో తోటి మానవులతో జీవించడానికి పూనుకుంటారో అట్టి సమాజమే ఇస్లామ్. ఏకత్వములోని అనేకత్వాన్ని విస్మరించి, దివ్యత్వమైన దైవత్వాన్ని స్మరించే సమాజము ఇస్లామ్.
(స.సా.ఆ. పు. 186)
(చూ|| ఉపవాసం)