పిల్లలు అల్లరి చేసి స్వామిని బాధపెట్టడంచేత స్వామికి వారిపై విసుగు పుట్టి మాట్లాడటం లేదని నిన్న ఒక దినపత్రికలో వార్త వచ్చింది. ఇలాంటి న్యూసెన్సు" వార్తలవల్ల అసలైన న్యూస్" మరుగున పడిపోతున్నది. నేను మొట్ట మొదట చెప్పాను. నాకు గొంతు సరిగా లేదు. రెండు, మూడు దినములు మీరే మాట్లాడండి, తరువాత నేను మాట్లాడతాను" అని దీని పైన స్వామికి పిల్లల పైన కోపం వచ్చిందని పెద్ద పుకారు పుట్టింది. దీనినిఅమెరికాలో గోల్డ్ స్టేన్ ఇంటర్నెట్ లో చూసి, చాల బాధ పడి రాత్రి ఫోను చేశాడు. ఈ విధమైన చెడ్డ వ్రాతలను మీరు నమ్మకూడదు. నన్ను ఎవ్వరూ బాధపెట్టలేదు. పిల్లలందరూ మంచి పిల్లలే. సత్యాన్ని తెలుసుకోకుండాఆసత్యాన్ని ప్రచారం చేసి పవిత్రమైన హృదయాలకు బాధ కలిగించకూడదు. మందిరం యొక్క వరండాలో కూర్చునే కొంత మంది పెద్దలు కూడా ఇంటర్‌నెట్లో లేనిపోని విషయాలను చేర్చుకున్నారు. మరి కొంతమంది స్వామి మాకు కోర్కెల రూమ్ లో ఈ విధంగా చెప్పాడు. ఆవిధంగా చెప్పాడు. అని ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటివారిని ఇక మీదట నేను కోర్కెల రూమ్ కు పిలవను. మంచి వారు మౌనంగా ఉంటారు. వారి మాటలు, వీరి మాటలు మీకెందుకు? మీరు వచ్చింది. దీనికోసమా! అనవసరమైన మాటలవల్ల ప్రమాదాలు జరుగుతాయి; కాలం వ్యర్థమౌతుంది. మౌనం పాటించినప్పుడే మీకు పవిత్రత చేకూరుతుంది. ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ" ఎంతో అభివృద్ధి చెందాయి. కాని, సైన్స్ అభివృద్ధి అయ్యే కొలది. సెన్సెస్ (ఇంద్రియాలు) దిగజారిపోతున్నవి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిందో అజ్ఞానం కూడా అంత పెరిగిపోయింది. అందుచేతనే ప్రపంచానికి ఇన్ని విధములైన కష్టములు నష్టములు సంభవిస్తున్నాయి. ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్ నాలజీ అనే చెప్పవచ్చును. స్వామిని పొందాలంటే ప్రేమ తప్ప మరో మార్గం లేదు.
ఈ పిల్లలారా! మనకు ఇంటర్నెట్ ఏమీ సంబంధం లేదు. దానితో మనం సంబంధమే పెట్టుకోకుండా ఉండాలి. దుర్భావములకు, దుశ్చింతలకు చోటివ్వకండి. ఇవన్నీ పట్టణాల నుండి వచ్చే జబ్బులు". ఇవి పల్లెలకు ప్రాకి పల్లెల్లోని వాతావరణాన్ని కూడా పాడుచేస్తున్నవి. పట్టణపు జబ్బుల ను పల్లెల్లో ప్రవేశ పెట్టకండి. పల్లెలయందు పవిత్రమైన ప్రేమ, దివ్యమైన శాంతి ఉంటున్నవి. అట్టి ప్రేమను శాంతిని అభివృద్ధి పర్చుకున్నప్పుడే మీ జీవితం ఆనందమయం అవుతుంది. పిచ్చిపిచ్చి మాటలకు అవకాశం ఇవ్వకండి. ఈనాడు అనేకమంది పెద్దవారుఏమీ తెలియని అమాయకులైన పిల్లల హృదయాలను పాడు చేస్తున్నారు. పెద్దవారైనా సరే పిచ్చి పిచ్చి మాటలకు అవకాశం ఇవ్వకండి. పెద్దవారైనా సరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అయ్యా! ఈ చిల్లర బుద్ధులు మీకెందుకు? అని వారికి బుద్ధి చెప్పండి. పెద్దలు తమ స్థాయికి తగినట్లు ప్రవర్తించాలి. వయస్సులోనే కాక ప్రవర్తనలో కూడా పెద్దలేనని నిరూపించుకోవాలి. ఇంటర్‌నెట్ తో నాకు ఎట్టి సంబంధమూ లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉండదు. నాకు మీతోనే సంబంధము, ఆది హృదయ సంబంధము.
(స. సా.మా.2000పు. 73/74)