విద్యార్థులారా! మీరు ఇక్కడ ఉన్నంత కాలము అన్ని విధములుగా మంచిగా ప్రశాంతంగా జీవించి, మీ గృహములకు తిరిగి వెళ్ళిన తక్షణమే టీవీలను, వీడియోలను తెచ్చి పెట్టుకుంటారు. అవి మీ హృదయాన్ని ఎంతగా మాలిన్యపరుస్తున్నాయో మీరు గుర్తించుకోవడం లేదు. ముఖ్యంగా ఈనాటి మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నవి టీవీలు, వీడియోలే! విద్యకు సంబంధించిన విషయాలను, నీతికి సంబంధించిన విషయాలను చూడండి, తప్పులేదు. అంతేగాని, అపవిత్రమైన దృశ్యాలను చూడకండి. నేడు టీవీలవల్ల వచ్చే రోగాలు నివారణ కాని రోగాలుగా ఉంటున్నాయి. టీవీ అనేది టిబి.గా తయారౌతున్నది. మీయందు పవిత్రమైన భావాలు లేనప్పుడు రోగాలు రాక మరేమి వస్తాయి?! మీకు ఏ పని లేకపోతే బయటకు వెళ్ళి కొంత సేపు వాకింగ్, చేయండి. లేకపోతే, మీ తల్లికి ఇంటి పనిలో సహాయం చేయండి. అంతేగాని, ఊరికే టీవీ వేసుకుని కూర్చోకండి.
(స.సా.జ 2000 పు.20)||
ఈ టీవీలు ఏనాడైతే ప్రారంభమైనవో ఆనాడే మానవుని మనస్సు మాలిన్యమైపోయింది. మీరు చక్కగా యోచించండి. టీవీలు రాక పూర్వము మానవుని మనో దౌర్బల్యము, ఇంతగా ఉండేది కాదు. ఇవి ప్రారంభించక మునుపు ఇటువంటి దుశ్చర్యలు కనివిని ఎరుగము. కొందరు డైనింగ్ హాలులో టీవీలు పెట్టుకొని భోజనం చేసే సమయంలో వాటిని చూస్తున్నారు. వారు భుజించేది టీవీలో వచ్చే మాలిన్యమునే గాని, ఆహారమును కాదు. ఆ దృష్టిచేతనే సృష్టికూడా మారిపోతున్నది. ఎలాంటి దృశ్యములను, ఎలాంటి చర్యలను మీరు చూస్తున్నారో అవే మీలో ప్రవేశిస్తున్నాయి. కనుక మీలో తెలియకుండానే ఆవేదనలు, ఆవేశములు అనేకము అభివృద్ధి అవుతున్నాయి. అది మీకు తెలియదు. "నేను ఏనాడూ చింతించని భావాలు నాకు ఎందుకు రావాలి" అని మీరు విచారిస్తారు. కాని, టీవీలో చేసే దుశ్చర్యలు బీజరూపంలో మీ హృదయంలో నిలిచిపోతాయి. అవన్నీ సమయాన్ని పురస్కరించుకొని మొక్కలుగా వచ్చి మీలో దుర్భావాలను అభివృద్ధి చేస్తాయి. అంతేకాదు, మీరు భుజించే సమయంలో భయంకర విషయాలను గూర్చి మాట్లాడకూడదు, వాదోప వాదములు చేయకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి. ఈ మాటల తరంగములు మన హృదయంలో ప్రవేశిస్తాయి. ఎలాంటి తరంగములు ప్రవేశిస్తాయో అలాంటి ఊహలే మీలో ఆవిర్భవిస్తాయి. ఈనాడు స్టార్ టీవీలు వచ్చి మనిషిని పూర్తిగా మసి చేస్తున్నాయి. మాణిక్యము వంటి మానవ జీవితాన్ని మసి బొగ్గులకు అమ్ముకుంటున్నారు. ఇది మీకు మానసిక ప్రశాంతి నందిస్తుందని భావించి, చూసి ఆనందిస్తున్నారు. కాని, తదుపరి ఇది మీలో ప్రవేశించి ఎన్ని విధములుగా తిప్పులు పెడుతుందో మీకు తెలియదు. ఇది తేనె పూసిన కత్తి వంటిది. ఇందులో కనిపించే దృశ్యములన్నీ యువతీ యువకులలో ప్రవేశించడం చేత ఈనాడు భారత దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటున్నది. ఆవేశమయంగా ఉంటున్నది. ఉద్రేక మయంగా ఉంటున్నది. ఉత్సాహము ఎక్కడా కనిపించడంలేదు. మానవుడు ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. కాని, అది ఉత్సాహం కాదు. కేవలం సినిమా నవ్వు ! ఈనాడు బాధలు లేని మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
(శ్రీ భ. ఉ.పు.189/190)
(చూ||సాంఖ్య దర్శనము)