ఆధ్యాత్మికంలో కూడ కొన్ని విషయములు Subjects ఉన్నాయి. ప్రత్యేకమైన గ్రూపులున్నాయి. అవి డకార పంచకములు: ఇందులో మొట్ట మొదటిది ప్రపత్తి అనగా Dedication. రెండోది భక్తి Devotion. మూడోది నియమము Discipline. నాలుగోది విచారణా శక్తి Discrimination. ఐదోది పట్టుదల Determination. ఇవియే డకార పంచకములు. ఈ ఐదింటిని గ్రూపుగా తీసుకొని ఉత్తీర్ణులైన వారికి భగవత్ ప్రేమ పొందే అధికారముంటుంది.
మొదటిది Dedication ప్రపత్తి - సమర్పణము. స్వామి ఇక్కడకు రావడంతోటే ప్రతి అధ్యాపకుడు ప్రతి విద్యార్థి పుష్పాన్ని అర్పించి నమస్కరిస్తున్నాడు. పుష్ప మనగా హృదయ పుష్పము. ఈ పుష్పం మీద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే పురుగు లేవీ ఉండకూడదు. పురుగులున్న పుష్పమును భగవంతునికి అర్పించము. దానిని తీసి పరిశుభ్రము చేసి ఆ తర్వాత భగవంతునికైనా పెద్దలకైనా అర్పిస్తాము. పుష్పముల మీద ప్రధానమైన మాలిన్యములు, పురుగులు రెండు ఉంటాయి. ఇవి పుష్పముల మీద వ్రాలిన తుమ్మెదలను దురవస్థల పాలు చేస్తాయి. మొదటిది అహంకారము. రెండోది అసూయ. ఆహంకారము ఎనిమిది విధములుగా ఉంటుంది. ధన ఆహంకారము, బల అహంకారము, కుల అహంకారము, విద్యా అహంకారము, సౌందర్య ఆహంకారము. రాజ్య అహంకారము, తపో అహంకారము. అనేక విధములైన అహంకారములలో ఈ ఎనిమిది ప్రధానమైనవి. ఇందులో ధన విద్యా అహంకారములు నీచమైనవి. ఆహంకారమనే అడ్డు గోడ ఉన్నంత వరకు భగవత్తత్వాన్ని గానీ, ఆత్మతత్వాన్ని గానీ గుర్తించడం సాధ్యం కాదు. కనుక జీవునికి దేవునికీ మధ్య నున్న ఈ అహంకారమనే అడ్డు గోడను మనము తీసి వేయాలి.
కలిమి కలిగిన నాదు కైలాసపతినైన
లెక్కచేయక పాపి తిరుగుచుండు
కలిమి తీరగానే కనిపించు దైవంబు
….. …….. ……. ….. ……. …….
కలిమి ఎంత కాలముంటుంది? ఈ ధన అహంకారం వల్లనే మానవుడు దీనావస్థకు చేరుకొంటున్నాడు. కనుక మొట్ట మొదట ఈ అహంకారాన్ని భగవంతునికి అర్పించాలి.
ధన బల యవ్వన సౌందర్య కుల తపో అహంకారమేదీ కూడా ఉండరాదు. అహంకారాన్ని మనమేనాడు భగవంతునికి అర్పిస్తామో ఆనాడే ఆత్మ స్వరూపులముగా రూపొందుతాము. ప్రపత్తి dedication లో మొట్టమొదట చేయవలసినది అహంకార సమర్పణమే. రెండోది Devotion భక్తి. ఇది పవిత్రమైన ప్రేమకు సంబంధించినది. ‘’హృషీకేశ సేవనం భక్తిరుచ్చతే" అన్నారు. భక్తి అనగా నిరంతరం భగవంతుని తలంపుతో ఉండడం. భజ్ అనే ధాతువు నుండి పుట్టినది భక్తి. అనగా ప్రేమతో భగవంతుని తలచుకోవడం, స్మరించడం, భజించడం, తపించడం భక్తి. ఈ భక్తిలో సేవ అతి ప్రధానమైనది. ఈ సేవ వల్ల లభించే ఫలితము ఇట్టిది. అట్టిది అని నిర్ణయించడానికి వీలులేదు. తులసీదాసు ఒకానొకప్పుడు త్రివేణి సంగమంలో భగవచ్చింతన సలుపుతున్నాడు. రామ లక్ష్మణులు ఇరువురూ చిన్న పిల్లల రూపం ధరించి "కాకాజీ క్యా కర్తేతే హైఁ" కాకాజీ ఏం చేస్తున్నారు అన్నారు. తులసీదాసు "బేటా! రామ్ కా సేవాకరతాహూ" నాయనా! రాముని సేవ చేస్తున్నానన్నాడు. సేవాసే క్యా ప్రయోజన్? సేవవల్ల ఏం లాభం? అని అడిగారు. సేవాసే మేవా మిల్తా హై. సేవవల్ల ఫలం దొరుకుతుంది: అన్నాడు తులసీదాసు, మేవా మిల్తా హైతో క్యా ప్రయోజన్? ఏకోహ్ దఫాజీర్ణ హోజాయేగా: ఫలం దొరికితే ఏం లాభం. ఒకేసారి జీర్ణమై పోతుందిగా అన్నారు పిల్లలు. అప్పుడు చెప్పాడు తులసీదాసు. ప్రాకృతమైన ఫలం తాత్కాలిక మాధుర్యాన్నే ఇస్తుంది. క్షణకాలంలో జీర్ణమైపోతుంది.
భగవంతుడిచ్చే ఫలం ప్రేమ ఫలం. అది జీర్ణమయ్యేది కాదు. అది తింటే ఆకలే కాదు. సేవవల్ల ఆ ప్రేమ ఫలం దొరుకుతుంది. ఆ ప్రేమ ఫలమే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. అంత:కరణమనే ప్రమిదలో భక్తి అనే తైలాన్ని పోసి ప్రజ్ఞ అనే వత్తిని నిలిపి విచారణ అనే నిప్పును ఆంటించినప్పుడు ప్రకాశవంతమైన ఆత్మజ్ఞానము వెలుగుతుంది. భక్తి అనగా కేవలం భజనలు పూజలు చేయడం మాత్రమే కాదు. ఈనాడు మన భక్తి పూజలు భజనలు స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉంటున్నాయి. నిస్వార్థంతో కూడినదే భక్తి, పైకి చూడటానికి అందరూ భక్తులవలెనే కనిపిస్తారు. చాలా వినయ విధేయతలతో ప్రవర్తిస్తారు. కాని హృదయం చూస్తే అందుకు విరుద్ధంగా ఉంటుంది. మార్కులు చూస్తే ర్యాంకు. ప్రవర్తన చూస్తే బ్లాంకు: ఆచారం చూస్తే భక్తిగా కనపడుతుంది. కాని హృదయంలో తలంపులను చూస్తే మహా అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి తత్వాన్ని మనము అలవరచుకోరాదు. లోపల వెలుపల ఒకే భావం. ఒకే విధమైన ప్రేమ తత్వం ఉండాలి. భక్తి ప్రకటితం చేసేదీ, ప్రదర్శించేదీ కాదు ప్రదర్శించే భక్తి ప్రమాదానికి గురి చేస్తుంది. కనుక మనమీ ప్రమాదానికి గురికాకుండా లోపల వెలుపల ఒకే విధమైన భావాన్ని కలిగి ఉండాలి. ఇదే నిజమైన భక్తి.
మూడోది నియమం Discipline. ఇది చాల అవసరం. తెల్లవారి లేచిన తక్షణమే కాల కృత్యములు తీర్చుకొని భగవంతుని స్మరించి తదుపరి ఏవో నిత్య విధి కర్మలు ప్రతి నిత్యం ఆచరిస్తూ వీటిలో ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా ఒక నియమాన్ని పాటించాలి. ఒక్కొక్కనాడు ఒక్కొక్క మార్పు చేసుకోరాదు. ఈనాడు ఒకగంటకు లేవడం రేపు మరొక గంటకు లేవడం, ఈనాడొక పనిచేయడం. రేపు మరొక పని చేయడం ఈ విధమైన మార్పులు ఉండకూడదు. నియమాన్ని సక్రమంగా అనుసరించాలి. లేచిన తక్షణమే కాలకృత్యములు ముగించుకొని ప్రశాంత వాతావరణంలో కొన్ని నిముషములైనా హృదయ పూర్వకంగా ప్రేమలో పరమాత్ముని స్మరించాలి. మానవత్వం నియమ నిష్ఠల పైన ఆధారపడి ఉన్నది. నిత్య జీవితంలో ఈ వియమాన్ని కఠినంగా పాటించాలి.
తరువాత విచారణా శక్తి Discrimination. ప్రపపంచం మంచి చెడ్డలతో కూడి ఉంటుంది. సుఖ దు:ఖములతో కూడి ఉంటుంది. జయాపజయాలతో కూడి ఉంటుంది. ఈ రెండింటితో కూడిన ప్రకృతి యందు ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయదగినది, ఏది చేయదగనది అని మనం విచారణ చేయాలి. ఈ విచారణా శక్తిలేని మానవుడు పశువనే చెప్పవచ్చు. మనము మనసును ఆధారం చేసుకోరాదు. మనసును అనుసరించరాదు. బుద్ధిని అనుసరించాలి. మనసును అనుసరించినంత కాలం మాధవులము కాలేము. ఏనాడు బుద్దినుససరిస్తామో ఆనాడే మానవత్వం నుండి దివ్యత్వానికి చేరుకోగలము. మనసు నాధారము చేసుకున్న మానవుడు పశువుగా మారుతాడు. బుద్ధి నాధారం చేసుకున్న బుధజనుడు పశుపతిగ మారుతాడు.
ఈ లేత వయస్సులో ఉన్న విద్యార్థులు మనస్సును మాత్రమే అనుసరిస్తారు. బుద్ధి వరకు ప్రయాణం చెయ్యరు. కనుకనే అనేక విధములైన కష్టములకు అశాంతులకు అసంతృప్తులకు నిరాశా నిస్పృహలకు గురి అవుతుంటారు. కనుకనే బుద్ధి ద్వారా విచారణ సలుపాలి. నేను మానవుడను. విద్యార్థిని విద్యావంతుడను. ఈ స్థాయిలో ఉన్న నేను ఏ విధంగా చేస్తే గౌరవంగా ఉంటుంది. అని విచారణ చేయాలి. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. ఎక్కడికి ఎప్పుడు పోవాలా వద్దా అలోచించుకోవాలి. విద్యావంతుడై ఆవిద్యావంతునివలె ప్రవర్తించడం విరుద్ధ మార్గం. విద్యకు తగిన మార్గాన్ని అనుసరించాలి. విద్యకు వినయమే శోభ. వినయం లేకుండాపోతే విద్య కేమాత్రం కళాకాంతి ఉండదు. ఈ విచక్షణ భక్తునికి అత్యవసరము.
Determination అనేది పట్టుదల. ఈ పట్టుదల పగ్గము వంటిది. తలచిన దానిని సందేహానికి అవకాశ మివ్వక పట్టుదలతో సాధించడానికి ప్రయత్నించాలి. సాధించ దలచినది సాధిస్తానో లేదో అనే సంశయానికి స్థానమివ్వరాదు. పట్టుదల గట్టిగా ఉంటే మీరు సాధించలేనిది జగత్తులో ఒక్కటే ఉండదు. మొట్టమొదటిది ప్రపత్తి Devotion చిట్ట చివరిది పట్టుదల Determination. కేవలము తెలివితేటల పైన, మేథాశక్తి పైన మాత్రమే ఆధార పడరాదు. సర్వమునకు దైవమే ఆధారమన్న తత్వాన్ని గుర్తించాలి. అప్పుడే భక్తితత్వాన్ని చక్కగా గ్రహించగలము.
(స.పా. ఫి. 1988పు. 51/53)