వాల్మీకి రామాయణమున, రాముడు కేవలము లోకనాటక నిమిత్తమై, తాను ఒక అవతారముగా నరరూపము ధరించి, లోకమునకు ఆదర్శమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తూ, అందిస్తూ, ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడక్కడ, తనయొక్క దైవత్వాన్ని కూడను తాను ఏమాత్రము మరుగుపర్చలేదు. ఒకచిన్న ఉదాహరణము: రాముడు పట్టాభి షేకమునకు రథమును ఎక్కి, పురవీధులయందు ఉత్సవములో తరలివెళ్తుండే శుభ సమయములో ఏవిధమైన ఆనందాన్ని జనులకు ప్రకటించాడో, అదే ఆనందమును, వనవాస విషయము తెలిసినపుడునూ ప్రకటించినాడు. మరియు, వనవాసమునకు వెళ్లే సమయములో తన తల్లిని దర్శించే నిమిత్తమై తాను తల్లి భవనమునకు వెళ్లినపుడు కూడను, అదే ఆనందాన్ని ప్రకటించి, సమత్వాన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ సమత్వాన్ని వాల్మీకి చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. అక్కడ దైవత్వాన్ని కూడను నిరూపిస్తూ వచ్చాడు. మరియు, తల్లి భవనమునుండి, సీత భవనమునకు వచ్చే సమయము లోపల, సీతను చూచిన తక్షణమే తాను మానవత్వములో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని తిరిగి ప్రకటించాడు. తమకు సన్నిహితు లైనటువంటివారిని చూచినపుడు, తమకు ఆప్యాయులైన వారి దగ్గరికి వెళ్లినపుడు తమలో ఉన్నటువంటి దుఃఖముకాని, విచారముకాని వెలిపర్చడము మానవుల యొక్క సహజలక్షణము, కనుక ఇక్కడ మానవత్వాన్ని తిరిగి ప్రకటించాడు. తనకు సన్నిహితులు, ఆప్తులు అయినటువంటి వారి దగ్గర ఇలాంటి ప్రకటన చేయకుండుట, ఆది నిజముగా మానవత్వమునకు సరియైనటువంటి లక్షణము కాదని కూడను నిరూపిస్తూ వచ్చాడు.
(ఆ.రాపు 3/4)