లోకంలో ఎట్టి సిరిసంపదలు లేకపోయినప్పటికీ తల్లి యొక్క అనుగ్రహ ధనాన్ని సంపాదిస్తే చాలు. తల్లి అనుగ్రహాన్ని పొందినవాడే ధన్యుడు. పూర్వం బెంగాల్ లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు. వారిది చాల బీద కుటుంబము. తన తల్లి పాతబడిన చీరలు కట్టుకోవడం చూసి చాల బాధ పడేవాడు. అతడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఒక చిన్న ఉద్యోగంలో చేరిన తరువాత ఒకనాడు తల్లిదగ్గర కూర్చుని, "అమ్మా! నా వద్ద కొంత ధనమున్నది. నీకేమి కావాలో చెప్పు" అన్నాడు. “నాయనా! నాకు ఏ ఆశలూ లేవు. నీవు మంచి గుణవంతుడివైతే నాకంతే చాలు" అన్నది. ఇంకా కొంత కాలమైన తరువాత అతడు గొప్ప ఉద్యోగంలో చేరాడు,జీతం పెరిగింది. అప్పుడు మళ్ళీ తల్లివద్దకు వచ్చి "అమ్మా! ఇప్పుడు నావద్ద కావలసినంత ధనమున్నది. నీకేమైనా కోరికలుంటే చెప్పు" అన్నాడు. అప్పుడామె, "నాయనా! నాకు మూడు కోరికలున్నాయి. అవి తీరినప్పుడే నాకు శాంతి కలుగుతుంది. మొదటిది -మన గ్రామంలో చాలమంది బీద పిల్లలు చదువు సంధ్యలు లేక కాలమును వ్యర్థం చేస్తున్నారు. కాబట్టి, నీవు సంపాదించిన ధనంతో ఒక చిన్న స్కూలును కట్టించు" అన్నది. తల్లి కోరిక మేరకు అతడొక స్కూలును కట్టించాడు. "రెండవ కోరిక ఏమిటమ్మా?" అని అడిగాడు. “నాయనా ! ఈ పల్లెలో ఒక ఆసుపత్రి లేకపోవడంచేత ప్రజలు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా చాల అవస్థ పడుతున్నారు. కాబట్టి ఒక చిన్న ఆసుపత్రి కట్టించు" అన్నది. ఆసుపత్రిని కూడా కట్టించాడు. మరి కొంతకాలం పెరిగిన తరువాత, "అమ్మా! నీ మూడవ కోరిక ఏమిటి?" అని అడిగాడు. "నాయనా! ఈ గ్రామంలో త్రాగటానికి నీరు లేక ప్రజలు చాలా బాధ పడుచున్నారు. మురికి నీరు త్రాగి అనారోగ్యానికి గురి అవుతున్నారు. కనుక, ఒక బావిని త్రవ్వించి ప్రజలకు నీటిని అందించు" అన్నది. అతడు ఆ అభీష్టాన్ని కూడా నెరవేర్చాడు.
దినదినానికి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కీర్తి పెరుగుతూ వచ్చింది. అతడు ఎక్కడైనా ఉపన్యాస మిస్తున్నాడని తెలిస్తే ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగయ్యేవారు. అతడు నిత్య జీవితానికి అవసరమైన విషయాలనే మాట్లాడేవాడుగాని, కేవలం పుస్తక జ్ఞానాన్ని ప్రకటించేవాడు కాదు; చాల వినయ విధేయతలతో ప్రవర్తించేవాడు. ఒకనా డతడు ప్రక్క గ్రామంలో ఉపన్యాసమివ్వడానికని రైలులో ప్రయాణమైపోతున్నాడు. అతని ఉపన్యాసం వినాలని ఎవరో ఒక ఉన్నతాధికారి అదే రైలులో ప్రయాణమయ్యాడు. అతనివద్ద ఒక చిన్న పెట్టి ఉన్నది. ఆతను అంతకు పూర్వం ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ను చూసి ఉండలేదు. ఆతడు రైలు దిగిన తక్షణమే కూలీ, కూలీ అని అరవడం మొదలు పెట్టాడు. "ఎక్కడుంది మీ లగేజ?" అని అడిగాడు. అతడు తన చిన్న పెట్టెను చూపించాడు. దీనిని మోయడానికి మీకు కూలీ కావాలా? ఎందుకు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? నేను మోసుకొని వస్తాను. రండి" అన్నాడు. ఆ పెట్టెను విద్యాసాగర్ మోసుకొని వెళ్ళాడు. ఆ అధికారి "ఎంత కూలీ? " అని పర్సు తీశాడు. “నాకేమీ కూలీ అక్కర్లేదు, నేను ఇదొక సేవగా భావిస్తున్నాను. అది నాకు తృప్తి" అని విద్యాసాగర్ వెళ్ళిపోయాడు. సరే ఆ ఉన్నతాధికారి సభ జరుగుతున్న చోటికి వెళ్ళాడు. “ఇప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మాట్లాడుతారు " అని ప్రకటించబడింది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వేదిక నెక్కాడు. అతనిని ఆ ఉన్నతాధికారి చూసి ఆశ్చర్యపోయాడు. "ఇతనే కదా నా పెట్టెమోసుకు వచ్చింది. ఎంతటి వినయ విధేయతలు కల్గిన వ్యక్తిగా అనుకున్నాడు. తాను చేసిన పొరపాటుకు సిగ్గుతో తలదించుకున్నాడు.
(స. సా. జూన్ 99 పు.146/147 మరియుసా.శ్రు. పు.124/126)