"జ్ఞానసిద్ధి కేవలమూ అంత:కరణ సంబంధము. అది ఆలస్యముగా సిద్ధించును. అంత వోపిక మానవునియం దుండుటలేదు. స్థూల శరీరానికే ప్రాధాన్యత యిత్తురు సామాన్య మానవులు దాని సంబంధమునే బలపఱచుకొందురు కామ నాసక్తులగుటవలన వారు జ్ఞానసిద్ధిని ఆశించక కర్మసిద్ధిని ఆశింతురు. లోకమున విషయగ్రస్తులు యెక్కువగాని విచారగ్రస్తులు తక్కువ. విషయగ్రస్తులు నిరంతరమూ శరీరపుష్టిని మాత్రము, ప్రత్యక్ష గోచరమును మాత్రము ప్రమాణముగా పాటింతురు. ఆ చింతనయందే తత్పరులై యుందురు. విషయ గ్రస్తులు ఆత్మీక పుష్టిని ఆశించి నిరంతర సాక్షాత్కారప్రాప్తికై సర్వం బ్రహ్మతత్త్వమును ప్రదర్శించుటకై ప్రయత్నింతురు అందులోనే వారి కాలమును, కర్మను చేర్తురు. ఇది సక్రమమార్గము! కర్మోపాసన సక్రమ మార్గము కనుక సక్రమమార్గమయిన ధర్మ కర్మలనూ జ్ఞాన విచారణనూ సరియైన హద్దులలో ఇమిడ్చి, వాటిని నిలబెట్టి లోకమునకు వాటి యొక్క సత్యమును తెలుపుటే నా కర్తవ్యము.
(గీ. పు. 68/69)