ఐదు వేల సంవత్సరములకు పూర్వము ద్వాపరయుగ మధ్యమంలో ధనమదాంధులైన రాజులు మానవాకారం ధరించిన రాక్షసులవలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేకవిధములుగా హింసించసాగారు. వారి హింసలను భూదేవి భరించుకొనలేక భగవంతుని వద్దకు వెళ్ళి రక్షించమని ప్రార్థిస్తూ వచ్చింది. భగవంతుడు ఆమె శోకమును నివారించే నిమిత్తమై, దేవీ! నీవు వెళ్ళు, మిగిలినది నేను చూసుకుంటాను. ఇక నీకేమాత్రము భారమునివ్వను అని ధైర్యము చెప్పి వెనుకకు పంపాడు. తదుపరి దేవతలను పిలిపించి, “మీరందరూ భూలోకంలో యాదవులుగా జన్మించండి అని ఆదేశించాడు.
యదు అనేవాడు యయాతి ప్రథమ పుత్రుడు. ఈ యదు సంతతి వారే యాదవులు. ఈ యాదవులలో ముఖ్యుడు ఆహుకుడు. ఇతడు ధర్మపరాయణుడు, సత్యవ్రతుడు. ఇతనికి దేవకుడని, ఉగ్రసేనుడని యిరువురు కుమారులు. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. కంసునికి స్వంత సోదరీమణులు లేరు. కనుక, తన పినతండ్రి కుమార్తె దేవకిని తన స్వంత చెల్లెలుగా భావించి అత్యంత ప్రేమతో ఆదరిస్తూ వచ్చాడు. ఈ యాదవులందు శూరుడనే వ్యక్తి ఉండేవాడు. ఇతని కుమారుడే వసుదేవుడు. ఇతడు సామంతరాజు. ఆడిన మాట తప్పేవాడు కాదు. ఇతనికే దేవకీదేవినిచ్చి వివాహము గావించాలని ఉగ్రసేనుడు, కంసుడు యిరువురూ నిర్ణయించుకున్నారు. ఐతే, వసుదేవునికి మొదట రోహిణి అనే భార్య ఉండేది. కాని, అతనికి బిడ్డలు లేకపోవుటచేత మరల వివాహమాడాడు. (దివ్య జ్ఞాన దీపికలు ద్వితీయ భాగం పు 4-5)