రజోగుణము కలిగినవాడు అన్నిటియందు తొందరపాటు పడుతుంటాడు. ఇతనికి కోపము కూడను జాస్తి. ఇంతియే కాకుండా వాంఛలను అధికముగా పెంచుకుంటుంటాడు. ఒక్కక్షణమైనా స్థిరముగా వుండడు. ఇవి రజోగుణములు. మీరు యెక్కడైనా జూకు పోయి చూసినారంటే అక్కడ చిరుతపులి, నక్క యిలాంటివాటిని చూస్తే మీకు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటోయిటో, అటోయిటో తిరుగుతూ వుంటాయి. కాని, నిలకడగా వుండే స్వభావము కాదు వాటిది. ఇది రజోగుణ స్వభావము. మానవుని హృదయమందు రజోగుణము ప్రవేశించెనా అది నిరంతరము చలింప చేస్తుంటాది. చలింపచేయటమే కాదు, భ్రమింప చేస్తుంటాది. భ్రమింపచేయటమే కాదు, జగత్తును వరింపచేస్తూ వుంటాది. జగత్తును వరించటము, ఆశలను రగల్చటము, దేహమును జయించటము యీ మూడు గుణములు రజోగుణమునకు ప్రధానమైన లక్షణములు. మనము ఒకచోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము. ఎప్పుడు చూసినా యేదో ఒకటి కదలుతూనే వుంటుంటాది.
(శ్రీ.గీ.పు.264/265)
విచారణ శక్తి హీనుడై, రాగద్వేషములకు గురియై తనయొక్క ఇచ్చానుసారముగా సంచరించడము రజోగుణము. తొందరపాటు లక్షణము. ఈ తొందరపాటు లోపల మన మనేకవిధములైనటువంటి నష్ట కష్టములకు గురికాగలము.
(స.సా. జూ, 1989 పు. 144)
(చూ॥ అవతారము, గుణములు, జగదీశుడు, తత్త్వజ్ఞానము, వష్టతత్త్వము, శబ్దస్పర్శరూపరసగంధములు, స్త్రీతత్వము)