చక్కగా విచారించగా, కల్పవృక్షమమనది ఒక వృక్షమని కానీ, కామధేనువనునది ఒక గోవుకాని, చింతామణి అనునది ఒక మణి కాని కాదు. ఇవి తపస్సు యొక్క ప్రభావములు. యోగి నిర్వికల్ప స్థితిని పొందినప్పుడు కామములను సకల సిద్దులు నొసగును. దానిని కల్పవృక్ష రూపసిద్ధి అనియు, ఎప్పుడు జితకాముడగునో అప్పుడు కామధేనుసిద్ధి అనియూ, పిలువబడుచున్నది. బహు దుఃఖముల దూరము చేయునట్టి నిశ్చింతభావమే, చింతామణి యనబడును. ఎప్పుడు చింతలుడిగి పరమానందము కలుగుచున్నదో, అప్పుడే చింతామణి సిద్ధించును. ఇవి మనో వాక్కాయములను మూడు విధములుగా వున్నవి.
(శ్రీ.స.సూ, పు. 243/244)