ప్రపంచమందలి సర్వ పదార్ధములూ రెండు భాగములుగా నున్నవి. అవియే రూప నామములు. ఈ రూపనామములను తీసివేసిన ప్రపంచమే లేదు. రూపమును స్వాధీనము చేసుకొన్నది నామము, నామమును ఆశ్రయించి యున్నది రూపము. ఇందులో ఏది నిత్యము, యేది అనిత్యము అని యోచించిన, నామము నిత్యము, రూపము అనిత్యము. లోకమున యెన్నియో సత్కార్యములను చేసి కొన్ని ఘన కార్యములను సాధించి యుండవచ్చును. కొన్నివైద్యశాలలో, కొన్ని విద్యా సౌ కర్యములో, భగవన్మందిరాలో అనేక ప్రజా ప్రధాన సదుపాయములో చేసియుండ వచ్చును. కానీ వారు నేడు స్వరూపకముగా లోకములో లేనప్పటికిని వారు చేసి సాధించిన కార్యములు కర్మలు లోకమున నేటికినీ నిలచియున్నవి కదా! రూపము కొంత కాలముండి పోయిననూ, నామము మరికొంత యెక్కువ కాలము నిలచియుండును. నామములు అసంఖ్యాకము లయినప్పుడు స్వరూపములు అసంఖ్యాకములయి యుండును. అయితే యిచ్చట మనకు నిత్యానుభవము నందు పండితుని మొదలు పామరుని వరకూ సులభముగా అర్థమయ్యే అక్షరములను విచారింతము. తెలుగునందు చూచినయెడల యేబది రెండు అక్షరములు, ఆంగ్లము నందు చూచిన ఇరువదియారు అక్షరములు. లోకంలో గొప్ప గొప్ప సాహిత్యములన్నింటిని కొండలు కొండలుగా కుప్పలు వేసిననూ, ఈ తెలుగునందు గల యేబది రెండు అక్షరములే తప్ప మరేమీ యెక్కువ ఉండవు. ఆంగ్లమును చూచిన ఇరువది ఆరు అక్షరములు తప్ప క్రొత్తవేవీ అందులో లేవు. రావు.
(గీ.పు. 104/105)