ధనం పునాదిగా జీవితాలను నిర్మించుకొంటున్నవారు ఇసుకలో యిల్లు కట్టినట్లే. ధర్మం పువాదిగా కట్టుకొనేవారు రాతిపై యిల్లు కట్టుకుంటునట్లు. మీరంతా యిళ్ళు కట్టుకోవాలి. అందులో ఆత్మారాముని ప్రతిష్టించుకోవాలి. ఇదేనా కోరిక. ఐతే నేననుకునే యిళ్ళు యిటుక సున్నం, సిమెంటుతో కట్టేవి కావు. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు, మంచి సాంగత్యం వీటితో నిర్మించుకొనే గృహాలు. అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంటుంది. అలాటి యిళ్ళు మీరు కట్టండి! అందులో గృహ ప్రవేశానికి నన్ను ఆహ్వానించండి! నేను తప్పకవస్తా. నిజానికి ఆ యిల్లు నాదే! అక్కడకు రావటానికి నాకు ఆహ్వానం కూడా ఎందుకు? మీరనుకొనే యిల్లు ప్రాపంచిక సుఖాల కోసం. నేను చెప్పే యిల్లు ఆధ్యాత్మిక ఆనందం కోసం! నా నివాసం ఎప్పుడూ ముముక్షువుల పవిత్ర హృదయాలలోనే!
(శ్రీ ప. గీ. పు. 172)