ద్వాపరయుగంలో గోపి గోపాలుడు శ్రీకృష్ణుని తమ ఆరాధ్య దైవంగా విశ్వసించి, అతని సన్నిధియే తమకొక పెన్నిధిగా భావించి అనేక విధాలుగా ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈ పవిత్రమైన సంక్రాంతికి తగిన అంతరార్థమును కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు.
వారు మూడు పేడ ముద్దలను ఒక చోట పెట్టి, వాటిపై మూడు గుమ్మడి పువ్వులను ఉంచి, వాటి చుట్టూ అనేక విధములుగా ఆడుతూ, పాడుతూ శ్రీకృష్ణుని ప్రార్థించేవారు. మనం పేడ ముద్దను చాలా హీనమైనదిగా భావిస్తున్నాము. కాని, గోపికలు దీనిని చాలా పవిత్రమైనదిగా భావించారు. కొందరు తమ ఇంటి ముందు పేడ నీరును చల్లుతుంటారు. కొన్ని విషక్రిములు ఈ పేడనీటి వలన మరణిస్తాయి. అంతేగాక, మనం పీల్చే గాలిలోని క్రిములను కూడా ఇది నాశనం గావించి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. కనుక, గోపికలు ఈ పేడను ఆరోగ్యానికి, ఆనందానికి ప్రధానమైన చిహ్నంగా భావించారు.
గోపికలు మూడు పేడ ముద్దలను పెట్టడంలో గల అంతరార్థం ఏమిటి? అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేవాడు శ్రీకృష్ణుడు. అట్టి శ్రీకృష్ణునికి ఒక ముద్ద. ఇతడు తన శక్తి సామర్థ్యాలను జగత్ వ్యాప్తి గావించడానికి - "గోవర్ధనగిరి నెత్తి “నేను మానవుడను కాదు. మాధవుడను" అనే సత్యాన్ని నిరూపించాడు. కనుక, ఆ గోవర్ధన గిరికి ఒక ముద్ద. ఇంక, మనకు నిత్యజీవితంలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని చేకూర్చేవి గోవులు. .
ఈ గోవులు మానవునికి పుష్టిని, సంతుష్టిని చేకూర్చుతున్నవి. కనుక, గోవులకు ఒక ముద్ద. ఈ విధంగా, గోపాలుడు-గోవర్ధనగిరి-గోవులు - ఈ మూడింటి యొక్క గుకారతత్వాన్ని గోపికలు తమ ఆరాధ్య దైవంగా విశ్వసించారు. కనుక, గోపికలు అనే పేరు ఆధారంగా ఈ పెడ ముద్దలకు "గొబ్బిళ్ళు" అనే పేరు వచ్చింది.
(స.సా.ఫిమా. 92 పు. 33)