కావేరి నదికి అతి సమీపంలో కూపం అనే గ్రామము ఉండేది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతడు తెల్లవారినది మొదలుకొని రాత్రి పరుండునంతవరకు "రాం, రాం" అని రామనామాన్ని స్మరిస్తూ వస్త్రములను నేసి, ఆ వస్త్రములను బజారులో పెట్టి అమ్మి, తద్వారా వచ్చిన ధనంతో కుటుంబమును పోషించుకునేవాడు. ఒకనాడు ఎవరూ అతనివద్ద వస్త్రమును కొనటానికి రాలేదు. సాయంకాలమైనది. ఆ గ్రామంలోనే ఒక శ్రీమంతుని కుమారుడుండెడివాడు. వాడు చదువుసంధ్యలు లేక ఎప్పుడూ బజార్ల వెంట తిరుగుతూ ఉండేవాడు: చాల తుంటరి మనిషి, పోకిరీ మనిషి, ప్రతి ఒక్కరినీ బాధించేవాడు. ఈ శ్రీమంతునికి ఎంతో మంది ఫిర్యాదు చేశారు. కానీ, ఆతడు ఆ పిల్లవానిని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆనాడు సాయం కాలమయ్యేటప్పటికి ఆ పిల్లవాడు ఈ వ్యాపారస్థుని దగ్గరకు వచ్చి "అయ్యా! ఏమిటి ఈ బట్ట ? అని అడిగాడు. "నాయనా! ఇది ఒక చీర" అన్నాడు. దీని వెలయెంత?" అని అడిగాడు. "పది రూపాయలు నాయనా!" అని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చీరను సగానికి చించి "ఇది ఎంత?" అని అడిగాడు. వ్యాపారి ఏమాత్రము కోపగించుకోకుండా “ఇది ఐదు రూపాయలు నాయనా" అన్నాడు. ఆ పిల్లవాడు తిరిగి మరొక ముక్క చించి "ఇది ఎంత?" అని అడిగాడు. “రెండున్నర రూపాయలు నాయనా" అన్నాడు. పరమశాంతంగా, దానితో ఆ పిల్లవాని మనస్సు మారిపోయింది. ఎవరైనా యీవిధమైన తుంటరి పని చేస్తే వ్యాపారస్థుడు కోపపడటమో, లేక దూషించటమో, లేక రెండు కొట్టటమో జరుగుతుంది. కానీ, ఈ వ్యాపారి ఏమాత్రము కోపగించుకోలేదు. ఇంతటి పవిత్రమైన శాంతము ఈ - వ్యాపారికి ప్రీతిగా లభించిందని ఆ పిల్లవానిలో ఆశ్చర్యం కల్గింది. "అయ్యా! నేను నీ వస్త్రమును ముక్కలు ముక్కలుగా చేసినప్పటికీ నీవు పరమ శాంతంగా ఉన్నావు. నీ హృదయం చాల పవిత్రంగా ఉన్నది. ఈ పవిత్రత, ఈ శాంతము నీకు ఎట్లా లభ్యమైనాయి?" అని అడిగాడు. "నాయనా! భగవంతుడు శాంతస్వరూపుడు. అట్టి శాంతస్వరూపుణ్ణి నేను స్మరించటంచేత భగవంతుడు నాకు కూడా అట్టి శాంతమును అందించాడు." అన్నాడు. మీరు ఎవరిని ఆరాధిస్తుంటారో వారి భావములే మీయందు ఆవిర్భవిస్తాయి. భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు, శాంతస్వరూపుడు. భగవంతుణ్ణి కోరవలసింది ఏమిటి? మీ దగ్గర లేని ఆనందమును, శాంతమును అందించమని కోరాలి. అంతేగాని ఈ ప్రపంచంలో లభ్యమయ్యే ఈ సుఖమును, ఆ సుఖమును, ఈ సంతోషమును, ఆ సంతోషమును కోరకూడదు. ఎందుకంటే, అవన్ని తాత్కాలికమైనవే. శాంతిని అందించేది. పరమాత్ముడు ఒక్కడే. సత్యమును ప్రబోధించేది పరమాత్ముడు ఒక్కడే. కనుకనే, "సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అన్నారు. అట్టి భగవచ్చింతన చేతనే నాకీ శాంతి లభ్యమైంది అన్నాడు. ఆ పిల్లవాడు అతని పాదములపై పడి "అయ్యా!ఇక నుండి మీరే నాకు గురువు. ఇంతకాలం నా జీవితాన్ని చాల దుర్మార్గంలో గడిపినాను. నన్ను క్షమించి నాకు కూడా అట్టి పరమ శాంతము ప్రసాదించండి" అని కోరాడు. ఆ గురువే తిరువళ్ళువరు.
(సా. శృ, పు. 69/70)