తెల్లని వస్త్రాలు పవిత్రతను, నిర్మలత్వమును తెలియ చేస్తాయి. బుద్ధి పరిశుద్ధమైన అద్దం లాంటిది. అద్దం పైన మాలిన్యం చేరితే నీ స్వరూపాన్ని నీవు చూసుకోలేవు. మంచి బుద్ధితో ఉన్నప్పుడు విచక్షణా జ్ఞానం కల్గుతుంది. అప్పుడు నీలోని లోపాలు నీకు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకోగల్గుతాయి. కానీ ఈనాడు అట్లా జరగడం లేదు. ఎదుటి వ్యక్తిలోని లోపాలు నీకు కనబడుతున్నాయిగాని నీలోని లోపాలు నీకు కనబడటం లేదు. అద్దాన్ని నీ ముందుంచుకుంటే నీ రూపం కనబడుతుందిగాని ఎదుటి వ్యక్తివైపు మరల్చితే నీ రూపం ఎలా కనబడుతుంది? బుద్ధి అనే అద్దంలో నీ లోపాలు నీకు కనపడాలి. కానీ కనబడడం లేదు. ఎందువల్ల? దానిని ఎదుటి వ్యక్తివైపు త్రిప్పావు..
వైట్ డ్రెస్ వేసుకుంటే అది ఏ మాత్రం మురికి అయినా కనబడుగుంది. అదే కలర్ డ్రెస్ వేసుకుంటే కనబడదు. అంటే నీలో ఉన్న మాలిన్యాన్ని కవర్ చేసుకుంటున్నా వన్నమాట. ఇది తప్పు, మాలిన్యాన్ని కవర్ చేసుకోకూడదు. దానిని శుభ్రం చేసుకోవాలి. మంచినిగాని, చెడునుగాని ఏదైనా నీలో ఉంచుకోకూడదు. చెడును వదిలేయాలి. మంచిని పంచుకోవాలి. కానీ కొందరు మంచిని దాచుకుంటారు. చెడును పంచి పెడతారు. ఇది పొరపాటు. శివుడు చెడ్డదైన విషాన్ని కంఠంలో దాచుకొని తన శిరస్సు పైన చంద్రుణ్ణి ధరించి చల్లని వెన్నెలను అందరికీ వెదజల్లాడు. కనుకనే శివుడు నీలకంఠుడైనాడు.
(ససా.జులై 98 పు.189)